Breaking News

27/03/2019

కష్టాల్లో రైతన్న (చిత్తూరు)

చిత్తూరు, మార్చి 27  (way2newstv.in): 
జిల్లాలో ప్రధాన వాణిజ్యపంట అయిన చెరుకు సాగుకు.. కనీస ప్రోత్సాహం కరువైంది. అన్ని వర్గాలను ముంచేసినట్లే.. జిలాల్లోని చెరుకు రైతులనూ తెలుగుదేశం ప్రభుత్వం దగా చేసింది. చివరికి చిత్తూరు, గాజులమండ్యం చక్కెర కర్మాగారాలను అర్ధాంతరంగా మూయించి వేసింది. అలాగే నల్లబెల్లంపై ఆంక్షలు విధించడంతో రైతులు చెరకు పంటను సాగు చేయలేని దుస్థితికి చేరారు.
జిల్లావ్యాప్తంగా రైతులు ఏటా సగటున 27 వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో చెరకు పంటను సాగు చేస్తారు. వర్షాలు బాగా కురిసి భూగర్భ జలాలు సంవృద్ధిగా ఉంటే ఆ ఏడు సాధారణ విస్తీర్ణంకన్నా అధికంగా దాదాపు 40 వేల హెక్టార్ల మేరకు చెరకు పంటను పండిస్తారు. అయితే 2014లో చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేపట్టాక చెరకు సాగు విస్తీర్ణం ఏటా తగ్గుముఖం పడుతోంది. 


కష్టాల్లో రైతన్న (చిత్తూరు)

రైతులకు కనీస ఆదరణ లేకపోవడంతో పెట్టుబడి కూడా దక్కక నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి. పైగా సాగునీరు అధికంగా వృథా అవుతుందనే పేరుతో.. చెరకు పంటను సాగు పై కొన్ని ఆంక్షలు విధించారు. పైగా నల్లబెల్లం తయారీకి ఇబ్బందులు సృష్టించడం, చిత్తూరు, గాజుల మండ్యం షుగర్‌ ఫ్యాక్టరీలను మూసివేయడంలో చెరకు రైతులకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. ఫలితంగా 2014 నుంచి ఏటా చెరకు పంట సాధారణ విస్తీర్ణంతో పాటు, సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టింది.
2014లో  27,705 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గాను 27,004 హెక్టార్లు, 2015లో 27,215 హెక్టార్లకు గాను 20,831 హెక్టార్లు, 2016లో 26,181 హెక్టార్లకు గాను 18,214 హెక్టార్లు, 2017లో 24,291 హెక్టార్లకు గాను 19,564 హెక్టార్లు, 2018లో 22,304 హెక్టార్లకు గాను 17,266 హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే చెరుకు సాగులోకి తీసుకొచ్చారు. ఉత్పత్తిని బెల్లంగా తయారు చేసి అమ్ముకోవాలన్నా.. రైతులకు కష్టాలు తప్పడం లేదు. దాడుల భయంతో వ్యాపారులు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కిలో బెల్లం రూ. 21 నుంచి రూ. 23 వరకు మాత్రమే ధర పలుకుతోంది. అయితే కనీసం కిలోకు రూ. 35 వస్తేగానీ గిట్టుబాటు అయ్యే పరిస్థితులు లేవని రైతులు వాపోతున్నారు.

No comments:

Post a Comment