న్యూడిల్లీ, నవంబర్ 2 (way2newstv.in)
కీలకమైన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి జార్ఖండ్ పై కేంద్రీకృతమైంది. 81 స్థానాలు గల ఈ చిన్న రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ నెలఖరులో లేదా డిసెంబరు మొదటి వారంలో జరగాల్సి ఉంది. డిసెంబరు 27తో రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది. 2000 సంవత్సరంలో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి హయాంలో ఛత్తీస్ ఘడ్, ఉత్తరాఖండ్ తో పాటు జార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. అప్పట్లో మధ్యప్రదేశ్ ను విభజించి ఛత్తీస్ గఢ్, ఉత్తర్ ప్రదేశ్ ను విభజించి ఉత్తరాఖండ్ ను బీహార్ ను విభజించి జార్ఖండ్ ను ఏర్పాటు చేశారు.మాతృరాష్ట్రం బిహార్ లో జనతాదళ్ యు, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) వంటి ప్రాంతాయ పార్టీలదే ప్రాబల్యం. అయితే ఆవిర్భావం నుంచి జార్ఖండ్ జాతీయ పార్టీలదే పెత్తనం కావడం విశేషం.
జార్ఖండ్ లో కమలం ఆచితూచి అడుగులు
బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం రఘుబర్ దాస్ చక్రం తిప్పుతున్నారు. 2014 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 49 స్థానాలలో అధికారాన్ని అందుకుంది. 17 స్థానాలతో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎం.ఎం) ప్రధాన పార్టీగా నిలిచింది. ఆ పార్టీకి చెందిన హేమంత్ సోరెన్ ప్రతి పక్ష నేత. జాతీయ పార్టీ అయిన హస్తం పార్టీ ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది. ఇతర చిన్నా చితక పార్టీలు ఉన్నప్పటికే వాటి ప్రాధాన్యత నామమాత్రమే. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ను గత అయిదేళ్లుగా బీజేపీ కొనసాగిస్తూ వచ్చింది. ఆయన ప్రభుత్వంపై పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు.ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో జార్ఖండ్ లో మొత్తం 14కు గాను 11 స్థానాలను గెలుచుకుని బీజేపీ తిరుగులేని శక్తిగా నిలిచింది. దాని మిత్ర పక్ష ఏజేఎస్ యూ ఒక స్థానాన్ని గెలుచుకుంది. కేంద్ర ఆర్ఘిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా హజారీ బాగ్ స్థానం నుంచి 4,70 లక్షల భారీ మెజార్టీతో గెలిచారు. ఆయన తండ్రి యశ్వంత్ సిన్హా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రస్తుతం ఆయనకు బీజేపీ నాయకత్వంతో సరిపడటం లేదు. కాంగ్రెస్, జే.ఎం.ఎం చెరో లోక్ సభ స్థానాన్ని గెలుచుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి మధుకోడా భార్య గీతా కోడా సింగ్ భూమ్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం నల్లేరుపై నడకే కావాలి.కానీ మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో బీజేపీ నాయకత్వం అంతటి ధీమా ప్రదర్శించే సాహసం చేయడం లేదు. అంత మాత్రాన బీజేపీ పని అయిపోయినట్లు చెప్పలేం. కానీ మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు విపక్షాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ లో కొంత ఆశలు రేకెత్తించాయి. కలసికట్టుగా పనిచేస్తే కాషాయ దళాన్ని జార్ఖండ్ లో నియంత్రిచడం కష్టమేమీ కాదన్న ఆశాభావంతో ఆ పార్టీ ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల పీసీసీ అధ్యక్షుడిని మార్చింది. పీసీసీ చీఫ్ అజయ్ కుమార్ స్థానంలో కొత్తగా రామేశ్వర్ ఒరాన్ ను నియమించింది. కమలేష్ మహతో, ఇర్ఫాన్ అన్సారీ రాజేష్ ఠాకూర్, మానససిన్హా, సంజయ్ పాశ్వాన్ లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సుబోద్ కాంత్ సహాయ రాష్ట్ర వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారు. పీసీసీ మాజీ చీఫ్ అజయ్ కుమార్ ఆప్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో ఈ పార్టీ ప్రభావం నామమాత్రమేమహారాష్ట్ర, హర్యానా ఫలితాలతో కాషాయ పార్టీ కొంత కంగుతిన్నప్పటికీ సొంత ఇంటిని చక్క దిద్దుకునే పనిలో నిమగ్నమైంది. జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 81 స్థానాల్లో 44 జనరల్, 9 ఎస్సీ, 28 ఎస్టీలకు కేటాయించారు. ఈ రిజర్వేషన్లు అనుగుణంగా ఆయా సామాజిక వర్గాలను చేరదీయాలని అదిష్టానం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ పని తీరును ప్రస్తావిస్తూ ఘర్ ఘర్ రగుభర్ అనే నినాదంతో పార్టీ ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రైతులను ఆకట్లుకునేందుకు ప్రధాన మంత్రి కిసాన్ మంధన్ మోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ జన్ ఆశీర్వాద్ యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొత్తానికి అతి ధీమాకు పోకుండా సొంత ఇంటిని చక్కదిద్దుకునే పనిలో కమలం పార్టీ నిమగ్నమైంది.
No comments:
Post a Comment