Breaking News

29/03/2019

అమేధీ...లో మళ్లీ పాతకాపులే

లక్నో, మార్చి 29, (way2newstv.in)
అమేధీ….. పరిచయం అక్కరలేని పేరున. దేశంలోని ప్రముఖ లోక్ సభ నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఈ నియోజకవర్గం గురించి తెలియని వారు లేరనడం అతిశయోక్తికాదు. ఉత్తరప్రదేశ్ లోని ఈ నియోజకవర్గం గాంధీల కుటుంబానికి పెట్టని కోట వంటిది. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన పాత ప్రత్యర్థులే ప్రస్తుతం మళ్లీ తలపడుతున్నారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల సమయానికి రాహుల్ గాంధీ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు. ప్రస్తుతం అధ్యక్ష్య హోదాలో ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. 2014లో పోటీ చేసే నాటికి స్మృతి ఇరానీ బీజేపీ నాయకురాలు మాత్రమే. ప్రస్తుతం కేంద్ర మంత్రిగాచక్రం తిప్పుతున్నారు. అయిదేళ్ల నాటికి ఇప్పటికి ఇద్దరి నేతలు రాజకీయాలు బాగా వంటపట్టించుకున్నారు. క్రియాశీల రాజకీయాల్లో రాటుదేలారు. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప రాహుల్ గాంధీ అమేధీ నుంచి పార్లమెంటులోకి ప్రవేశించడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. 


అమేధీ...లో మళ్లీ పాతకాపులే

గత ఎన్నికల్లోనే ఆయనకు లక్ష ఓట్లకు పైగా మెజారిటీ సాధించారు. జిల్లా కేంద్రమైన ఈ నియోజకవర్గంలో తిలోయి, సలాన్, జగదీష్ పూర్, గౌరీ గంజ్, అమేధీ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో కూడా కాంగ్రెస్ పట్టుకోల్పోయింది. 1967 లె ఆవిర్భవించిన ఈ నియోజకవర్గం మొదటి నుంచి హస్తం పార్టీకి కంచుకోట. కాంగ్రెస్ అధినేతలే ఇక్కడి నుంచి పోటీ చేస్తూ వచ్చారు. రాహుల్ గాంధీ బాబాయి సంజయ్ గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, సన్నిహిత కుటుంబ సభ్యుడు కెప్టన్ సతీష్ శర్మ, రాహుల్ తల్లి సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. రెండే రెండుసార్లు 1977లో జనతా పార్టీ అభ్యర్థి రవీంద్ర ప్రతాప్ సింగ్, 1999లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ సంజయ్ సింగ్ గెలుపొందారు. మిగిలిన అన్ని సందర్భాల్లో హస్తం పార్టీ అభ్యర్థులే విజేతలుగా నిలిచారు. నియోజకవర్గం ఆవిర్భవించిన 1967లో కాంగ్రెస్ అభ్యర్థి విద్యాధర్ బాజ్ పేయి విజయం సాధించారు. తర్వాత 1971లో కూడా ఆయన విజయపతాకాన్ని ఎగురవేశారు. సంజయ్ గాంధీ మరణానంతరం 1980లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన రాజీవ్ గాంధీ చనిపోయేంతవరకూ (1991) ఇక్కడి నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. 1999లో తొలిసారిగా సోనియాగాంధీ అమేధీ లో గెలుపొందారు. 2004 నుంచి వరుసగా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం 80 సీట్లలో రెండే రెండు చోట్ల గెలుపొందింది. అవి అమేధీ, రాయబరేలి. అమేధీలో రాహుల్, రాయబరేలీలో సోనియా గాంధీ గెలుపొందారు. వాస్తవానికి నాటి ఎన్నికల్లో రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ ఈ రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించలేదు. పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులను నిలిపినా, పరోక్ష మద్దతు ప్రకటించకపోయినా పరిస్థితి మరోరకంగా ఉండేదనడంలో సందేహం లేదు. 2014 ఎన్నికలలో రాహుల్ గాంధీకి 4,08,651 ఓట్లు, స్మృతి ఇరానీకి 3,00,748 ఓట్లు పోలయ్యాయి. బీఎస్సీ అభ్యర్థి ఇక్కడ మూడో స్థానంలో నిలిచారు. గతం మీదచూస్తే రాహుల్ గాంధీ రాజకీయంగా రాటుదేలారు. ఆయన చేసే విమర్శల్లోనూ పదును కనపడుతోంది. ప్రసంగాల్లో పరిపక్వత వినపడుతోంది. నిన్న మొన్నటి దాకా పప్పూ అని ఎగతాళి చేసన వారందరూ కాంగ్రెస్ అధ్యక్షుడిలో కొత్తదనం కనపడుతోందని చెబుతున్నారు. నాయకత్వ లక్షణాలు, సంయమన ధోరణి, నలుగురినీ కలుపుకునిపోయే తత్వం రాహుల్ గాంధీలో గోచరిస్తుంది. ఇప్పటికిప్పుడు ప్రధాని మోదీకి ధీటైన నాయకుడిగా ఎదగకపోయినా,ప్రధాని అభ్యర్థి గా జనామోదం పొందకపోయినా భవిష్యత్తులో ఆ పదవిని చేజిక్కించుకోగల సత్తా రాహుల్ కు ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ బుల్లి తెర నటి. కరడు గట్టిన ఆర్ఎస్ఎస్ వాది. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరిన అనతి కాలంలోనే అధినేతల మెప్పు పొందారు. ఫలితంగానే కీలక స్థానంలో పోటీ చేసే అవకాశం లభించింది. ఓడిపోయినా రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టి కేంద్రమంత్రిని చేసింది కమలం పార్టీ నాయకత్వం. 2011లో గుజరాత్ నుంచి రాజ్యసభకు అడుగుపెట్టిన ఇరానీకి ప్రధాని మోదీ కీలకమైన మానవవనరుల మంత్రిత్వ శాఖను కట్టబెట్టారు. 2016లో జరిగిన మంత్రివర్గ మార్పుల్లో చేనేత జౌళిశాఖకు మార్చారు. దీంతో పార్టీలో ఆమె ప్రాధాన్యం తగ్గినట్లేననికొందరు భావించారు. తాజాగా అమేధీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఇరానీ తన సత్తా చాటారు. అమేధీలో ఆమె విజయం అనుమానాస్పదమే. అయినప్పటికీ ఇక్కడినుంచి పోటీ చేయడం ద్వారా దేశంలో కీలక నేతగా గుర్తింపు పొందారు.

No comments:

Post a Comment