బెంగళూర్, నవంబర్ 21 (way2newstv.in)
కర్ణాటకలో ఉప ఎన్నికల వేడి ఊపందుకుంది. నామినేషన్ల గడువు ముగియడంతో అన్ని పార్టీలూ ఇక ప్రచారంపైనే దృష్టి పెట్టాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఎనిమిది స్థానాలను గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరికి తప్ప అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు అందరూ తిరిగి సీట్లు దక్కించుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు వారిపై ఉన్న అసంతృప్తిని లేదా సానుభూతిని వ్యక్తం చేయనున్నాయి.ప్రధానంగా యడ్యూరప్ప ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో కనీసం ఎనిమిది స్థానాలను గెలిస్తేనే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. అందుకే ఆయన అధిష్టానాన్ని ఒప్పించి మరీ అనర్హులందరికీ దాదాపుగా టిక్కెట్లు ఇప్పించుకున్నారు.
ఎనిమిది గెలిస్తే... 4 ఏళ్లు గ్యారంటీ
ఆయన దగ్గరుండి అభ్యర్థులను ఎంపిక చేయడం వల్ల ఆ ప్రభావం కూడా నియోజకవర్గాలపై పడుతుందంటున్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి కారణం వీరే కాబట్టి వారిని తిరిగి గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి సత్వరం జరుగుతుందని ప్రజలు కూడా భావిస్తారని భారతీయ జనతా పార్టీ అంచనా వేస్తుంది.ఇప్పటికే యడ్యూరప్ప ఆ పదిహేను నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నిధులను కూడా మంజూరు చేశారు. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తానని హామీలు కూడా ఇచ్చారు. ఇప్పుడు వీరందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత యడ్యూరప్ప పైనే ఉంది. యడ్యూరప్ప పైనే అధిష్టానం ఆ భారం మోపింది. మరోవైపు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలందరూ మామూలు నేతలు కాదు. ప్రజల్లో పట్టుతో పాటు నియోజవర్గాల్లో అన్ని రకాలుగా బలమైన నేతలు కావడం బీజేపీకి కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు.ఇక యడ్యూరప్ప ఈ పదిహేను నియోజకవర్గాల్లో కనీసం పది స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాంగ్రెస్ 12 స్థానాలను ఖచ్చితంగా గెలుస్తామని ఆత్మ విశ్వాసం వ్యక్తం చేస్తుండటంతో యడ్యూరప్ప మరింత జాగ్రత్త పడుతున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ పరంగా కావాల్సినవంటినీ ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర నేతలను కూడా ఇందులో ప్రమేయం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. తోక జాడించిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీకి పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. శరత్ బచ్చేగౌడ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీని ఆదేశించారు. ఇలా యడ్యూరప్ప తన శక్తినంతా కూడదీసుకుని పదిహేను నియోజకవర్గాలపైనే పెట్టారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
No comments:
Post a Comment