Breaking News

17/12/2019

అటకెక్కిన మిగులు జలాల వ్యవహారం

హైద్రాబాద్, డిసెంబర్ 17,(way2newstv.in)
గోదావరి నదిలోని మిగులు జలాలను కృష్ణా నదిలోకి మళ్లించి రెండు రాష్ట్రాలను సస్యశ్యామలం చేయాలన్న ప్రతిపాదన దాదాపు అటకెక్కినట్లే. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశంపై రెండుసార్లు సమావేశమై గతంలో చర్చించిన విషయం విదితమే. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రా సీఎం జగన్‌ల మధ్య గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు నీటిని మళ్లించే విషయమై సుహృద్భావ వాతావరణంలో చర్చలు తర్వాత పురోగతి కనిపించలేదు. ఆ తర్వాత ఈ ప్రతిపాదన ముందుకు కదలలేదు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు తమ భూభాగంలోనే ప్రవహిస్తున్న గోదావరి బేసిన్ నుంచి నీటిని మళ్లించి కృష్ణా బేసిన్‌లోకి మళ్లించాలనే ప్రతిపాదనలకు మెరుగులు దిద్దుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత ప్రణాళికతో ముందుకెళుతోంది. పోలవరం నుంచి పెన్నా బేసిన్‌కు నీటిని మళ్లించేందుకు చకాచకా పావులు కదుపుతోంది. 
అటకెక్కిన మిగులు జలాల వ్యవహారం

పోలవరం నుంచి కర్నూలు జిల్లాలో బంకచర్ల రిజర్వాయర్ వరకు కాల్వను, ఎత్తిపోతల పథకాలను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ నీటిని అక్కడి నుంచి రాయలసీమకు, పెన్నాబేసిన్‌కు మళ్లిస్తారు. మొత్తం 210 టీఎంసీ నీటిని మళ్లించేవిధంగా డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. వరద సీజన్‌లో పోలవరం నుంచి రోజుకు రెండు టీఎంసీ నీటిని బంకంచర్ల వరకు ఎత్తిపోతల పథకాల ద్వారా మళ్లిస్తారు. దీని కోసం గుంటూరు జిల్లాలో బొల్లపల్లి వద్ద 150 టీఎంసీ నీటిని నిల్వ చేసే స్టోరేజీ కేపాసిటీని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా డీపీఆర్ తయారు చేయాల ఏపీ సర్కార్ సాగునీటి శాఖను ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం నుంచి మిడ్ మానేరు, అక్కడి నుంచి షామీర్‌పేట, మూసీ నది, అసిఫ్ నహ్, పానగల్ వరకు గోదావరి నీటిని మళ్లిస్తారు. పెద్ద దేవులపల్లి నుంచి నీటిని నాగార్జునసాగర్ వరకు మళ్లిస్తారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం లేనప్పుడు గోదావరి నుంచి నీటిని మళ్లించేప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. తాజా పరిణామాలను విశే్లషిస్తే రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా జలాల మళ్లింపు పథకాన్ని నిర్మించినా, భవిష్యత్తులో చిక్కులు ఎదురవుతాయని భావిస్తున్నాయి. ప్రస్తుతం రెండు ప్రభుత్వాల మధ్య స్నేహ వాతావరణం ఉంది. అనేక అంశాల్లో ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయి. నీటి మళ్లింపు అనేది సున్నితమైన అంశమైనందువల్ల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏ రాష్టమ్రైనా సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం సాగునీటి జలాలను పూర్తిగా వినియోగించుకునే విషయంలో పూర్తిగా పట్టుదలతో ఉన్నారు.

No comments:

Post a Comment