Breaking News

19/03/2019

బైరటీస్ గనులకు రెక్కలు

ఖమ్మం, మార్చి 19,(way2newstv.in)
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో కోట్లాది రూపాయల విలువచేసే బైరటీస్ గనులకు రెక్కలు వచ్చాయి. ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోని గార్ల మండలం శేరిపురం-పోచారం గ్రామాల సమీప ప్రాంతంలో కంపార్ట్‌మెంట్-45 ప్రాంతంలో అటవీ భూముల్లో వందలాది ఎకరాల్లో బైరటీస్ గనులు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ భూములు ప్రధానంగా అటవీ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ అ శాఖ అధికారుల నియంత్రణ లేకపోవడంతో పాటు వారి కనుసన్నల్లో ఆంధ్రకు చెందిన ఓ ప్రముఖ నాయకుని బంధువుల సమక్షంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి హయంలో బైరటీస్‌ను వందలకొద్ది లారీలలో తరలించుకుపోయేవారు. అప్పుడు హద్ధు, అదుపు లేకపోవడంతో గనులు పెద్ద మొత్తంలో తరలించుకుపోయారు. అ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కూడా అటవీ, మైనింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి తోడు నెల నెల మామూళ్లకు ఆశపడి అక్రమదారులకు కొమ్ము కాస్తూ బైరటీస్ తరలిపోతున్న తమకేమీ పట్టనట్లుగా అశాఖ అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.శేరిపురం, పోచారం సమీపంలోని కంపార్ట్‌మెంట్-45 ప్రాంతంతో పాటు ఖమ్మం అర్బన్ మండల పరిధిలో కూడా బైరటీస్ గనులు ఉన్నాయి. 


బైరటీస్ గనులకు రెక్కలు

ఇటీవల కాలంలో రాత్రిపూట ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎంపి అనుచరగణం వీటిపై కన్నేసి తరలించుకుపోతున్నారు. గతంలో బైరటీస్ తరలించేందుకు వాసుదేవరెడ్డి అనే వ్యక్తి ప్రధానపాత్ర పోషించేవారు. వీరితో పాటు గుండా వెంకటరెడ్డి, వడ్లమూరి దుర్గా ప్రసాద్‌లతో పాటు తోటకూరి పిచ్చయ్య, మన్నెపూడి సత్యనారాయణతో పాటు పలువురు గిరిజనులు మాజీ ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో ఈ బైరటీస్‌ను తరలించుకుని వెళ్లి కోట్లు సంపాదిస్తున్నారు.ఇటీవల అటవీశాఖ అధికారులు దాడులు చేసిన అక్రమ తరలింపు మాత్రం యదేచ్ఛగానే కొనసాగుతుంది. పోచారం గ్రామ పరిధిలోని బైరటీస్‌కు బహిరంగ మార్కెట్‌లో మంచి ధర ఉండటంతో ఈ గనులపై కన్నెసిన ప్రబుద్ధులు అధికార పార్టీ నేత అండదండలతో బైరటీస్ ఖనిజాన్ని దొంగచాటుగా వెలికితీసి అక్రమంగా రాత్రి సమయంలో నెంబర్లు లేని ట్రక్కులలో తరలించుకుపోతున్నారు. బైరటీస్ తరలించుకుపోతున్న అధికారులు నామమాత్రం దాడులు చేయడమే మినహా వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ రవాణా యధావిధిగా కొనసాగుతుంది. ప్రధానంగా బైరటీస్ తరలింపులో ప్రధాన సూత్రదారులలో రెండు వర్గాలుగా విడిపోవడంతో ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోకపోవడంతోనే బైరటీస్ అక్రమంగా తరలిపోతుందనేది స్పష్టం. ప్రధానంగా ఈ బైరటీస్ తెలంగాణ నుంచి ఆంధ్రాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతాంగంలో అంతా అధికార పార్టీ సూత్రదారులతో పాటు ప్రధానంగా ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులే ప్రధానంగా భూమిక పోషిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికైన అటవీ, మైనింగ్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో దాడులు నిర్వహిస్తే సూత్రదారులు ఎవరో బయటపడటం జరుగుతుంది. అ శాఖల ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అక్రమంగా తరలిపోతున్న బైరటీస్ గనులను రక్షించి ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు కృషి చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది మరి.

No comments:

Post a Comment