Breaking News

04/09/2018

రాయలసీమపైనే మూడు పార్టీలు గురి...

తిరుపతి సెప్టెంబర్ 4 (way2newstv.in) 
రాయలసీమలోని అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో అయితే చెప్పనక్కర లేదు. కర్నూలులో ఏ నియోజకవర్గం చూసినా నేతలు సఖ్యతగా లేరు. ఇక బలంలేని కడపలో కూడా నేతలది తలోదారి. అనంతపురం జిల్లాలో నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో జనం దెబ్బేస్తే అధికారంలోకి రావడం సాధ్యం కాదని భావించిన చంద్రబాబు ఇకపై ఆ జిల్లాల్లో ఎక్కువగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు తమ్ముళ్ల మధ్య తగవులను తీర్చే పనిలో పడ్డారు. ఇటీవల ఒకే రోజు కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు నేతల మధ్య సఖ్యత తెచ్చేందుకు ప్రయత్నించారు.రాయలసీమలో వైసీపీకి గట్టి పట్టుంది. గత ఎన్నికల్లో అనంతపురం మినహా కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ గాలులు వీచాయి. వచ్చే ఎన్నికల్లోనూ రాయలసీమలో జగన్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలున్నాయన్న అంచనాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు నిద్రపట్టనివ్వడం లేదు. రాయలసీమపైనే మూడు పార్టీలు గురి...

ఇప్పటికే రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ప్రతిదీ అమరావతిని బూచిగా చూపించి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారన్నది ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. కియో కార్ల ఫ్యాక్టరీ, పులివెందులకు నీళ్లు తెప్పించామని చెప్పడం తప్ప రాయలసీమకు టీడీపీ సర్కార్ చేసిందేమీ లేదన్న అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు. ఇటీవల చంద్రబాబు చేయించిన సర్వేల్లో కూడా గతంలో కంటే ఈసారి సీమ జిల్లాల్లో టీడీపీకి సీట్లు తగ్గుతాయన్న ఫలితాలు రావడంతో చంద్రబాబు జగన్ ను అన్ని విధాలుగా ఢీకొట్టాలని నిర్ణయించుకున్నారు.ఇక రాయలసీమలోనూ కాంగ్రెస్ పార్టీకి కొంత పట్టుంది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కాంగ్రెస్ ప్రముఖ నేతలు ఇప్పటికీ పార్టీలోనే ఉన్నారు. కర్నూలులో కోట్ల కుటుంబం, అనంతలో రఘువీరారెడ్డి, చిత్తూరులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వంటి నేతలు ఉన్నారు. వారికి పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వైసీపీ ఓట్లను చీల్చడానికి కాంగ్రెస్ నేతలు కూడా రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా పర్యటించేలా చంద్రబాబు లోపాయికారీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటిస్తే కొంతవరకూ జగన్ ఓట్లు చీల్చగలరన్న నమ్మకంతో చంద్రబాబు ఉన్నారు.
ఇక కర్నూలులో కాంగ్రెస్ నేతలు రాహుల్ సభ పెట్టడానికి కూడా ఇదే కారణమంటున్నారు. రాహుల్ ను పట్టుబట్టి కర్నూలు సభకు ఒప్పించింది అందుకేనని చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటం, ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగుతుండటంతో రాహుల్ బిజీగా ఉన్నారు. ఆయనను రాష్ట్రానికి తీసుకురాదలచుకుంటే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి తదితర పట్టణాలను ఎంపిక చేయవచ్చు. అక్కడ ఎయిర్ పోర్టులు కూడా ఉండటంతో రాహుల్ సులువగా గంటల్లోనే హస్తినకు వెళ్లిపోయే వీలుంది. కాని కర్నూలు సభకు తీసుకురావడం వెనక కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రధాన కారణమైన దాని వెనక చంద్రబాబు ఉన్నారన్నది కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. వైసీపీ నేతలు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ కర్నూలు వచ్చి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేయడంతో పాటు, మోదీ, జగన్ లపై విరుచుకుపడితే అది తమకు లాభిస్తుందన్నది తెలుగుదేశం అంచనాగా ఉంది. మరి రాహుల్ పర్యటన టీడీపీకి లాభిస్తుందా? కాంగ్రెస్ కు కలిసొస్తుందా? జగన్ ఓటు బ్యాంకు చెక్కు చెదరదా? అన్నది తేలాలంటే కొంతకాలం వేచిచూడక తప్పదు.

No comments:

Post a Comment