Breaking News

04/09/2018

మళ్లీ తెరపైకి హార్దిక్ పటేల్

గాంధీనగర్, సెప్టెంబర్ 4(way2newstv.in) 
హార్థిక్ పటేల్….మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గుజరాత్ లో పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ హార్థిక్ పటేల్ పాటీదార్ అనామత్ ఆందోళన్ ను ప్రారంభించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత హార్థిక్ పటేల్ ఇమేజ్ కొంత తగ్గిందనే చెప్పాలి. పాటీదార్ల సామాజిక వర్గం ఉన్న ప్రాంతాల్లోనూ కమలం పార్టీ గెలుచుకోవడం ఆయనకు ఇబ్బందిగా మారింది. దీంతో మరోసారి తన గ్రాఫ్ ను పెంచుకునేందుకు హార్థిక్ పటేల్ రంగంలోకిదిగారు. పాటీదార్ల రిజర్వేషన్లు అమలు చేయాలని, రైతు రుణమాఫీని అమలు చేయాలంటూ ఆయన ఆమరణ దీక్షకు దిగారు. పోలీసులు అంగీకరించకపోవడంతో తన నివాసంలోనే ఆమరణ దీక్షకు దిగారు. హార్థిక్ పటేల్ ఆమరణదీక్షకు దిగి పది రోజులు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన రావడం లేదు. కొందరు బీజేపీ నేతలు, కాంగ్రెస్ వంటి పార్టీలు మద్దతు తెలుపుతున్నా ఆమరణదీక్ష ముగించేందుకు దారి లేదుపాటీదార్లను ఏకం చేశారు. చిన్న వయస్సులోనే లీడర్ గా ఎదిగిన హార్థిక్ పటేల్ ఒక్క పిలుపునిస్తే లక్షలాది మంది సభకు తరలివస్తారు. అలాంటి హార్థిక్ పటేల్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన నిలిచి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 



మళ్లీ తెరపైకి హార్దిక్ పటేల్

అయినా బీజేపీ గెలిచింది. గతంలో కంటే మెజారిటీ తగ్గినా తిరిగి గుజరాత్ లో కమలం పార్టీయే అధికారాన్ని కైవసం చేసుకుంది.మరో వైపుపది రోజులుగా దీక్ష చేస్తున్న హార్థిక్ పటేల్ ఆరోగ్యం క్షీణించింది. గత రెండు రోజులుగా ఆయన మంచి నీరు కూడా తీసుకోక పోవడంతో ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. అయితే ఆయన ఆమరణ దీక్షలో ఉండి కూడా మరోసారి సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం దిగి రాదని, తన మరణం ఖాయమని ఆయన సన్నిహితులకు చెబుతున్నారు. తాను ఆమరణ దీక్ష విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఆయన వీలునామాను కూడా సిద్ధం చేయడం విశేషం. తన మరణానంతరం తన ఆస్తులు ఎవరెవరికి చెందుతాయో వీలునామా రాశారు.హార్థిక్ పటేల్ వీలునామా ప్రకారం ఆయన ఆస్తిలో పదిహేను శాతం తల్లిదండ్రులకు, 15 శాతం సోదరికి, మిగిలిన 70 శాతం పాటీదార్ల ఉద్యమంలో మరణించిన కుటుంబాలకు అందజేయాలని ఆయన వీలునామా రాశారు. హార్థిక్ పటేల్ బ్యాంకు ఖాతాలో యాభై వేలు ఉన్నాయి. ఇందులో ముప్ఫయి వేల రూపాయలు తల్లిదండ్రులకు, మిగిలిన ఇరవై వేల రూపాయలు పంజప్రోల్ గ్రామంలో ఆవుల కోసం షెడ్ నిర్మించడానికి వినియోగించాలని వీలునామా రాశారు. హార్థిక్ వీలునామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఎప్పుడైనా పోలీసులు హార్థిక్ పటేల్ ను బలవంతంగా ఆసుపత్రికి తరలించే వీలుంది. మొత్తం మీద హార్థిక్ పటేల్ సెంటిమెంట్ ను రాజేసి….పోయిన ప్రాభవాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

No comments:

Post a Comment