Breaking News

12/02/2019

ఉందిగా జాగా...వేసేయ్ పాగా

విశాఖపట్టణం, ఫిబ్రవరి 12, (way2newstv.in)
గ్రేటర్ విశాఖలో  గట్లు  క్రమంగా రూపు మారిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఆక్రమణలతో కొన్ని, పూడ్చివేతతో మరికొన్ని మాయమవుతున్నాయి. గెడ్డలను సంరక్షిస్తామని, ఆధునికీకరణ చర్యలు చేపడతామని జివిఎంసి అధికారులు నిరంతరం ప్రకటనలు గుప్పిస్తున్నారు తప్ప ఆ దిశగా చర్యలు కానరావడం లేదు. ఒకటో వార్డు పరిధిలోని ముడసర్లోవ రిజర్వాయర్‌ నుంచి పార్కు, గోల్ఫ్‌కోర్టు మీదుగా శ్రీకాంత్‌నగర్‌, సూర్యతేజనగర్‌లను ఆనుకొని పెదగదిలి, హనుమంతువాక, ఎంవిపి కాలనీ, లాసన్స్‌బే కాలనీల మీదుగా ఉన్న ఓ విశాలమైన గెడ్డ సముద్రంలో కలుస్తోంది. ఇది గతంలో 50 అడుగుల వరకు విస్తరించి ఉండేది. 



ఉందిగా జాగా...వేసేయ్ పాగా 

ఆక్రమణలతో ప్రస్తుతం 10 అడుగుల కంటె ఎక్కువ వెడల్పు కనిపించడం లేదు. శ్రీకాంత్‌నగర్‌ వద్ద ఈ గెడ్డను ఆనుకొని కార్పొరేట్‌ ఆసుపత్రులను నిర్మిస్తున్నారు. వాటి నిర్వాహకులు మట్టిని ఈ గెడ్డ అంచున వేయడంతో అది కాస్త చిన్నపాటి పిల్లకాలువలా మారింది. స్కిల్‌ డవలెప్‌మెంటు ఇనిస్టిట్యూట్‌కు ఆనుకొని ఉన్న గెడ్డను కూడా నిర్వాహకులు చాలా వరకు కప్పేశారు. ఒకప్పుడు 40 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ గెడ్డ 10 అడుగులకు కుచించుకుపోయింది. ఇదంతా బహిరంగంగానే కనిపిస్తున్నా జివిఎంసి అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. దీంతో వర్షపు, వాడుక నీరు సజావుగా పోయే తోవలేక మురుగు ఎక్కడికక్కడ నిల్వ ఉండిపోతోంది. ఫలితంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే వర్షాకాలంలో గెడ్డను ఆనుకుని ఉన్న ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా అధికారులు గెడ్డలను కప్పేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. గెడ్డలను ఆధునీకరించాల్సి ఉందని వారు చెబుతున్నారు. 

No comments:

Post a Comment