Breaking News

23/04/2019

అమర్నాధరెడ్డికి గెలుపు అంత వీజీకాదు

తిరుపతి, ఏప్రిల్ 23, (way2newstv.in)
ఎన్నిక‌లు ముగిసిన ఏపీలో ఎన్నిక‌ల‌కు ముందున్న ఉత్కంఠ కంటే వంద రెట్లు ఎక్కువ‌గానే ఉత్కంఠ కొన‌సాగుతోంది. ప్రజ‌ల నాడిని అంచ‌నా వేయ‌డంలో ఏ ఒక్కరూ సాహ‌సించ‌లేక పోతున్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో స్తానిక అభ్యర్థుల బ‌లాబ‌లాలు, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు, ప‌సుపు-కుంకుమ వంటి కార్యక్రమాల ప్రభావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో మార్పు కావాల‌ని కూడా ప్రజ‌లు కోరుకోవ‌డం, ఒక్కఛాన్స్ పేరుతో జ‌గ‌న్ చేసిన ప్రచారం వంటివి కూడా భారీ ఎత్తున ప్రభావం చూపుతాయ‌ని అంటున్నారు. ఈ క్రమంలో దాదాపు 100కుపైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రు గెలుస్తార‌నే విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చసాగుతోంది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ప‌ల‌మ‌నేరు. ఇక్కడ నుంచి మంత్రి అమ‌రనాథ‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే, 2014లో ఆయ‌న వైసీపీ త‌ర‌ఫున ఇక్కడ నుంచి విజ‌యం సాధించారు. కానీ, రాజ‌కీయ సమీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో టీడీపీలో చేరి మంత్రి ప‌ద‌వి సాధించారు. 


అమర్నాధరెడ్డికి గెలుపు అంత వీజీకాదు

అమ‌రనాథ‌రెడ్డి గ‌తంలో టీడీపీలో ఉన్న వ్యక్తే. 2009లో అమ‌రనాథ్‌రెడ్డి టీడీపీ నుంచి విజ‌యం సాధించ‌గా… గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి జంప్ చేసి గెలిచారు. ఇక తాజా ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ టీడీపీ నుంచి పోటీ చేశారు. అయితే, ఇప్పుడు ఆయ‌న విజ‌యానికి చేరుకుంటారా? లేక ఎదురు గాలి వీస్తోందా? అనేది చ‌ర్చకు దారితీసింది. ఇక్కడ నుంచి వైసీపీ ఓ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న వెంకటేశ్ గౌడ్ అనే వ్యక్తికి టికెట్ కేటాయించారు. ఈ ఇద్దరి మ‌ధ్యే ప్రధానంగా పోరు సాగింది.మంత్రిగా ఉన్న అమ‌రనాథ‌రెడ్డికి క్షేత్రస్థాయిలో పార్టీ మారార‌ని, పెద్దగా ఎవ‌రినీ ప‌ట్టించుకోర‌ని, త‌న కోట‌రీకి మాత్రమే న్యాయం చేస్తున్నార‌నే వ్యతిరేక‌త ప్రబ‌లంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, అమ‌రనాథ‌రెడ్డి సొంత కుటుంబానికి చెందిన అనీషారెడ్డికి  పుంగ‌నూరులో టీడీపీ అధినేత టికెట్ ఇచ్చారు. పుంగ‌నూ రులో కూడా మంత్రి అమ‌రనాథ‌రెడ్డికి క్షేత్రస్థాయిలో బ‌ల‌మైన క్యాడర్ ఉంది. దీనిని అనీషా రెడ్డికి అనుకూలంగా మార్చడంలో అమ‌ర్నాథ‌రెడ్డి విఫ‌ల‌మ‌య్యారు. అస‌లు ఆ నియోజ‌క‌వ‌ర్గంపై నే క‌న్నెత్తి చూడ‌లేదు. ఇది కొంత డ్యామేజీగా మారింది. ఈ నేప‌థ్యంలోనే మంత్రి అమ‌ర్నాథ‌రెడ్డికి వ్యతిరేక‌ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని అంటున్నారు. ఇక‌, టీడీపీ కేడ‌ర్ కూడా బ‌లంగా ఆయ‌న ప‌క్షాన ప్రచారం చేయ‌లేదు. దీంతో అమ‌రనాథ‌రెడ్డి గెలుపు అంత ఈజీకాద‌ని అంటున్నారు. వైసీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ లేక పోవ‌డం, ఇక్కడ నుంచి బ‌రిలో నిలిచిన గౌడ్ కొత్తముఖం కావ‌డం ఒక్కటే అమ‌ర్నాథ్‌కు క‌లిసి వ‌స్తున్న అంశం. మ‌రి ఏంజ‌రుగుతుందో ? చూడాలి.

No comments:

Post a Comment