Breaking News

28/03/2019

హిందూపురం... రసవత్తరం

అనంతపురం, మార్చి 28 (way2newstv.in)
హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి రసవత్తర పోరు సాగుతోంది. పదేళ్లుగా ఎంపీగా పనిచేసిన ఆయన ఒకవైపు…ఇటీవల ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగిన వారు మరోవైపు. తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు చెమటోడుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప హ్యాట్రిక్ కొట్టేందుకు చూస్తున్నారు. గోరంట్ల మాధవ్ ప్రభుత్వ కార్యాలయం నుంచి పార్లమెంటులోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం 1957లో ఏర్పడింది. మొత్తం ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గం లో పదిహేను సార్లు ఎన్నికలు జరగితే… కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఐదు సార్లు గెలుపొందాయి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూడా 1967 లో హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి లోక్ సభ స్పీకర్ అయ్యారు. అలాంటి ఈ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ పట్టుకోల్పోతుందన్న వాదనలు విన్పిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీపై ఉన్న వ్యతిరేకత, అంతర్గత కుమ్ములాటలు పార్టీకి నష్టం తెచ్చే విధంగా ఉన్నాయన్నది విశ్లేషకుల అంచనా. 


హిందూపురం... రసవత్తరం

ఇప్పటి వరకూ నియోజకవర్గ చరిత్ర చూస్తే రెండు సార్లు గెలిచిన వాళ్లు మూడోసారి గెలుపును దక్కించుకుంది ఒక్కరే. 1971 నుంచి 1984 వరకూ ఒక బాయపరెడ్డి మాత్రమే కాంగ్రెస్ నుంచి మూడుసార్లు విజయం సాధించారు.హిందూపురం నియోజకవర్గం పరిధిలో మడకశిర,రాప్తాడు, పెనుకొండ, హిందూపురం, ధర్మవరం, కదిరి అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ గట్టి పోటీ ఇస్తుంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హిందూపురం అసెంబ్లీలో వచ్చే మెజారిటీ తనను గట్టెక్కిస్తుందని నిమ్మల కిష్టప్ప నమ్మకంతో ఉన్నారు. కానీ ఈసారి హిందూపురంలోనే బాలకృష్ణ కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా లేకపోవడం, పీఏల పెత్తనం ఎక్కువ కావడంతో ఆయన తన విజయంకోసమే కష్టపడుతున్నారు. ఇక్కడ బాలకృష్ణ గెలిచినా పెద్దగా మెజారిటీ రాదన్నది అంచనా. ఇక పెనుకొండలో బీకే పార్థసారధికి, నిమ్మల కిష్టప్పకు అస్సలు పడదు. దీంతో బీకే పెనుకొండలో క్రాస్ ఓటింగ్ చేయించే అవకాశాలున్నాయన్నది సుస్పష్టం.ఇక మరో నియోజకవర్గం పుట్టపర్తిలోనూ పల్లె రఘునాధరెడ్డి ఏటికి ఎదురీదుతున్నారు. సొంత పార్టీ నేతలే ఆయనకు టిక్కెట్ ఇవ్వవద్దంటూ ఎదురుతిరిగారు.కొందరు ఏకంగా స్వతంత్ర అభ్యర్థిగా పల్లెకు వ్యతిరేకంగా నామినేషన్లు వేశారు. ధర్మవరంలో మాత్రం పరిస్థితి టీడీపీకి కొంత మెరుగ్గా ఉంది. మడకశిరలోనూ రెండు పార్టీలు పోటా పోటీగా తలపడుతున్నాయి. రాప్తాడులో సయితం నువ్వా? నేనా? అన్నట్లు పోటీ సాగుతోంది. దీంతో పాటు గోరంట్ల మాధవ్ కురుబ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ఈ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం ఆయనకు కలసివచ్చే అంశంగా చెబుతున్నారు. మొత్తం మీద హిందూపురం పార్లమెంటు పరిధిలో ఈసారి గెలుపు అవకాశాలు ఎక్కువగా వైసీపీకే ఉన్నాయన్నది అంచనా.

No comments:

Post a Comment