Breaking News

01/10/2019

బాబుపై కారాలు మిరియాలు నూరుతున్న తమ్ముళ్లు

ఏలూరు, అక్టోబరు 1, (way2newstv.in)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు రాజ‌కీయ స్వార్థానికి తాము బ‌లైపోయామంటూ.. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఓడిపోయిన లేదా టికెట్ ద‌క్కని చాలా మంది నాయ‌కులు ఆరోపించిన విష‌యం తెలిసిందే. అయితే, మీడియా ముందుకు రాని మ‌రో నేత కూడా ఈ జాబితాలో ఉండ‌డం గ‌మ‌నార్హం. కృష్ణాజిల్లా కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జ‌య మంగ‌ళ వెంక‌ట ర‌మ‌ణ ఈ జాబితాలో ప్రత్యేకంగా చ‌ర్చకు వ‌స్తున్నారు. ఈయ‌న వ‌డ్డెర సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. ఈ సామాజిక‌వ‌ర్గం కొల్లేరులో ఎక్కువుగా ఉంటుంది. వెంక‌ట‌ర‌మ‌ణ ఆ వ‌ర్గం వారిలో గ‌ట్టి ప‌ట్టున్న నాయ‌కుడు కూడా. 
బాబుపై కారాలు మిరియాలు నూరుతున్న తమ్ముళ్లు

2006లో జెడ్పీటీసీగా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో చంద్రబాబు ఇక్కడ‌కు ప‌ర్యట‌న నిమిత్తం వ‌చ్చిన‌ప్పుడు జ‌య‌మంగ‌ళ ఆయ‌న దృష్టిని ఆక‌ర్షించారు.ఈ క్రమంలోనే చంద్రబాబు కైక‌లూరు టికెట్‌ను జ‌య‌మంగ‌ళ వెంక‌ట ర‌మ‌ణ‌కు ఇచ్చారు. మ‌రోప‌క్క, ఎర్నేని రాజారామ్ చంద‌ర్‌, కామినేని శ్రీనివాస్ వంటి బ‌ల‌మైన నాయ‌కులు ఇక్కడ పోటీకి దిగారు. కామినేని ప్రజారాజ్యం నుంచి, రాజారామ్ చంద‌ర్ కాంగ్రెస్ నుంచి రంగంలో ఉన్నారు. అయినా కూడా జ‌య‌మంగ‌ళ వెంక‌ట ర‌మ‌ణ మ‌రింత గ‌ట్టి పోటీ ఇచ్చి టీడీపీ త‌ర‌ఫున 830 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న‌కు వ్యతిరేకంగా సాగిన స‌మైక్యాంధ్ర ఉద్యమంలో త‌న దైన శైలిలో ఉద్యమం చేశారు. మ‌త్స్యకార వేషం క‌ట్టి .. రాష్ట్రాన్ని ఉమ్మడిగానే ఉంచాలంటూ.. నిన‌దించారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల స‌మ‌యానికి వ‌చ్చేస‌రికి.. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జ‌య‌మంగ‌ళ టికెట్ ఆశించారు. అయితే, అప్పటి రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు, టీడీపీ-బీజేపీ పొత్తులో బాగంగా ఈ టికెట్‌ను చంద్రబాబు బీజేపీకి కేటాయించారు.ఈ క్రమంలో చంద్రబాబుకు అత్యంత స‌న్నిహితుడు, త‌న సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన కామినేని శ్రీనివాస్ ఇక్కడ నుంచి పోటీ చేశారు. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్‌లో జ‌రిగింద‌న్న చ‌ర్చ కూడా ఉంది. దీంతో ఒకింత ఆగ్రహానికి గురైన జ‌య‌మంగ‌ళ‌.. ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమయ్యారు. అయితే, చంద్రబాబు శాంతింప‌జేసి.. ఎమ్మెల్సీ ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. దీంతో విధిలేని ప‌రిస్థితిలో జ‌య‌మంగ‌ళ త‌న నామినేష‌న్‌ను ఉప‌సంహ‌రిం చుకున్నారు. అయితే, పార్టీ అధికారంలోకి వ‌చ్చినా.. జ‌య‌మంగ‌ళ‌కు చంద్రబాబు ఇచ్చిన‌ ఎమ్మెల్సీ హామీ మాత్రం నెర‌వేర్చలేదు. కానీ, కామినేని విజ‌యం కోసం జ‌య‌మంగ‌ళ ఎంతో కృషి చేశారు.ఇక‌, 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి బీజేపీతో టీడీపీ తెగ‌దెంపులు చేసుకున్న నేప‌థ్యంలో ఇక్కడ టీడీపీ టికెట్‌ను జ‌య‌మంగ‌ళ‌కు చంద్రబాబు కేటాయించారు. అయితే,జ‌గ‌న్ సునామీలో జ‌య‌మంగ‌ళ‌ ఓడిపోయారు. చిత్రం ఏంటంటే.. 2009లో పార్టీ ఓడింది. ఆయ‌న గెలిచారు. 2014లో టికెట్ ఇవ్వలేదు… కానీ పార్టీ గెలిచింది.. 2019లో సీటు ఇచ్చినా ఓడిపోయారు. ఇక జ‌య‌మంగ‌ళ‌ ఆర్థికంగా కూడా పెద్ద‌గా బ‌ల‌మైన నాయ‌కుడు కాదు. ప్రజాబ‌లం ఉన్న జ‌య‌మంగ‌ళ నిజానికి చంద్రబాబు స్వార్థ రాజ‌కీయాల‌కు బ‌ల‌య్యార‌ని ఆయ‌న అనుచ‌రులు ఆరోపిస్తున్నారు. బీసీ నేత‌కూడా కావ‌డంతో ఆ వ‌ర్గం కూడా టీడీపీపై గుర్రుగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో జ‌య‌మంగ‌ళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

No comments:

Post a Comment