Breaking News

27/03/2019

అనంతలో మరుగుదొడ్ల నిధులు దారి మళ్లుతున్నాయ్

అనంతపురం, మార్చి 27, (way2newstv.in
అనంతపురం జిల్లా వ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇచ్చే నిధులను పాలకులు, అధికారులు యథేచ్ఛగా మేసేస్తున్నారనే ఆరోపణలు సరత్రా విన్పిస్తున్నాయి. పదేళ్ల క్రితం నిర్మించిన వాటికి కూడా కొత్తగా బిల్లులను చేయించుకుని సంఘాల పేరుతో స్వాహాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రకంగా జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లాది రూపాయల మరుగుదొడ్ల నిధులు దోచేసే స్వాహాపర్వం కొనసాగుతోంది. కొందరు సంఘాల ముసుగులో ఈ దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క రాప్తాడు చుట్టు పక్కలే 300 మరుగుదొడ్లకు గాను 100కు పైగా ముందు కట్టిన వాటికి బిల్లులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 340 గ్రామ పంచాయితీల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు 2018 మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. స్వచ్ఛభారత్‌ లక్ష్యాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ స్వయాన పలు సందర్భాల్లో సమావేశాలు నిర్వహించి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందు కోసం మండలాలు, పంచాయితీల వారీగా స్పెషల్‌ ఆఫీసర్లను నియమించారు. ఇదే అదునుగా చేసుకున్న పచ్చ నాయకులు మరుగుదొడ్ల లక్ష్యం ముసుగులో పెద్దఎత్తున నిధులు దోచేందుకు రంగంలోకి దిగారు. 


అనంతలో మరుగుదొడ్ల నిధులు దారి మళ్లుతున్నాయ్

గ్రామైక్య సంఘాలు, స్వచ్ఛంద సంస్థల పేరుతో అధికారులతో చేయి కలిపి జేబులు నింపుకుంటున్నారు. ఇప్పటి వరకు కేవలం 21 గ్రామ పంచాయతీల్లో మాత్రమే వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి అయినట్లు అధికారిక ఘణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా మరుగుదొడ్లు నిర్మాణాల వివరాలు ఫీల్డ్‌ అసిస్టెంట్లు జియో టాగింగ్‌ చేసిన తర్వాత కంప్యూటర్‌ ఆపరేటర్‌కు వెళ్తుంది. ఎంపిడిఒ లాగిన్‌ నుంచి ఎస్‌ఇకి చేరుతుంది. ఉన్నతాధికారి అమోదం తర్వాత లబ్ధిదారుడికి రూ.6వేలు ఖాతాలో జమ అవుతుంది. పునాది, రంగులు,(బేస్మెంట్‌) పనులు తరువాత సిమెంట్‌, రేకులు, బేసిన్‌, కూలీలు ఖర్చులు అనంతరం రూ.9 వేలు ఖాతాలోకి జమ అవుతంది. ఈ నిధులను కాజేసేందుకు టీడీపీ నాయకులు అధికారులతో కుమ్మక్కై లబ్ధిదారుని ఖాతా కాకుండా ఆధార్‌, రేషన్‌ కార్డులు మాత్రమే ఇప్పించుకుని అప్రూవల్‌ చేయిస్తున్నారు. ఈ నిధులను గ్రామైక్య సంఘాల ఖాతాల్లోకి మళ్లించి డ్రా చేసుకుంటున్నారు. ఇది తెలుసుకుని లబ్ధిదారులు ఎవరైనా ప్రశ్నిస్తే ఎంతో కొంత ఇచ్చి బిల్లులు రాలేదని చెప్పుకొస్తున్నారు. క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పటం లేదు. అధికారులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోనే బిల్లులు మంజూరు చేస్తే ఇలాంటి అవకతవకలు జరిగే అవకాశాలుండవని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు. మంత్రి పరిటాల సునీత నియోజకవర్గంలోని పలు మండలాల్లో మరుగుదొడ్ల నిర్మాణాల్లో తీవ్ర స్థాయిలో అవినీతి జరిగినట్లు బహిరంగ ఆరోపణలు విన్పిస్తున్నాయి. రాప్తాడు మండల పరిధిలోని చెర్లోపల్లి గొళ్లపల్లి, పుల్లలరేవు, మరూరు, రాప్తాడు ప్రాంతాలలో మరుగుదొడ్ల నిధులు పక్కదారిపట్టాయి. ఇటీవల పుల్లలరేవులో ఓ మహిళా లబ్ధిదారురాలుకు సంబంధించిన రూ.10 వేలు బిల్లును ఆమెకు తెలియకుండానే కాజేశారు. దీంతో ఆమె టెక్నికల్‌ అసిస్టెంట్‌పై తీవ్ర స్థాయిలో కార్యాలయంలోనే ఆగ్రహం వ్యక్తం చేసింది. మరుగుదొడ్ల నిధుల స్వాహాలో అధికార టిడిపి నాయకులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment