హైద్రాబాద్, ఫిబ్రవరి 5, (way2newstv.in)
వరదల సందర్భంగా హుస్సేన్‌సాగర్ సర్‌ప్లస్ నాలాకిందగల లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను తగ్గించేందుకు నాలాకు ఇరువైపులా రీటెయినింగ్ వాల్స్ నిర్మించాలని జీహెచ్‌ఎంసీ సంకల్పించింది. దీనికోసం రూ. 68.40కోట్లతో అంచనాలు రూపొందించారు. ఐదేళ్ల రిటర్న్ పిరియడ్‌తో నాలాను విస్తరించకుండానే గోడలను నిర్మించాలని నిర్ణయించారు. పాలకమండలి ఆమోదం లభించిన అనంతరం పనులు చేపట్టనున్నారు. హుస్సేన్‌సాగర్ సర్‌ప్లస్‌నాలా మారియట్ హోటల్ నుంచి కవాడిగూడ, గాంధీనగర్, అశోక్‌నగర్, నల్లకుంట, అంబర్‌పేట్ తదితర ప్రాంతాలమీదుగా మూసీలో కలుస్తున్నది. 3.643 కిలోమీటర్ల పొడవుగల కలాసీనాలాతో కలిపి సుమారు 9.125 కిలోమీటర్ల పొడవుగల ఈ నాలా విస్తరించివున్నది.
సిటీలో లోతట్టు ప్రాంతాలకు...నో టెన్షన్
వర్షాకాలంలో హుస్సేన్‌సాగర్ నుంచి వదిలే వరదనీటితో లోతట్టు ప్రాంతాలకు ప్రమాదం పొంచివుం ది. ముఖ్యంగా 2000లో వచ్చిన వరదలకు ఆ ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో అప్పట్లో ముంపు సమస్యపై నియమించిన కిర్లోస్కర్ కమిటీ నాలాలను విస్తరించాలని నివేదిక సమర్పించింది. అయితే అది ఇంతవరకు సాధ్యం కాలేదు. నాలాల విస్తరణకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టగా, స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. వరదలప్పుడు నాలా పొంగి ముంపు సమస్య తలెత్తకుండా నాలాకు ఇరువైపులా గోడలు నిర్మిస్తేచాలని లోతట్టు ప్రాం తాల ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయాలపై అధ్యయనంచేసి నివేదిక సమర్పించాలని ఎన్‌ఎస్‌ఎస్ అసోసియేట్ కన్సల్టెంట్‌ను నియమించా రు. వారు ఐదేళ్ల వర్షపాతాన్ని పరిగణలోకి తీసుకొని ఇరువైపులా రీటైయినింగ్ వాల్స్ నిర్మించే విధంగా నమూనాలు సిద్ధంచేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించారు. గతంలో గోడలు నిర్మించిన ప్రాం తాలను మినహాయించి. మిగిలిపోయినచోట నిర్మించాలని నిశ్చయించారు. కవాడిగూడ బ్రిడ్జి నుంచి నాలా మూసీలో కలిసే ప్రాంతం వరకు సుమారు 5.482 కిలో మీటర్ల పొడవు ఉండగా, అందులో ఇప్పటివరకు 1.800కి.మీ.లమేర గోడల నిర్మాణం పూర్తయింది. మరో 0.165కి.మీ.ల పొడవున పనులు జరుగుతున్నాయి. మిగిలిన 3.212కి.మీ.ల పొడవున గోడలు నిర్మించాల్సివుంది. దీనికోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటి నిర్మాణానికి రూ.68.40 కోట్లు ఖర్చవుతుందని అంచాలు రూపొందించారు. బల్దియా పాలకమండలి ఆమోదం అ నంతరం ప్రభుత్వానికి పంపి అనుమతులు వచ్చాక పను లు చేపడతారు.
No comments:
Post a Comment