Breaking News

22/04/2019

అనంతపురంలో గాలి చక్రం తిప్పేనా

అనంతపురం, ఏప్రిల్ 22  (way2newstv.in)
రాయదుర్గంలో గెలుపోటములపై సహజంగానే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మంత్రి కాల్వ శ్రీనివాసులు మరోసారి బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా కాపు రామచంద్రారెడ్డి పోటీకి దిగారు. ఎన్నిక పూర్తి కావడంతో రెండు పార్టీలు ఎవరి లెక్కల్లో వారున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం మంత్రి కాల్వ శ్రీనివాసులుకు గెలుపు అంత సులువు కాదని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో ఉన్న బలహీనతలే కాల్వ కొంపముంచుతాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.కాల్వ శ్రీనివాసులు… జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించి లక్కుతో రాజకీయాల్లోకి కాలుమోపారు. తనకెందుకు రాజకీయాలు అనుకున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి పిలుపు వచ్చి ఏకంగా 1999లో అనంతపురం పార్లమెంటు సభ్యుడు కాగలిగారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతోంది. 



అనంతపురంలో గాలి చక్రం తిప్పేనా

2014లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాల్వ తన ప్రత్యర్థి కాపు రామచంద్రారెడ్డిపై అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత మంత్రిగా కూడా కావడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పెదయెత్తున చేపట్టారు.అయితే కాల్వ శ్రీనివాసులుకు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి నుంచి సహకారం అందలేదని సమాచారం. పైకి తాను మద్దతిస్తున్నట్లు చెబుతున్నా, ప్రచారంలో పాల్గొన్నా ఆయన వర్గం మాత్రం కాల్వకు వ్యతిరేకంగా పనిచేశారన్నది నియోజకవర్గంలో విన్పిస్తున్న టాక్. అలాగే టికెట్ ఆశించి భంగపడ్డ మరో మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద రెడ్డి సయితం వైసీపీ కండువా కప్పేసుకోవడంతో ఎన్నికలకు ముందు కాల్వకు పెద్ద దెబ్బ తగిలింది. కాల్వకు చివరి జాబితాలో టిక్కెట్ దక్కడం కూడా ఇక్కడ చర్చనీయాంశమైంది. అయితే కొద్దో గొప్పో కాల్వకు కలసి వచ్చే విషయం ఏంటంటే… బలమైన నేత పాటిల్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబం పసుపు కండువా కప్పుకోవడం. ఈ ఈక్వేషన్ల మధ్య కాల్వ గెలుపు అంత సులువు కాదన్న లెక్కలు విన్పిస్తున్నాయి.మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి బలంగాఉన్నారు. ఈ ప్రాంతం కర్ణాటక సరిహద్దుల్లో ఉండటంతో గాలి జనార్థన్ రెడ్డి మద్దతుతో కాపు ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశారనిచెబుతున్నారు. బీసీలు ఈనియోజకవర్గంలో అధికంగా ఉండటంతో టీడీపీ తమకు కలసి వస్తుందని అనుకుంటున్నా, అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాలను బీసీలకు వైసీపీ కేటాయించడంతో ఈసారి వారు వైసీపీ వైపు మొగ్గు చూపారంటున్నారు. మొత్తం మీద సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు రెండోసారి విజయం కష్టమేనన్నది అంచనా. మరి ఏం జరుగుతుందో చూడాలి.

No comments:

Post a Comment