Breaking News

06/03/2019

బీజేపీ, శివసేనలో జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్

ముంబై, మార్చి 6, (way2newstv.in)
భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీల మధ్య మహారాష్ట్రలో పొత్తు పొడవటానికి అనేక కారణాలున్నాయంటున్నారు. కేవలం పార్లమెంటు ఎన్నికలతో మాత్రమే ఈ పొత్తు ముడిపెట్టకుండా అసెంబ్లీ ఎన్నికల వరకూ లాగాలని శివసేన ఈ చర్చల్లో ప్రయత్నించినట్లు చెబుతున్నారు. మహారాష్ట్రంలో శివసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తుండటంతో విజయావకాశాలు మెరుగయ్యాయంటున్నారు. గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని రెండు పార్టీలు ధీమాగా ఉన్నాయి.  మహారాష్ట్రలో మొత్తం 48 పార్లమెంటు స్థానాలుండగా భారతీయ జనతా పార్టీ 25, శివసేన 23 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇంతవరకూ బాగానే ఉంది. రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కేవలం పార్లమెంటు ఎన్నికల్లోనే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో్నూ కలసి పోటీ చేయాలని నిర్ణయించాయి. 


బీజేపీ, శివసేనలో జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్

అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి తిరిగి వస్తే భారతీయ జనతాపార్టీ రెండున్నరేళ్లు, శివసేన రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని కూడా ఈ చర్చల్లో ఒప్పందం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీన్ని శివసేన మంత్రి రామ్ దాస్ కదం కూడా ధృవీకరించారు.అయితే తొలుత పార్లమెంటు ఎన్నికల తతంగం పూర్తయితే తర్వాత అసెంబ్లీ ఎన్నికల గురించి ఆలోచించవచ్చని బీజేపీ ఆలోచించింది. శివసేన పెట్టిన ఈరెండున్నరేళ్ల ప్రతిపాదనకు తాము అంగీకరించలేదని బీజేపీ నేతలు కొందరు బయటకు చెబుతున్నప్పటికీ అంతర్గతంగా ఒప్పందం కుదిరినట్లు ఖచ్చితమైన సమాచారం అందుతుంది. ఈ రెండున్నరేళ్ల పదవీకాలాన్ని ముందు ఎవరు చేపట్టాలో కూడా నిర్ణయం జరిగిందంటున్నారు. రెండు పార్టీల్లో ఎవరికి అత్యధిక స్థానాలు వస్తే వారు ముందు సీఎం పదవి చేపడతారని, ఆ తర్వాత ఛాన్స్ మరొక పార్టీకి దక్కుతుందన్న ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు.లోపాయికారిగా కుదిరిన ఒప్పందం కూడా బీజేపీకి లాభమేనంటున్నారు. లోక్ సభ ఎన్నికలు జరిగి భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మహారాష్ట్ర శాసనసభ గురించి ఒక నిర్ణయం తీసుకోవచ్చన్నది ఆ పార్టీ నేతల వ్యూహంగా ఉంది. ఎటూ రెండు పార్టీల్లో అధిక స్థానాలు తమకే వస్తాయి కనుక తొలి రెండున్నరేళ్లు తమకే లభిస్తుందని, ఆ తర్వాత రెండున్నరేళ్ల సంగతి తర్వాత చూసుకోవచ్చని బీజేపీ భావిస్తుందంటున్నారు. అయితే ఇది జెంటిల్మెన్ అగ్రిమెంట్ కావడంతో ఎవరూ కాదనలేని శివసేన నేతలు చెబుతున్నారు. మొత్తం మీద శివసేన అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగానే బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడానికి ముందుకు వచ్చిందన్నది వాస్తవం.

No comments:

Post a Comment