Breaking News

29/04/2019

పాల్వంచలో భారీ ఇసుక మాఫియా

ఖమ్మం, ఏప్రిల్ 29, (way2newstv.in)
కేటీపీఎస్ 7వ దశ నిర్మాణంలో భారీ ఇసుక మాఫియా నడుస్తోంది. రోజుకు వందల ట్రాక్టర్ల అక్రమ ఇసుక రవాణా అవుతున్నా అటు రెవిన్యూ అధికారులు కానీ, ఇటు మైనింగ్ అధికారులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవు. కొందరు అక్రమార్కులతో కెటిపియస్ అధికారులు కుమ్మక్కై జీరో ఇసుక రవాణాకు తెరలేపినట్లు సమాచారం. నిర్మాణానికి కావాల్సిన ఇసుక కోసం అప్రూవల్ చేసిన క్వారీని జెన్కో యాజమాన్యం నిర్మాణ కంపెనీలకు చూపించాల్సి ఉంది. కానీ అదేమి పట్టించు కోకపోవడంతోకొందరు అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి స్థానిక వాగులు, నదుల నుండి అక్రమంగా తీసుకొచ్చిన ఇసుకను నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన నిర్మాణ కంపెనీలు అక్రమ ఇసుక వ్యాపారుల నుండి ఇసుకను రవాణా చేసుకుంటున్నారని వినిపిస్తోంది.నిబంధనల ప్రకారం జెన్కో అధికారులు అప్రూవల్ చేసిన క్వారీల నుండి మాత్రమే ఇసుక రావాణా చేసుకోవాల్సి ఉంటుంది. కెటిపియస్ అధికారులు చూసి చూడనట్లు వ్యవ హరించడంతో సమీప మొర్రేడు, కిన్నెరసాని వాగుల నుండి ఇసుకను తీసుకొస్తున్నారు. 


పాల్వంచలో భారీ ఇసుక మాఫియా

సుమారు 7వ దశ సివిల్ నిర్మాణ పనులు 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 2లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను వాడారు.ఇప్పటివరకు నిర్మాణానికి జీరో ఇసుకనే వాడారనేది బహిరంగ రహస్యం. ఇంత మేర భారీ అక్రమ ఇసుక మాఫియా నడుస్తున్నా అటు రెవిన్యూ ఇటు మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. తూతు మంత్రంగా అప్పుడప్పుడూ ట్రాక్టర్లను పట్టుకుని కేసులు రాస్తున్నారు.నిర్మాణానికి నిబంధనల ప్రకారం గ్రేట్ 2 ఇసుకను వాడాల్సి ఉంది. కానీ అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యాపారులు సమీప వాటిల్లో గ్రేట్ 3, 4 ఇసుక మాత్రమే ఉందని సమా చారం. కెటిపియస్ అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కైనట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇసుకను ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు, ఏ గ్రేడు ఇసుకను రవాణా చేస్తున్నారనేది పట్టించుకోకుండా కాసుల మాటున ఉదాసీనత వ్యవహరిస్తున్నారని వినికిడి.ట్రాక్టరు యజమానులు ములకలపల్లి మండలం గుర్రాల కుంట ర్యాంపు నుండి గృహావసరాల నిమిత్తం అంటూ రశీదులు తీసుకుంటున్నారు. ఆ రశీదులతో సమీప శ్రీనివాస కాలనీలోని మొర్రేడు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. కొందరు కెటిపిఎస్ అధికారులు ఇసుక రవాణా ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు నడుస్తున్నాయని గమనించి ఓ గుత్తేదారుతో కుమ్మక్కయ్యారని వినిపిస్తోంది. ములకలపల్లి మండలం అన్నారం గ్రామంలో ఓ గుత్తేదారు ఇటీవల ఇసుక ర్యాంపుకు అనుమతులు తీసుకున్నారు. అక్కడి నుండే మొత్తం ఇసుకను రవాణా చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుని అప్రూవల్ చేశారు. ఆ గుత్తేదారుతో కొందరు కెటిపియస్ అధికారులు కుమ్మక్కై క్యూబిక్‌మీటర్‌కు రూ. 100 కమీషన్ ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. ఆ ర్యాంపు నుండే ఇసుక రవాణా చేసుకోవాల్సిందిగా నిర్మాణ కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి.పైస్థాయి అధికారుల కన్నుసన్నల్లోనే సాగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా సదరు గుత్తేదారు అనుమతులు తీసుకున్న క్వారీలో గ్రేడ్ 4 ఇసుక మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఇదేమి పట్టించుకోకుండా ఆ క్వారీకి అప్రూవల్ చేయడం చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారులు అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించి నిర్మాణ పనుల్లోనాణ్యతతో కూడిన ఇసుకను వినియోగించేటట్లు చూడాలని పలువురు కోరుతున్నారు.

No comments:

Post a Comment