Breaking News

06/02/2019

పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమౌతున్న యంత్రాంగం

నల్లగొండ, ఫిబ్రవరి 6, (way2newstv.in)
గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ముగిసిందో.. లేదో.. వెంటనే జిల్లా యంత్రాంగం పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో మునిగిపోయింది. మూడ్రోజుల క్రితమే నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులతో ముందస్తు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో యంత్రాంగం సిద్ధం కావాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని స్థాయిల యంత్రాంగాన్ని ఆదేశించింది. అధికారుల బదిలీలు, ఈవీఎంల తనిఖీలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్ల వంటి అంశాలు ముందస్తుగా పరిశీలించుకునే క్రమంలో అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ యంత్రాలనే పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించనున్నారు. దీంతో వాటిని తనిఖీ చేసే కార్యక్రమం సైతం మొదలుపెట్టనున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు కొత్త ఓటర్ల నమోదు కోసం ఇచ్చిన గడువు సైతం ఈ నెల 4తో ముగిసింది. 


పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమౌతున్న యంత్రాంగం

ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్లతోపాటు గతంలో ఓట్లు లేని వాళ్లు, ఓటు చిరునామా మార్పించుకున్న వాళ్లతో కలిపి ఎన్నికల అధికారులకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల కాకముందు మరో అవకాశం దాదాపుగా రాకపోవచ్చని తెలుస్తోంది. అయితే దేశ వ్యాప్తంగా 29 రాష్ర్టాల్లోని 543 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున ఈ నెలలోనే షెడ్యూల్ విడుదల కావడంతోపాటు నోటిఫికేషన్ కూడా వెలువడుతుందనే అంచనాలు నెలకొన్నాయి. మే నెలతో ప్రస్తుతం కొనసాగుతున్న 16వ లోక్‌సభ గడువు పూర్తి కానున్న సంగతి తెలిసిందే. త్వరలోనే షెడ్యూల్ వస్తుందనే అంచనాతో అప్రమత్తమైన యంత్రాంగం.. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల పెంపు కోసం ప్రతిపాదించింది కూడా. శాసనసభ ఎన్నికల సమయంలోనే పలు పోలింగ్ కేంద్రాల్లో గడువు ముగిసినా అర్థరాత్రి వరకు ఓటర్లు బారులు తీరిన నేపథ్యంలో.. పల్లెటూళ్లలో 1100 ఓట్లు, పట్టణాల్లో 1300 ఓట్లు దాటిన చోట అదనపు పోలింగ్ కేంద్రాలు పెట్టాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 198 పోలింగ్ కేంద్రాలు అదనంగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. నల్లగొండ పార్లమెంట్ స్థానం పరిధిలో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జున సాగర్, కోదాడ, సూర్యాపేట, హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానాలు ఉండగా.. భువనగిరి పార్లమెంట్ పరిధిలో భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తితోపాటు ఇబ్రహీంపట్నం, జనగాం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి 

No comments:

Post a Comment