Breaking News

26/04/2019

వంగవీటి రాధా..ఎందుకింత భాధ

విజయవాడ, ఏప్రిల్ 26 (way2newstv.in), 
వంగవీటి రాధాకృష్ణ. తెలుగుదేశం పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని వేయి కళ్లతో ఎదురు చూపులు చూస్తున్నారు. ఇందుకోసం యాగాలు కూడా చేశారంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదని, టీడీపీ అధికారంలోకి రావాలని వంగవీటి ఎంత బలంగా కోరుకుంటున్నారో ఇట్టే అర్థమవుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు వంగవీటి రాధా రాజకీయ భవితవ్యాన్ని తేల్చనున్నాయి. ఇప్పటికే దాదాపు పదేళ్ల పాటు పదవులకు దూరంగా ఉన్న వంగవీటి ఏ ఎన్నికకు ఆ ఎన్నికప్పడు పార్టీలు మారుతుండటంతో ఆయన రాజకీయంగా ఎదగలేకపోయారన్నది వాస్తవం.మరోసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు వంగవీటి పార్టీ మారారు. ఆయన అప్పటి వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 


వంగవీటి రాధా..ఎందుకింత భాధ

తనకు సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ ను జగన్ ఇవ్వరని గ్రహించిన వంగవీటి ఆ పార్టీ నుంచి బయటపడ్డారు. తన తండ్రి వంగవీటి రంగా తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీలోనే చేరిపోయారు. రాధా నిలకడలేని రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ, మరొకసారి ప్రజారాజ్యం, ఇంకొకసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ …ఇలా పార్టీలు మారడంతో వంగవీటి తన అభిమానుల్లోనే గందరగోళం సృష్టించారు.నిజానికి వంగవీటి రంగా సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయంగా మంచి బేస్ ను ఏర్పరిచారు. దాన్ని రాధాగాని, తల్లి రత్నకుమారి గాని సద్వినియోగం చేసుకోలేక పోయారు. చివరిగా తెలుగుదేశం పార్టీలో చేరిన రాధాకు ఆ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పింది. ఎమ్మెల్సీ పదవి హామీని తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకుంటుందా? లేదా? అని పక్కన పెడితే… వెంటనే రాధా చట్ట సభలోకి ప్రవేశించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందే. అధికారంలోకి వస్తేనే వెంటనే ఎమ్మెల్సీ పదవి దక్కుతుంది. లేకుంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. అప్పటికీ వస్తుందన్న నమ్మకం లేదు.ఇప్పటికే రాధా తన రాజకీయ తప్పటడుగులతో రాధా అనుచరులను కూడా దూరం చేసుకున్నారు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులను చూస్తే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పలేం. ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాధా మరో ఐదేళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి. అంటే మొత్తం పదిహేనేళ్ల పాటు రాధా రాజకీయ జీవితానికి తనంతట తానే ముసుగు వేసుకున్నారన్నమాట. అందుకే రాధా ఇప్పుడు బలంగా కోరుకుంటుంది ఒక్కటే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. వస్తేనే మరలా వంగవీటి కుటుంబానికి మనుగడ ఉంటుంది. రాధా అనుచరుల్లోనే ఇదే మాట విన్పిస్తుంది. అందుకే రాధా టీడీపీ మరలా అధికారంలోకి రావాలని వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. యాగాలు చేస్తున్నారు.

No comments:

Post a Comment