Breaking News

07/08/2018

టీడీపీ టార్గెట్ గా కేంద్రం..ద్విముఖ వ్యూహం

న్యూఢిల్లీ, ఆగస్టు 7 (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ సమస్యలపై కేంద్రం,బీజేపీ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. అవిశ్వాస తీర్మానం, రాజ్యసభ చర్చ తర్వాత కొన్ని విషయాల్లో ప్రజలకు మరింత అస్పష్టత ఏర్పడింది. సాంకేతికంగా సాధ్యం కాని విషయాలను కేంద్రం సాధికారికంగా సుప్రీం కోర్టుకు నివేదిస్తోంది. రాజకీయ నిర్ణయాల పేరిట పార్టీకి సానుకూలత లభించేలా రెండు మూడు నెలల్లో నిర్ణయాలు తీసుకునేలా పావులు కదుపుతోంది. లోక్ సభలో అవిశ్వాసాన్ని ధాటిగా, దీటుగా ఎదుర్కొన్నప్పటికీ రాజ్యసభలో దాదాపు అన్ని పార్టీలు ఏపీ వాదనకు బాసటగా నిలిచాయి. అందులోనూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్న అంశంపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చింది అక్కడే. ఆ డిమాండు చేసిన వ్యక్తే ప్రస్తుత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. పార్లమెంటు గౌరవాన్ని పరిరక్షించాలంటే హామీలను అమలు చేయాలనే సూచనను వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ప్రభుత్వానికి నూరిపోశారు. ప్రభుత్వం ఏపార్టీకి చెందినదైనప్పటికీ ప్రధాని స్థాయిలో ని వాగ్దానాలను గౌరవించడం కనీసధర్మమని స్పష్టం చేశారు. టీడీపీ టార్గెట్ గా కేంద్రం..ద్విముఖ వ్యూహం

