Breaking News

04/03/2019

మంగళగిరిలో వైసీపీ ఎమ్మెల్యేకు ఝలకేనా..?

గుంటూరు, మార్చి 4, (way2newstv.in)
మంగళగిరి వైసీపీలో అలజడి ఇంకా కొనసాగుతోంది. ఆ పార్టీ అధిష్టానం సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి టిక్కెట్టు నిరాకరించిందన్న సమాచారంతో స్థానిక పార్టీ శ్రేణుల్లో అలజడి రేగింది. ఎమ్మెల్యే ఆళ్లను వ్యతిరేకిస్తున్న పార్టీలోని కొందరు బలమైన నేతలు మంగళగిరి టీడీపీ చెందిన కౌన్సిలర్‌ ఉడతా శ్రీనును లోటస్‌పాండ్‌కు తీసుకువెళ్లి ఏకంగా జగన్‌ చేతులమీదుగా అతనికి వైసీపీ తీర్థం ఇప్పించారు. అంతటితో ఆగకుండా మంగళగిరి టిక్కెట్టును ఉడతా శ్రీనుకే ఖరారు చేయబోతున్నట్టు విస్తృతంగా ప్రచారం చేశారు. అధినేత జగన్‌ వైఖరితో ఖంగుతిన్న ఎమ్మెల్యే ఆళ్ల శుక్రవారం ఉదయం నుంచే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.ఎమ్మెల్యే ఆళ్లను అమితంగా అభిమానించే పార్టీలోని ఆయన వర్గీయులు కూడా ఈ ఊహించని పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. 


మంగళగిరిలో వైసీపీ ఎమ్మెల్యేకు ఝలకేనా..?

దీంతో నియోజకవరక్గంలోని మూడు మండలాలు, రెండు పట్టణాల పార్టీ కన్వీనర్లతో పాటు కొందరు ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మరికొందరు కౌన్సిలర్లు తమ తమ పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తూ ఆయా లేఖలను అధిష్టానానికి శుక్రవారమే పంపించారు. అయితే పార్టీ అధిష్టానం ఈ పరిణామాలపై ఏమాత్రం స్పందించకపోవడంతో నియోజవకర్గంలోని ఆళ్ల వర్గీయులు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో శనివారం సమావేశమై కింకర్తవ్యమేమిటంటూ సమాలోచనలు చేశారు.అందరూ మరోమారు తమ రాజీనామా లేఖలను పార్టీ కేంద్ర కార్యాలయానికి, జిల్లా పార్టీ కార్యాలయానికి పంపించారు. తాడేపల్లి పట్టణానికి చెందిన 18 మంది వైసీపీ కౌన్సిలర్లలో సగం మంది పార్టీ సభ్యత్వాలతో పాటు కౌన్సిలర్‌ పదవులకు సైతం రాజీనామాలు చేస్తూ ఆయా లేఖలను అధినేత జగన్‌కు పంపించారు. మంగళగిరి ఎంపీపీ పచ్చల రత్నకుమారి, తాడేపల్లి ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి సైతం కొందరు ఎంపీటీసీలతో కలిసి తమ పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమంటూ పార్టీ అధిష్టానానికి లేఖలు పంపారు. పార్టీ అధిష్టానం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకుని ఆళ్లకే తిరిగి టిక్కెట్‌ కేటాయించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అధిష్టానం స్పందించకుంటే నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించి ఉమ్మడిగా కీలక నిర్ణయం తీసుకుంటామని ఆళ్ల వర్గీయులు తెలిపారు

No comments:

Post a Comment