Breaking News

13/03/2019

విశాఖ తమ్ముళ్లకు చినబాబు టెన్షన్

విశాఖపట్టణం, మార్చి 13, (way2newstv.in
విశాఖ జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఇపుడు చినబాబు పెద్ద చర్చగా మారారు. భావి నాయకుడుగా టీడీపీలో ఫోకస్ అవుతున్న లోకేష్ కన్ను భీమిలీ మీద పడింది. వచ్చే ఎన్నికల్లో కంచుకోట లాంటి భీమునిపట్నంలో పోటీకి దిగాలని లోకేష్ భావిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దాంతో అర్బన్ జిల్లాలో కొన్ని సీట్లు ఎంపిక కూడా పెండింగులో పడింది. భీమిలీలో ఈ మధ్యనే టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వచ్చి చేరారు. జగన్ ఆయనకు టికెట్ కూడా ఖరారు చేశారు. ఓ వైపు వైసీపీ అభ్యర్ధి ప్రచారంలో దూసుకుపోతూంటే టీడీపీకి మాత్రం ఇక్కడ ఎవరు వస్తారన్నది ఉత్కంఠగా మారింది. మంత్రి గంటా శ్రీనివాసరావు మరో మారు పోటీకి దిగుదామనుకున్నా లోకేష్ పోటీకి రెడీ అనడంతో ఆయన వెనక్కు తగ్గారు. భీమిలీలో లోకేష్ పోటీపై ఆ పార్టీ నిర్వహించిన సర్వేలో వ్యతిరేకత వచ్చినట్లుగా లేటెస్ట్ సమాచారం. 


విశాఖ తమ్ముళ్లకు  చినబాబు టెన్షన్

సామాజిక వర్గ సమీకరణలన్నీ లోకేష్ పోటీకి వ్యతిరేకంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక్కడ కాపు సామాజికవర్గం జనాభా ఎక్కువగా ఉంది. మొత్తం మూడు మండలాల్లో కూడా వారే అధిక సంఖ్యలో ఉన్నారు. దాంతో గడచిన మూడు ఎన్నికల్లో కాపులే వరసగా ఎమ్మెల్యేలుగా నెగ్గారు. ఇదిలా ఉండగా లోకేష్ భీమిలీలో పోటీకి ఆయన సామాజిక వర్గమైన కమ్మలు ఒక్క శాతం కూడా ఇక్కడ లేకపోవడం ఓ కారణమైతే నాన్ లోకల్ అన్నది బలమైన మైనస్ పాయింట్ గా మారుతోందని అంటున్నారు. ఈ పరిణామాలతోనే లోకేష్ పోటీకి భీమిలీ వస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.ఇక విశాఖ అర్బన్ జిల్లాలో ఉన్న మరో సీటు ఉత్తరం. ఇక్కడ నుంచి కూడా లోకేష్ పోటీ చేస్తారని మరో వైపు గట్టిగా ప్రచారం మొదలైంది. విశాఖ ఉత్తరం సీట్లో టీడీపీకి ఆశావహులు ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరూ లేరు. పొత్తులో భాగంగా 2014 ఎన్నికల్లో ఈ సీటుని బీజేపీకి కట్టబెట్టేశారు. దాంతో క్యాడర్ బాగా డీలా పడింది. అంతే కాదు. 2009లో ఉత్తరం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ టీడీపీ బోణీ కొట్టలేదు. తొలి ఎన్నికలో కాంగ్రెస్ కి చెందిన తైనాల విజయ కుమార్ గెలిచారు. ఇక విశాఖ 2 గా ఈ సీటు ఉన్నపుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. దాంతో దాదాపుగా దశాబ్దాల కాలంగా ఇక్కడ టీడీపీ జెండా ఎగరలేదు. దాంతో ఇక్కడ నుంచి లోకీష్ పోటీ ఎంతవరకూ శ్రేయస్కరమన్న మాట టీడీపీ నుంచే పుట్టుకువస్తోంది. ఇంతకీ లోకేష్ పోటీ చేస్తారా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది. మొత్తానికి తమ్ముళ్ళకు మాత్రం చినబాబు పోటీ అన్నది తెగ కలవరపెడుతోంది.

No comments:

Post a Comment