Breaking News

17/07/2018

సంరక్షణతోనే లక్ష్యం దిశగా..

ఆదిలాబాద్, జులై17 (way2newstv.in)    
అటవీ ప్రాంతం అధికంగా ఉన్న జిల్లాగా ఆదిలాబాద్‌ కు పేరు. అయితే.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అటవీ ప్రాంతం క్షీణించిపోతున్న దుస్థితి. దీంతో జిల్లాకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం కృషిచేస్తోంది. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలోనూ చురుకైన పాత్రకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో మూడు విడతలుగా సాగిన ఈ ప్రోగ్రాంలో భాగంగా కోట్లాది మొక్కలు నాటారు. అయితే వాటి సంరక్షణలో అలసత్వం కారణంగా లక్ష్యం నెరవేరలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు విడతల్లో దాదాపుగా 2 కోట్లకు పైగా మొక్కలు నాటినా అందులో 60 శాతం మొక్కలు కనిపించని పరిస్థితి నెలకొందని జిల్లావాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నాటడమే తప్ప వాటి పర్యవేక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఒక్కో మొక్కను నర్సరీలో పెంచేందుకు రూ. 5 ఖర్చు చేశారు. వీటిని నాటేందుకు గుంతకు రూ. 20 చొప్పున ఖర్చు చేస్తున్నారు. వీటితో పాటు రవాణాకు, వాటికి కంచె ఏర్పాటుకు నిధులు వెచ్చిస్తున్నారు. ఇలా మొక్కల కోసం భారీగానే వెచ్చించారు. తీరా అందులో పూర్తి స్థాయిలో ఆశించిన ప్రయోజనం చేకూరకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రజాధనం వృధా అయిందని వాపోతున్నారు.   



సంరక్షణతోనే లక్ష్యం దిశగా..

జిల్లాలో మూడు విడతల హరితహారం కార్యక్రమంలో కొన్ని పొరపాట్లు సాగాయి. మొక్కలు నాటిన తర్వాత వాటికి నీరు పట్టకపోవడం, పర్యవేక్షణ చేయకపోవడం ప్రధాన సమస్య. మొక్క నాటేందుకు తవ్విన గుంత డబ్బులను, నీరు పట్టేందుకు వాటిని సంరక్షించేందుకు ఉపాధి హమీ పథకంలో భాగంగా ఇవ్వాలి. కానీ సంబంధిత అధికారుల చేతివాటం కారణంగా ఈ పంపిణీ అస్తవ్యస్తంగా మారిందని సమాచారం. మరోవైపు సంబంధిత అధికారులు ఎక్కడ కూడా సరైన చర్యలు తీసుకోకపోవడమూ సమస్యకు కేంద్రబిందువుగామారింది. అందుకే ఎప్పటికప్పుడు డబ్బులు అందిస్తూ వాటి సంరక్షణపై దృష్టి పెట్టాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. మొత్తంగా రూ. కోట్లు సొమ్ము పక్కదోవ పట్టిందని అంతా అంటున్నారు. మొక్కలను నాటించడం, వాటిని పెంచేందుకు ఆయా ప్రభుత్వ శాఖలకు బాధ్యతలను అప్పగించిన ఉన్నతాధికారులు అవి పెరిగాయా లేదా అని పర్యవేక్షించిన పరిస్థితి లేదని పలువురు విమర్శిస్తున్నారు. మా శాఖకు మీరిచ్చిన లెక్క ప్రకారం ఇన్ని మొక్కలను నాటామని చెప్పుకోవడంతోనే వారి పని పూర్తి చేసుకున్నారని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం ఉదాసీనంగా ఉండడంతో మొక్కలు ఆశించిన రీతిలో లేవని.. కనుమరుగైపోయాయని జిల్లావాసులు విమర్శిస్తున్నారు. ఈ దఫా సాగే నాలుగో విడత హరితహారంలోనైనా లోపాలు అధిగమించి జిల్లావ్యాప్తంగా నాటిన మొక్కల సంరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని అంతా కోరుతున్నారు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేస్తేనే ఫలితం ఉంటుందని చెప్తున్నారు. రహదారుల పక్కన, ప్రభుత్వ స్థలాల్లో నాటిన మొక్కలకు తప్పని సరిగా కంచెతో పాటు నీరు పట్టించాలని సూచిస్తున్నారు. 

No comments:

Post a Comment