Breaking News

03/04/2019

విశాఖలో చిన్నమ్మ కలిసొచ్చేనా

విశాఖపట్టణం, ఏప్రిల్ 3,  (way2newstv.in)
విశాఖ నుంచి మరో మారు పోటీ చేస్తున్న దగ్గుబాటి వారి ఇంటి ఆడపడుచు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరిని గెలిపించడానికి తెర వెనక భారీ కసరత్తు జరుగుతోందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని కమలదళం పట్టుదలగా ఉందని భోగట్టా. పోటీలో ఉన్న మిగిలిన అభ్యర్ధులు అంతగా బలమైన వారు కాకపోవడం మొదటి విజయంగా బీజేపీ భావిస్తోంది. దాంతో కేంద్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, నందమూరి తారకరామారావు కుమర్తెగా ప్రముఖ నేపధ్యం, కేంద్రంలో మరో మారు మోడీ సర్కార్ వస్తుందన్న అంచనాలు ఇవన్నీ కలసి చిన్నమ్మను గెలిపిస్తాయని ఆశిస్తున్నారు. విశాఖలో బీజేపీ జెండా ఎగరేయాల్సిందేనని కూడా భావిస్తున్నారట.విశాఖ రైల్వే జోన్ తురుపు ముక్కగా ఇపుడు బీజేపీ వాడుకుంటోంది. దీని మీద ఎంతో కొంత సానుకూలత ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. వాల్తేరు డివిజన్ ను తీసివేయడం పట్ల కూడా ఇపుడు బీజేపీ నేత‌లు ఆచీ తూచీ మాట్లాడుతున్నారు. 


విశాఖలో చిన్నమ్మ కలిసొచ్చేనా 

కేంద్రంలో వచ్చేది తమ ప్రభుత్వమేనని అపుడు వాల్తేరు డివిజన్ వంటివన్ని పరిష్కారం అవుతాయని చెప్పుకొస్తున్నారు. ఇక ఉత్తరం అసెంబ్లీ సీట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కి కొంత సానుకూలత ఉందని, దాన్ని కూడా ఎంపీ అభ్యర్ధి గెలుపునకు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. అదే విధంగా విశాఖలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగుల సహకారం తమకే ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఉత్తరాది జనాభా విశాఖలో ఎక్కువగా ఉందని, వారంతా బీజేపీకే ఓటు చేసేలా చూడాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇక అన్నిటికంటే ముఖ్య విషయంగా చిన్నమ్మ సొంత సామాజిక వర్గం పెద్దలు ఇపుడు రంగంలోకి దిగి ఆమె గెలుపు బాధ్యలను భుజాన వేసుకున్నారట. విశాఖ ఎంపీ సీటుకు పోటీ పడుతున్న మిగిలిన వారు గెలిస్తే పెద్దగా ఉపయోగం లేదని, అదే చిన్నమ్మ గెలిస్తే కచ్చితంగా కేంద్ర మంత్రి అవుతారని, దాని వల్ల తమ పనులు చేసుకోవచ్చునని విశాఖలో సెటిల్ అయిన ఆ వర్గం తమ‌ వారందరికీ చెబుతున్నారట. మిగిలిన వారిని గెలిపించినా ఎంపీలుగా ప్రతిపక్షానికే పరిమితం అవుతారని చెప్పుకొస్తున్నారుట. అదే విధంగా టీడీపీ, వైసీపీల్లోని నాయకులకు కూడా గేలం వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక డిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన నాయకులు, దూతలు విశాఖలోనే మకాం వేసి పరిస్థితి అనుకూలం చేస్తున్నారుట. పాత పరిచయాలను కూడా ఇందుకోసం వాడుకుంటున్నారుట. మొత్తానికి చిన్నమ్మని ఎలాగైన్ ఆ గెలిపించాలన్న వ్యూహం ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి

No comments:

Post a Comment