Breaking News

25/07/2018

కమలాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆరోపణలు

న్యూఢిల్లీ, జూలై 25 (way2newstv.in)
భారత రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు కొత్తేమీ కాదు. దేశీయంగా ప్రభుత్వ వ్యవహారాల్లో జరిగే అవినీతి వేరు. అంతర్జాతీయంగా విదేశీ ఒప్పందాల్లో చోటు చేసుకునే అవినీతి వేరు. మొదటి తరహా అవినీతి ఆరోపణలపై విచారణలు, శిక్షలు, అప్పీళ్ల వంటివి ఉంటాయి. వీటికి ప్రచారం కూడా లభిస్తుంది. రెండో తరహా అవినీతి ఆరోపణలను నిరూపించడం కష్టం. దేశ భద్రత, రక్షణ పేరుతో వివరాలు వెల్లడించకుండా ప్రభుత్వం దబాయించవచ్చు. రాజీవ్ గాంధీ గతంలో బోఫోర్స్ కుంభకోణం, వాజ్ పేయి ప్రభుత్వ హయాంలోని శతఘ్నుల కుంభకోణం తాజాగా ఫ్రాన్స్ తో చేసుకున్న రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాల్లో ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఎస్సార్ ఆయిల్ కుంభకోణాన్ని ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం వెలుగులోకి తీసుకొచ్చింది. సహజంగా విదేశీ కుంభకోణాలను జాతీయ పార్టీలు తవ్వి తీస్తుంటాయి. ఇందుకు కావాల్సిన సాధన, సంపత్తి వాటికి ఎక్కువగా ఉంటుంది. 



కమలాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆరోపణలు

కానీ ఇవేమీ లేనటువంటి ఒక ప్రాంతీయ పార్టీ దాని మూలాలను వెలికి తీయడం విశేషం.తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్వయంగా విలేకర్ల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. నాలుగేళ్లుగా కలిసి ప్రయాణించిన బీజేపీ, టీడీపీ నేడు విడిపోయిన అనంతరం ఒకరి లోపాలను మరొకరు ఎత్తిచూపు కుంటున్నాయి. అందులో భాగంగానే ఈ కుంభకోణం అని అంటున్నప్పటికీ కుటుంబరావు చెప్పిన సమాచారాన్ని తోసిపుచ్చడం కష్టమే. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే…. ఎస్సార్ ఆయిల్స్ లో 49 శాతం వాటాను రష్యా ప్రభుత్వ చమురు సంస్థ రాస్ నెఫ్ట్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ సుమారు 73 వేల కోట్ల రూపాయలు. 2016 చివర్లో గోవా రాజధాని ‘‘పనాజీ’’ లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి తెరవెనక చాలా మంత్రాంగం నడిచింది. ఎస్సార్ ఆయిల్స్ 2016 లో తన ఆస్తి, అప్పుల పట్టికలో సంస్థ విలువను రూ.3,500 కోట్లగా చూపింది. ఆ మొత్తాన్ని మదుపుదార్లకు వెనక్కు చెల్లించేసి షేర్ మార్కెట్ నుంచి డీలిస్ట్ అయింది. తర్వాత అదే సంస్థను రూ.73 వేల కోట్లకు రష్యా సంస్థకు విక్రయించారు. ఇందులో ఏదో మతలబు జరిగిందన్నది కుటుంబరావు అనుమానం. ఆరోపణ. రూ.3,500 కోట్ల విలువైన సంస్థను 73 వేల కోట్లకు ఎలా విక్రయించారన్నది ఆయన సూటి ప్రశ్న. అప్పట్లో పెద్దనోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండటంతో ఈ అంశం పెద్దగా వెలుగులోకి రాలేదు. ప్రచార, ప్రసార మాధ్యమాల దృష్టికీ రాలేదు. దీనిని భారత్ లోకి వచ్చిన విదేశీ పెట్టుబడి గా చూపించారు.రెండు సంస్థల మధ్య జరిగిన ఒప్పందాన్ని రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందంగా చూపారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ.20 వేల కోట్ల పన్ను ఆదాయానికి గండి పడింది. రూయా సోదరులకు సంబంధించిన వోడా ఫోన్ ఒప్పందంలోనూ తెరవెనక మంత్రాంగం కారణంగా రూ.11 వేల కోట్ల రూపాయల పన్ను ప్రభుత్వానికి రాలేదు. ప్రభుత్వ పెద్దల ప్రమేయం కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండి పడింది. ఒప్పందం ప్రకంపనలు భారత్ లో చోటు చేసుకున్నప్పటికీ రష్యాలో ప్రభావం చూపాయి. ఈ ఒప్పందాన్ని ఆమోదించనందునే రష్యా ఆర్థికాభివృద్ధి మంత్రిని పుతిన్ పట్టుబట్టి మరీ అరెస్ట్ చేయించారు. ఒప్పందం ప్రధఆని సమక్షంలో జరిగినందున ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టత ఇవ్వాలని కుటుంబరావు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలోని ప్రముఖులు, ఉన్నతాధికారులకు తెలియకుండా ఇదంతా జరగదన్న ఆయన వాదనను తోసిపుచ్చలేం.ఎస్సార్ ఆయిల్ సొమ్మును రాబట్టేందుకే ప్రధాని తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్నారని కుటుంబరావు ఆరోపణ. ఈ విషయంలో మనీ లాండరింగ్ జరిగిందని కూడా చెబుతున్నారు. రాస్ నెఫ్ట్ లో వాటా కొనుగోళ్లకు సంబంధించి ఒక వ్యక్తిని చైనా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇది జరిగిన వారానికే ప్రధాని మోదీ హడావిడిగా చైనా వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశమయ్యారు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ పర్యటనకు, వాటిని కొనుగోలు చేసిన వ్యక్తి అరెస్ట్ కు ఏమైనా సంబంధం ఉందా? ప్రధాని పర్యటన ముందస్తుగా నిర్ణయించిందా? లేక అప్పటికప్పుడు హడావిడిగా రూపొందించారా? ఈ అనుమానాలపై ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టత ఇవ్వాలి. దీనివెనక గల వాస్తవాలను కేంద్రం బయటపెట్టాలని కుటుంబరావు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబరావు అంకెలతో సహా వెల్లడించిన సమాచారంపై విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కుటుంబరావు ఆషామాషీ వ్యక్తి కాదు. పార్టీలో కీలక స్థానంలో ఉన్నారు. విషయ పరిజ్ఞానం పుష్కలంగా ఉన్న వ్యక్తి. అయితే ఆరోపణలు చేసిన సమయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడో ఒప్పందాలు జరిగితే ఇప్పటిదాకా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఉభయ పార్టీల సంబంధాలు చెడిపోయిన తర్వాతనే వ్యూహాత్మకంగా ఇప్పుడు వెల్లడించడంలో రాజకీయంగా బీజేపీని బదనాం చేయడమే లక్ష్యమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. బీజేపీ సీనియర్ నాయకులు సయితం కుటుంబరావు ఆరోపణలపై స్పందించడం కష్టం. స్వయంగా ప్రధాని కాని, సంబందిత శాఖ మంత్రి కానీ, ప్రధానమంత్రి కార్యాలయం మాత్రమే ఈ విషయంలో స్పందించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి స్పందనను ఆశించడం అత్యాశే అవుతుంది. దీనిని కాదనగలమా….?

No comments:

Post a Comment