వరంగల్, ఫిబ్రవరి 6, (way2newstv.in)
తెలంగాణలో మొదట అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.. ఆ వెంటనే పంచాయితీ బెల్ మోగించి అది కూడా విజయవంతంగా ఫినిష్ చేశారు. ఇక ఇప్పుడు సహకార సంఘాల ఎన్నికలే ముందున్నాయి అనుకున్నారంతా. కానీ లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సహకార ఎన్నికలను వాయిదా వేసే దిశగా అడుగులు వేస్తోందట తెలంగాణ ప్రభుత్వం. లోక్ సభ ఎన్నికలకు మరో మూడు నెలల సమయమే ఉండటంతో ఈ సమయంలో వాటిపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నాయట టీఆర్ఎస్ వర్గాలు. అందుకే ఈ తరుణంలో సహకార సంఘాల ఎన్నికలు పెట్టుకోవటం ఉత్తమం కాదనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.
లోకసభ తర్వాతే సహకార ఎన్నికలు
నిజానికి తెలంగాణ రాష్ట్రంలో సహకార సంఘాల పాలక వర్గాల పదవీకాలం 2018 ఫిబ్రవరి నెలలోనే ముగిసినప్పటికీ వెంటనే తిరిగి ఎన్నికలు నిర్వహించలేదు. పాత పాలక వర్గాల పదవీ కాలాన్ని ఆర్నెళ్ల చొప్పున రెండు సార్లు పొడిగిస్తూ నెట్టుకొచ్చారు. అయితే అలా అలా పొడిగించిన పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ సహకార సంఘాల ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల తర్వాతే సహకార ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు టాక్ నడుస్తోంది.ఈ మేరకే రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు పాత పాలక వర్గాలనే పర్సన్ ఇన్ ఛార్జి కమిటీలుగా మరో ఆరు నెలలపాటు నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటుగా సహకార సంఘాల ఎన్నికలనిర్వహణ-విధివిధానాలపై మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. తెలంగాణలోని మొత్తం 905 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఓటర్ల జాబితాను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. దీంతో సహకారం మరోసారి వాయిదా పడటం కన్ఫర్మ్ అయినట్లయింది. చూడాలి మరి అసెంబ్లీ, పంచాయితీల్లో విజయ డంకా మోగించిన గులాబీ దళం లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో!
No comments:
Post a Comment