Breaking News

02/07/2018

పొంచిఉన్న అనారోగ్య ముప్పు

ఖమ్మం, జూలై 2 (way2newstv.in):
 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ రకాల వ్యాధులతో బాలబాలికలు బాధపడుతున్నారు. పౌష్టికాహార లోపం కారణంగా బాలికల్లో అధికంగా రక్తహీనత సమస్య వేధిస్తోంది. ప్రధానమైన విటమిన్ల లోపంతో విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. ఈ సమస్యలు వారిలో అనారోగ్యానికి, ఎదుగుదల లోపానికి కారణమవుతున్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. బాలల్లో 80 శాతం మందికి ఐరన్‌ లోపం ఉందని తెలుస్తోంది. వ్యాధులతో బాధపడుతున్న వారు  విద్యనభ్యసించేందుకు ఆటంకంగా మారుతోంది. ఇదీ ఉభయ జిల్లాల్లోని అన్ని రకాల యాజమాన్యాల కింద నడుస్తున్న పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి.



పొంచిఉన్న అనారోగ్య ముప్పు 

ఖమ్మం జిల్లాలో 71శాతం బాలికల్లో రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజాగా వెల్లడించింది. రాష్ట్రంలో 80 శాతం మంది బాలల్లో  ఐరన్‌ లోపమున్నట్లు తెలుస్తోంది. 56.7 శాతం మందిలో రక్తహీనత సమస్య ఉంది. ఈ సమస్యలు మహిళలు, పిల్లల్లో అనారోగ్యంతోపాటు ఎదుగుదలను అడ్డుకొంటోందని తేల్చింది. వీటి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. ప్రధానంగా పౌష్టికాహార లోపం వల్లే ఈ సమస్యలు తలెత్తుతాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకు గురిచేస్తోంది. బాలబాలికల్లో అధికంగా వ్యాధులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వివిధ విద్యా సంస్థల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు వైద్యం అందించేందుకు రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం అమలు చేస్తోంది. ఈ వైద్య సేవల్లో విద్యార్థులకు అన్ని పరీక్షలు నిర్వహిస్తారు.
ఉమ్మడి జిల్లాలో వివిధ మండలాల్లోని 1,065 ప్రాథమిక, 205 ప్రాథమికోన్నత, 145 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో వరుసగా 44,405, 20,680, 18,468 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని వారికి ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి పౌష్టికాహారం అందిస్తోంది. క్షేత్రస్థాయిలో వీరికి పౌష్టికాహారం లభించడం లేదు. ప్రధానంగా బడిఈడు పిల్లలకు ఇది అందకపోవడంతో అధికంగా వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తహీనత, కంటి, దంత సమస్యలు, చర్మ వ్యాధులు, మిటమిన్ల లోపం తదితర 40 రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6,039, ఖమ్మంలో 17,629 మంది విద్యార్థులు ఈ వ్యాధుల బారిన పడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
వివిధ రకాల వ్యాధులకు ప్రధాన కారణం పౌష్టికాహార లోపమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, వివిధ గురుకులాలు, గిరిజన ఆశ్రమాల్లోని పేద విద్యార్థులకు పౌష్టికాహారం కోసం ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. క్షేత్రస్థాయిలో విద్యార్థులకు మాత్రం సమతుల ఆహారం అందడం లేదనే విమర్శలున్నాయి. వార్డెన్ల డబ్బు ఆశ విద్యార్థులకు శాపంగా మారుతుంది. ఇక మధ్యాహ్న భోజన పథకానికి నెలనెలా బిల్లులు విడుదల చేయకపోవడంతో ఏజెన్సీల మహిళలు అప్పులు చేసి భోజనం వడ్డిస్తున్నారు. ఈ క్రమంలో నాసిరంగా భోజనం తయారు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఆర్‌బీఎస్కే నివేదిక ప్రకారం గతేడాది నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలిలా ఉన్నాయి..
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మానసిక ఒత్తిడి, థైరాక్సిన్‌ హార్మోన్‌ లోపం వల్ల అధికంగా యువతుల్లో 70శాతం మంది థైరాయిడ్‌ వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా ఈ వ్యాధి సంక్రమిస్తోంది. దీనివల్ల హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుందని, బరువు పెరగడం, గొంతులో వాపు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయని చెబుతున్నారు. దీన్ని గుర్తించి పౌష్టికాహారం తీసుకోవడం, అయోడిన్‌ అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఉభయ జిల్లాల్లోని పేద విద్యార్థులు గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులు ఒకేచోట పరిమితికి మించి ఉండడం వల్ల అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ముఖ్యంగా తామర, గజ్జి ప్రబలితే అందరికీ అంటుకుంటుంది. ఇలాంటి వ్యాధితో బాధపడే విద్యార్థిని గుర్తించి ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే తోటి విద్యార్థులంతా ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. విద్యార్థుల సంక్షేమంపై సంక్షేమాధికారులు, వార్డెన్లు ప్రత్యేక దృష్టి సారిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఉన్నతాధికారులు సైతం పర్యవేక్షణ నిర్వహించాల్సి ఉంది. 

No comments:

Post a Comment