Breaking News

19/02/2019

100 గంటల్లోనే జైషే నాయకత్వాన్ని తుడిచిపెట్టాం

పుల్వామా దాడిపై ఆర్మీ ప్రకటన‌
శ్రీనగర్‌ ఫిబ్రవరి 19  (way2newstv.in
పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన 100 గంటల్లోనే కశ్మీర్‌ లోయలో జైషే మహ్మద్‌ నాయకత్వాన్ని తుడిచిపెట్టామని ఆర్మీ ప్రకటించింది. సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడికి భద్రతాబలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. 16 గంటల పాటు ఎన్‌కౌంటర్‌ జరిపి దాడికి సూత్రధారులైన జైషే మహ్మద్‌ కమాండర్లు అబ్దుల్‌ రషీద్‌ ఘాజీ, కమ్రాన్‌లతో పాటు మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై ఆర్మీ, సీఆర్పీఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులు నేడు సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటుచేసి వివరాలను వెల్లడించాయి.భారత ఆర్మీలోని చినార్‌ కార్ప్స్‌ కమాండర్‌ కన్వల్‌ జీత్‌ సింగ్‌ ధిల్లాన్‌ మాట్లాడుతూ.. ‘పుల్వామా దాడి జరిగిన 100 గంటల్లోనే కశ్మీర్‌ లోయలో జైషే నాయకత్వాన్ని తుడిచిపెట్టాం.


100 గంటల్లోనే జైషే నాయకత్వాన్ని తుడిచిపెట్టాం

 గతంలో ఇంతపెద్ద కారు బాంబు దాడి మన దేశంలో జరగలేదు. పాకిస్థాన్‌ లాంటి దేశాల్లో జరిగేవి. దాడితో కశ్మీర్‌లో అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నాం. పుల్వామా దాడికి పేలుడు పదార్థాలు ఎలా సమకూరాయన్నదానిపై మా వద్ద సమగ్ర సమాచారం ఉంది. అయితే దర్యాప్తు జరుగుతున్నందున ఈ వివరాలు వెల్లడించలేం. జైషే మహ్మద్‌ పాకిస్థాన్‌ ఆర్మీకి బిడ్డ లాంటింది. ఆ దేశ సైన్యమే జైషేను పెంచి పోషిస్తోంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ’ అని అన్నారు.కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదానికి ప్రేరేపితులై తుపాకులు పట్టుకున్న ప్రతి ఒక్కరు లొంగిపోకపోతే మృత్యువు లేదంటే వారిని చంపేస్తామని ధిల్లాన్‌ చెప్పారు. తల్లిదండ్రులకు తమ కొడుకులను ఆయుధాలు వదిలి లొంగిపొమ్మని చెప్పాలని విన్నవించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంపై సైన్యం నిర్ణయం స్పష్టంగా ఉందన్నారు. కశ్మీర్‌ లోయలో అక్రమంగా ప్రవేశించిన వారు తిరిగి ప్రాణాలతో వెళ్లలేరని స్పష్టం చేశారు.అనంతరం కశ్మీర్‌ ఐజీ ఎస్‌పీ పాణి మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదం చాలా వరకు తగ్గిందని అన్నారు. గత మూడు నెలలుగా ఎవరూ ఉగ్రవాదుల్లో చేరలేదని, ఇందుకు ఇక్కడి కుటుంబాలు కూడా సహకరిస్తున్నాయన్నారు. పుల్వామా దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కశ్మీరీ విద్యార్థులపై జరుగుతున్న దాడులపై సీఆర్పీఎఫ్‌ అధికారి జుల్ఫికర్‌ హసన్‌ స్పందించారు. వేధింపులకు గురయ్యే కశ్మీరీ విద్యార్థులు తమ హెల్ప్‌లైన్‌ నంబరును సంప్రదిస్తే వారికి తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment