Breaking News

10/08/2018

బిల్లుల కోసం ఎదురుచూపులు

మహబూబ్‌నగర్‌, ఆగస్ట్10, 2018 (way2newstv.in)
పిల్లలకు నాణ్యమైన చదువుతో పాటూ పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం పథకం అమలుచేస్తున్నారు. పిల్లలందరినీ బడిబాట పట్టించేందుకు ఈ పథకం దోహదం చేస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా భోజనం అందిస్తున్నవారికి బిల్లులు చెల్లించడంలేదన్న కామెంట్స్ మహబూబ్‌నగర్ జిల్లాలో వినిపిస్తున్నాయి. సకాలంలో బిల్లులు అందకపోతుండడంతో నిర్వాహకులు నానాపాట్లు పడుతున్నారని అంటున్నారు. పిల్లలకు పెట్టే భోజనం కావడంతో పలువురు నిర్వాహకులు అప్పులు చేసి మరీ ఆహారం అందిస్తున్నారు. అయితే బిల్లుల విడుదలలో జాప్యం నెలకొంటుండడంతో ఏజెన్సీలకు సమస్యలు ఎదురవుతున్నాయి. వంటవారు జీతాల్లేక వడ్డీలకు అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సంబంధిత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు అప్పులు ఇస్తే తీసుకొని వంట చేస్తున్నారు. లేదంటే తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకుని భోజనం సరఫరా చేస్తున్నారు. కొందరు ఏజెన్సీల నిర్వాహకులు అయితే కిరాణం దుకాణాల్లో సరకులు అప్పుగా తీసుకువస్తున్నారు. ఈ పరిస్థితి తెలిసినా సంబంధిత అధికారులు బిల్లులు చెల్లించడంలో మాత్రం ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నారని పలువురు నిర్వాహకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.



బిల్లుల కోసం ఎదురుచూపులు

మరోవైపు వంట ఏజెన్సీలకు బకాయిలు పేరుకుపోవడంతో యజమానులు సైతం ఇచ్చేందుకు సంశయిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నిధులు లేకపోవడంతో ఏజెన్సీల నిర్వాహకులు సైతం నీళ్ల చారు, టమాట కూర విద్యార్థులకు అందిస్తున్నారు. గుడ్డు కూడా విద్యార్థులకు వారంలో మూడు సార్లు ఇవ్వడం లేదు. సరైన ఆర్ధిక చేయూత లేకపోవడంతో మెనూ ప్రకారం పౌష్టికాహారం విద్యార్థులకు అందడం లేదు. బిల్లులు రాకపోవడంతో ఉపాధ్యాయులు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఏజెన్సీలపై ఒత్తిడి తీసుకు రాలేకపోతున్నారు. మొత్తంగా విద్యార్ధులకు నిబంధనల ప్రకారం అందాల్సిన పౌష్టికాహారం అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారీ నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తుంది. ఈ విద్యా సంవత్సరం ఏజెన్సీలకు ఇచ్చేందుకు అవసరమైన నిధులు ఇవ్వలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇప్పటి వరకు ఒక్క నెలకు సంబంధించిన నిధులు కూడా మంజూరు చేయలేదు. ఇటీవలే మార్చి, ఏప్రిల్‌ మాసాలకు సంబంధించిన నిధులు విడుదల చేశారు. జూన్‌, జులైలకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు నిధులు లేవు. ఏదేమైనా ప్రభుత్వం సత్వరమే స్పందించి బిల్లులు చెల్లించాలని, విద్యార్ధులకు మంచి పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాల నేతలు కోరుతున్నారు.

No comments:

Post a Comment