Breaking News

28/03/2019

సామినేని వర్సెస్ శ్రీరాం తాతయ్య

విజయవాడ, మార్చి 28 (way2newstv.in)
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇప్పుడు ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ హ్యాట్రిక్ కు దగ్గరగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఒకరు గెలిచినా హ్యాట్రిక్ గెలుపు అవుతుంది. మరొకరు ఓడిపోయినా హ్యాట్రిక్ ఓటమి అవుతుంది. జగ్గయ్యపేటలో అయితే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామినేని ఉదయభానుకు సానుకూల పవనాలు వీస్తున్నాయనే చెప్పాలి. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అభివృద్ధి ఆశించన మేరకు జరగకపోవడం, పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండటం టీడీపీ అభ్యర్థి శ్రీరాం తాతయ్యకు మైనస్ అని చెప్పాలి. మరోవైపు సామినేని ఉదయభాను పట్ల సానుభూతి పవనాలు వీస్తున్నాయి.జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్ దీనిని ముఖద్వారంగా చెప్పుకొస్తారు. ఒకప్పుడు ఇది కమ్యునిస్టులకు కంచుకోట. టీడీపీ ఆవిర్భావంతో జగ్గయ్యపేటలో పసుపుపార్టీ జెండా రెపరెపలాడింది. ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి1999 వరకూ జగ్గయ్యపేటలో తెలుగుదేశం పార్టీ జెండాయే ఎగిరింది. 


సామినేని వర్సెస్ శ్రీరాం తాతయ్య

1999, 2004 ఎన్నికల్లో ఇక్కడ హస్తం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. సామినేని ఉదయభాను రెండుసార్లు వరుసగా గెలిచారు. అయితే ఆ తర్వాత జరిగిన 2009, 2014 ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీనే విజయం వరించింది. రెండుసార్లు శ్రీరాం తాతయ్య టీడీపీ అభ్యర్థిగా సామినేని ఉదయభాను పైన విజయంసాధించారు.ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను టీడీపీ అభ్యర్థి శీరాం తాతయ్య పై కేవలం 1846 ఓట్ల తేడాతోనే ఓటమిపాలయ్యారు. 2009లో ఇద్దరి మధ్య తేడా ఐదు వేల వరకూ ఉంది. దీంతో ఈసారి తనదే గెలుపు అన్న ధీమాలో సామినేని ఉదయభాను ఉన్నారు. మూడోసారి తనను ఖచ్చితంగా జగ్గయ్యపేట ప్రజలు ఎన్నుకుంటారన్నది ఆయన విశ్వాసం. జగన్ పాదయాత్ర, ప్రభుత్వ వ్యతిరేకత తనను అలవోకగా గెలిపిస్తుందంటున్నారు. నిజానికి జగ్గయ్యపేటలో కొంత తెలుగుదేశంపార్టీ వెనుకబడినట్లే కన్పిస్తుంది.ఇక తెలుగుదేశం అభ్యర్థి శ్రీరాం తాతయ్య అభ్యర్థిత్వం ఎప్పుడో ఖరారు కావడంతో ఆయన ప్రచారంలో దూసుకు పోతున్నారు. గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ వేవ్, చంద్రబాబు ఇమేజ్, పవన్ కల్యాణ్ సహకారం శ్రీరాం తాతయ్యను గెలిపించాయి. ఈసారి తన వ్యక్తిగత ఇమేజ్ తోనే విజయం సాధించి హ్యాట్రిక్ కొడతానని శ్రీరాం తాతయ్య చెబుతున్నారు. సామినేని ఉదయ భాను సయితం ప్రచారాన్ని ఇప్పటికే ఒక దశ పూర్తి చేసుకున్నారు. జగ్గయ్యపేటలో పైకి పోరు హోరా హోరీగా కన్పిస్తున్నప్పటికీ వైసీపీకే ఇక్కడ ఎడ్జ్ ఉందంటున్నారు. ఎన్నికల నాటికి పరిస్థితులు మారితే చెప్పలేం కాని, ఇప్పటికైతే జగ్గయ్యపేటలో పదేళ్ల తర్వాత వైసీపీ జెండా ఎగిరే అవకాశాలున్నాయంటున్నారు.

No comments:

Post a Comment