రెండు సభల చర్చల సారాంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ప్రత్యేక కార్యాచరణకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. అది బీజేపీకి ప్లస్ అయ్యేలా పక్కా ప్లాన్ చేస్తోంది.ఆంధ్రాకు రైల్వే జోన్ సాధ్యం కాదని ఇప్పటికే దేశంలో 16 జోన్లు ఉన్నాయని అధికారిక నివేదికను కేంద్రం బయటపెట్టింది. ఇది వ్యూహాత్మకమైన ఎత్తుగడ. సాధ్యం కాని విషయాన్ని తాము సాకారం చేశామని చెప్పుకునేందుకు అనువుగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు. దీనిద్వారా తమ చిత్తశుద్దిని చాటుకోవచ్చుననేది బీజేపీ ప్లాన్. ఉన్నతస్థాయి వర్గాల సమాచారం ప్రకారం ..తమ పార్టీకి చెందిన సభ్యుడే పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ పట్నానికి రైల్వేజోన్ మంజూరు చేయాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే విధి విధానాలు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఒడిషా నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాని రీతిలో మధ్యేమార్గం అనుసరించాలని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతమున్న జోన్ ఆదాయం దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడు కొత్త జోన్ ఏర్పాటు చేసినా తమకొచ్చే నష్టమేమీ లేదని ఈస్టుకోస్టు జోన్ రైల్వే వర్గాలు తేల్చి చేప్పేసినట్లు తెలిసింది. రాజకీయ నిర్ణయం తీసుకుని జోన్ ను ప్రకటించడమే తరువాయి. అయితే రాజకీయంగా బీజేపీకి ప్రయోజనం సమకూరే విధంగా టైమింగ్ పాటించాలని భావిస్తున్నారు. ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు నిర్ణయం తీసుకుంటే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇప్పటికే జోన్ విషయంలో విశాఖలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు సాగుతున్నాయి. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకూ ఇవి వ్యాపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంచెం పీక్ లెవెల్ కి చేరిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తే బీజేపీ ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక ప్రాతిపదిక దొరుకుతుందనే అంచనాలో ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని రెండు సభల్లోనూ విస్పష్టంగా కేంద్రం ప్రకటించేసింది. ఇక ఆవిషయంపై తదుపరి యోచన లేదని పార్టీ నాయకులకూ చెప్పేశారు. తెలంగాణ అభ్యంతరాలను ప్రచారంలో ముందుకు తీసుకురావాలని రాష్ట్రంలోని కమలం పార్టీ నాయకులకు అధిష్ఠానం సూచించింది. చట్టపరమైన ఆస్తుల విభజన వంటి విషయాల్లో రెండు రాష్ట్రాలే ఒక అవగాహనకు రావాలని కేంద్రం భావిస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై తీవ్రస్థాయి విభేదాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి హైకోర్టు విభజనపైనా రెండు రాష్ట్రాలు అంగీకారానికి రాలేదు. విద్యాసంస్థలు, రాజధాని నిర్మాణం, ఆర్థిక సాయం వంటి విషయాల్లో తెలంగాణతో పోల్చి చూడాలనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కమల నాథులు స్థానిక క్యాడర్ కు సూచనలు చేశారు. రెండు రాష్ట్రాలకు సమ న్యాయం చేయాలనేది విభజన చట్టం ఉద్దేశం. అయినా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా ఇచ్చిన నిధులు ఇతర రాష్ట్రాలకంటే చాలా ఎక్కువ మొత్తాల్లోనే ఉన్నట్లుగా ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. వాటి విడివిడి వివరాలతో బీజేపీ ఏపీ శాఖకు సవివరంగా పంపాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల గణాంకాల సహా ప్రజలను అనునయించేందుకు వీలుంటుంది. ఏదేమైనప్పటికీ పార్లమెంటు చర్చల్లో బీజేపీ ఇమేజీ దెబ్బతిందన్న విషయాన్ని పార్టీ అగ్రనాయకులు అంగీకరిస్తున్నారు. క్రమేపీ ఈ చెడ్డ పేరును చెరిపివేసుకునే ప్రయత్నాలు చేసుకోవాలి, తప్పితే తక్షణం పరిష్కారమార్గాలు కనిపించడం లేదని సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.కేంద్రప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల వినియోగంపై సరైన లెక్కలు సమర్పించడంలో విఫలమైనట్లుగా రాష్ట్రప్రభుత్వం అభియోగాలు ఎదుర్కొంటోంది. మొక్కుబడి యుటిలిటీ సర్టిఫికెట్లను పంపేసి చేతులు దులిపేసుకున్నట్లుగా కేంద్రం నిర్ధారణకు వచ్చింది. కొన్ని లెక్కలను తప్పులతడకగా చూపించినట్లు ఆర్థిక శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఖర్చు అంచనాలు పెంచి చూపించడం , పాత పద్దులకు కొత్త గణాంకాలను చేర్చడం వంటి లోపాలనూ గుర్తించినట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంపై గడచిన ఏడాదిన్నరగా అనుమానాలు తలెత్తుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాల్లో ఉండటంతో ఇంతవరకూ ఇవేమీ పెద్దగా చర్చనీయం కాలేదు. అయితే రాజకీయం ప్రస్తుతం ఎడమొహం పెడమొహంగా మారిపోయింది. తాడోపేడో తేల్చుకునేందుకూ సిద్దమవుతున్నారు. అయితే విమర్శలకు తావివ్వకుండా థర్డ్ పార్టీ ద్వారా రాష్ట్రప్రభుత్వం సమర్పించిన లెక్కల్లోని లొసుగులను వెలికి తీసేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్రం యోచిస్తోంది. రాజకీయంగా ఇరికిస్తున్నామనే భావన రాకుండా చట్టబద్ధంగా అవకతవకలను కనిపెట్టేందుకు సాధికార సంస్థలను వినియోగించుకోవాలన్నదే కేంద్రం భావన. అయితే కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల అధికార పరిధులు, సమాఖ్య వ్యవస్థ వంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. వివాదాలు కూడా తలెత్తవచ్చు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ముందడుగు వేస్తారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రప్రభుత్వానికి ముకుతాడు వేయడం, రాజకీయంగా ముందరికాళ్లకు బంధం వేయడమే తక్షణ కర్తవ్యంగా కేంద్రం రంగంలోకి దిగుతోంది.

No comments:

Post a Comment