Breaking News

04/03/2019

ఇంజనీరింగ్, ఫార్మసీ డిగ్రీ విద్యార్ధులకు బయోమెట్రిక్

వరంగల్, మార్చి 4, (way2newstv.in)
ఇంజినీరింగ్, ఫార్మసీ డిగ్రీ విద్యార్థులకూ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి కానుంది. సాంకేతిక విద్యలో అధ్యాపకులు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని ఇదివరకే అఖిల భారత విద్యామండలి పేర్కొంది. ప్రస్తుతం ఎం.టెక్, ఎం.ఇ, ఎం.ఫార్మసీ వంటి పిజి కోర్సులకు అధ్యాపకులతో పాటు విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తుండగా, అదే తరహాలో బి.టెక్, బి.ఇ, బి.ఫార్మసీ కోర్సుల్లో అమలు చేసేందుకు జెఎన్‌టియు సమాయత్తమవుతోంది. బయోమెట్రిక్ హాజరు విధానం ద్వారా ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో బోగస్ అధ్యాపకులకు చెక్ పడనుంది. ఒక లెక్చరర్ కచ్చితంగా ఒకే కళాశాలల్లో పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొంతమంది అధ్యాపకులు రెండు మూడు కళాశాలల్లో లెక్చరర్లుగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయోమెట్రిక్ హాజరు విధానం అమలైతే ప్రతి లెక్చరర్ ఒకే కళాశాలకు పరిమితం కావాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో అధ్యాపకులు ఒకే కళాశాలకు పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. 


ఇంజనీరింగ్, ఫార్మసీ డిగ్రీ విద్యార్ధులకు  బయోమెట్రిక్

వీటితోపాటు ప్రైవేట్ కళాశాలల్లో తప్పుడు హాజరు కూడా సులువుగా నియంత్రించే అవకాశం ఉంటుంది. బయోమెట్రిక్ హాజరు విధానం అమలైతే తరగతులకు డుమ్మా కొట్టే విద్యార్థుల ఆగడాలకు కళ్లెం పడనుంది. అయితే ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అమలులో ఎదురయ్యే సమస్యలను పరిశీలిస్తున్నారు. విద్యార్థులు కచ్చితంగా కళాశాలల్లో తరగతులకు హాజరుకావాలంటే బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాల్సిందేనని భావిస్తున్న జెఎన్‌టియు ప్రారంభంలో ఇబ్బందులు తలెత్తినా కచ్చితంగా అమలు చేసేందుకే మొగ్గు చూపుతోంది. ఈ మేరకు కళాశాలల అనుబంధ గుర్తింపు నిబంధనల్లో బయోమెట్రిక్ హాజరు విధానం పొందుపరచనున్నారు.ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయడానికి అయ్యే ఖర్చును చూసి కళాశాలలు వెనుకడుగు వేస్తున్నాయి. ఒక విద్యార్థికి ఒకసారి బయోమెట్రిక్ సేకరించడానికి 16 పైసలు ఖర్చవుతుంది. రెండు సార్లు బయోమెట్రిక్ హాజరు సేకరిస్తే ప్రతి రోజూ ఒక్కో విద్యార్థిపై 32 పైసలు వెచ్చించాల్సి ఉంటుంది. బి.టెక్, బి.ఇ, బి.ఫార్మసీ కోర్సుల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో ఉండటంతో బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తూ తమపై ఆర్థిక భారం పడుతుందని ప్రైవేట్ యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. నిర్వహణ వ్యయం తమకు భారంగా మారుతుందని కొంతమంది ప్రైవేట్ యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ డిగ్రీ కోర్సుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఏటా సుమారు లక్ష మంది విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. బి.టెక్, బి.ఫార్మసీ నాలుగు సంవత్సరాల కోర్సు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థులు సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటారు. వీరితో పాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అదనం. వీరందరికీ బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలంటే అధిక మొత్తం ఖర్చువుతుందని భావిస్తున్న కళాశాలలు ఈ విధానం అమలుకు ముందుకు రావడం లేదు.బయోమెట్రిక్ హాజరు విధానం ద్వారా కళాశాల ప్రిన్సిపాల్‌తోపాటు జెఎన్‌టియు, ఉన్నత విద్యామండలి అధికారుల వరకు ఆన్‌లైన్‌లో అధ్యాపకులు, విద్యార్థుల హాజరును సులువుగా పర్యవేక్షించగలుగుతారు. డాష్‌బోర్డ్ ద్వారా ఎప్పటికప్పుడు ఆయా కళాశాలల్లో నమోదవుతున్న హాజరు తెలుసుకోవచ్చు. యూనివర్సిటీ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు కళాశాలలను సందర్శించకుండానే ఏ రోజుకు ఆ రోజు అక్కడి హాజరు పరిస్థితిని తెలుసుకునే అవకాశం ఉంటుంది

No comments:

Post a Comment