Breaking News

14/02/2019

కర్ణాటకలో ఆడియో టేపుల కలకలం

బెంగళూర్, ఫిబ్రవరి 14, (way2newstv.in)
 కర్ణాటక రాజకీయాలు ఆడియో టేపులు, ఆడియో క్లిప్పుల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ టేపులు, క్లిప్పుల వ్యవహారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నాయకులకు ఉచ్చులా బిగుసుకుంటున్నాయి.వారి పాలిట ఉరితాళ్లవుతున్నాయి. ఆపరేషన్ కమల పేరుతో కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) ఎమ్మెల్యేలకు గాలం వేస్తూ ఆడియో టేపులతో సహా దొరికిపోయిన కర్ణాటక బీజేపీ నాయకుల నెత్తిన మరో పిడుగు పడింది. ఆడియో టేపుల వ్యవహారంలో పీకల్లోతు మునిగిపోయిన ఆ పార్టీని నిండా ముంచేసే మరో ఆడియో క్లిప్ తాజాగా వెలుగులోకి వచ్చింది.దేవేగౌడకు రోజులు దగ్గర పడ్డాయి. ఆయన ఇంకెన్ని రోజులు బతుకుతారు. తొందర్లోనే చచ్చి పోతారు. ముఖ్యమంత్రి కుమారస్వామికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఎప్పుడూ అనారోగ్యం బారిన పడుతూనే ఉంటారు. 


కర్ణాటకలో ఆడియో టేపుల కలకలం

వారిద్దరూ లేకపోతే జనతాదళ్ (ఎస్) పార్టీ గతేం అవుతుంది. జేడీఎస్ చరిత్ర ముగిసిపోతుంది. దాని కథ ఖల్లాస్ అవుతుంది.. అంటూ బీజేపీ శాసన సభ్యుడు ప్రీతమ్ గౌడ మాట్లాడినట్టుగా అనుమానిస్తోన్న ఆడియో క్లిప్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఆడియో క్లిప్ బయటికి వచ్చిన వెంటనే జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. హసన్‌లో ప్రీతమ్ గౌడపై దాడి చేశారు. ఆయన ఇంటి పై రాళ్లవర్షం కురిపించారు. రాళ్ల దాడిలో ప్రీతమ్ గౌడ గాయపడ్డారు. ఆయన ముఖం రక్తసిక్తమైంది. ప్రీతమ్ గౌడ హసన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున పోటీ చేసి, విజయం సాధించారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆపరేషన్ కమలలో భాగంగా.. జేడీఎస్‌కు చెందిన గుర్మిట్‌కల్ శాసన సభ్యుడు నాగనగౌడతో బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప పార్టీ ఫిరాయిస్తే, 50 కోట్ల రూపాయలను ఇస్తానంటే ఫోన్‌లో మాట్లాడిన సంభాషణలు ఇటీవలే బహిర్గతమయ్యాయి. ఈ టేపులు అసెంబ్లీని కుదిపేస్తున్నాయి.ప్రీతమ్ గౌడకు సంబంధించినట్లుగా చెబుతున్న ఆడియో క్లిప్పులు కూడా బయటికి రావడంతో.. బీజేపీ ఇక పూర్తిగా రక్షణాత్మక ధోరణిలో పడిపోయింది. గుర్మిట్‌కల్ ఎమ్మెల్యేతో మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని యడ్యూరప్ప వివరణ ఇచ్చుకుంటున్నారు.ప్రీతమ్‌గౌడ క్లిప్ కూడా వెలుగులోకి రావడం బీజేపీకి విఘాతంలా మారింది. ఓ న్యూస్ ఛానల్ ఈ ఆడియో క్లిప్పులను ప్రసారం చేసింది. ఆ వెంటనే జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహించారు. ప్రీతమ్ గౌడపై దాడి చేశారు. హసన్ విద్యానగర్ ప్రాంతంలోని ప్రీతమ్ గౌడ ఇంటి వద్ద బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. ఆయన బయటికి రావడంతో, రాళ్లు విసిరాు.రాళ్ల దాడిలో ప్రీతమ్ గౌడ కుండి కంటికి గాయమైంది. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి ఘటనపై ప్రీతమ్‌గౌడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. రాళ్లు విసిరిన వారిలో కొంతమందిని అదుపులోకి తీసుకన్నారు. కాగా బీజేపీ నేతలు వెన్నాడుతోండగా, జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు మాత్రం కోపంతో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయా బీజేపీ నేతల ఇళ్ల వద్ద బందోబస్తు పెంచారు.
విచారణతో యడ్డీకి కష్టకాలమే
కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అడ్డంగానే బుక్కయ్యేటట్లుంది. ఆడియో టేపుల వివాదాన్ని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రత్యేక దర్యాప్తు సంస్థకు అప్పగించారు. పదిహేను రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సిద్ధరామయ్య, కుమారస్వామి కలసి పన్నిన వ్యూహం కమలానికి షాక్ తగిలేలా ఉంది. లోక్ సభ ఎన్నికల వేళ ఇది తమకు కలసి వచ్చే అంశంగా కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లు భావిస్తున్నాయి. కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కుమారస్వామికి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు యడ్యూరప్ప కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు యడ్యూరప్ప ఏదో ఒక ప్రయత్నాలు చేస్తుండటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక నానా అవస్థలు పడ్డారు. ముఖ్యంగా సిద్ధరామయ్య ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ వారిని జారిపోనివ్వకుండా కాపాడుకోగలిగారు. అయినా నలుగురు ఎమ్మెల్యేలు గీత దాటి వెళ్లిపోయారు.మ్యాజిక్ ఫిగర్ కు సంకీర్ణ సర్కార్ దగ్గరగా చేరుకోవడంతో సిద్ధరామయ్య, కుమారస్వామి అప్రమత్తమయ్యారు. యడ్యూరప్పను నిలువరించేందుకు సిట్ ను ఏర్పాటు చేశారు. సిట్ ఏర్పాటుపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ఈ అంశంలో ముఖ్యమంత్రి కుమారస్వామి జోక్యం ఉండటంతో సిట్ తమను ఖచ్చితంగా టార్గెట్ చేస్తుందని బీజేపీ నేతల్లో భయం బయలుదేరింది. అందుకే వారు సిట్ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు నిన్న మొన్నటి వరకూ సిద్ధరామయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడిన కుమారస్వామి సయితం కొంత వెనక్కు తగ్గారు. సిద్ధరామయ్య చెప్పినట్లుగానే ప్రభుత్వం నడుస్తుందని ఆయన బహిరంగంగా ప్రకటించడం విశేషం. సిద్ధరామయ్య తమ నాయకుడని కుమారస్వామి ప్రకటించి కాంగ్రెస్ నేతల్లో ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. ఇలా యడ్యూరప్ప చేసిన తప్పిదంతో నిన్నటి వరకూ నిప్పు, ఉప్పులా ఉన్న కుమారస్వామి, సిద్ధరామయ్యలు ఒక్కటయ్యారు. మొత్తం మీద పదిహేను రోజుల్లో సిట్ సమర్పించే నివేదికలో ఏముంటుందోనని యడ్యూరప్ప కు కంటిమీద కునుకులేకుండా పోయింది.

No comments:

Post a Comment