Breaking News

21/09/2019

గ్రామాల్లో పెరిగిపోతున్న చెత్తా, చెదరాలు

విజయనగరం, సెప్టెంబర్ 21, (way2newstv.in)
ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం వెరసి విజయనగరం జిల్లాలోని గ్రామాలు మురుగు కూపాలుగా మారాయి. పంచాయతీల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారాన్ని తొలగించేందుకు సరిపడా పారిశుధ్య కార్మికులు లేరు. జ్వరాలు అదుపులోకి రావడం లేదు. మరణాల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తప్పులను సరిదిద్దుకోక పోగా అధికారులపై నెపాన్ని నెట్టివేసే ప్రయత్నం చేస్తోంది. తీవ్ర జ్వరాలు, మరణాలు సంభవిస్తున్నాయి. కొంతమేరకైనా గ్రామీణ ప్రాంతంలో పారిశుధ్యాన్ని మెరుగు పర్చాలనే లక్ష్యంతో తలసరి రూ.పది చొప్పున సుమారు రూ.రెండు కోట్లను జిల్లా కలెక్టర్‌ కేటాయించారు. 
గ్రామాల్లో పెరిగిపోతున్న చెత్తా, చెదరాలు

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చిన సిఎఫ్‌ఎంఎస్‌ విధానం నేటికీ గాడిలో పడకపోవడంతో పంచాయతీ ప్రత్యేకాధికారులకు యూజర్‌ ఐడిలు, పాస్‌వర్డ్స్‌ పూర్తి స్థాయిలో రాలేదు. దీంతో ఆ నిధులు ఖర్చు చేసే అవకాశం లేకపోయింది. దోమలను అదుపు చేసేందుకు ఫాంగింగ్‌ మిషన్లు అవసరమైనన్ని లేవు. ఉన్న తొమ్మిది ఫాగింగ్‌ మిషన్లను ఏజెన్సీకి కేటాయించారు. ఇప్పటివరకూ 102 గ్రామాల్లో మాత్రమే ఫాగింగ్‌ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. గడిచిన రెండు నెలలుగా ఏజెన్సీ, మైదానం అన్న తేడాలేకుండా దోమలు విజృంభిస్తుండడంతో జ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో 150 మంది వరకూ మృత్యువాతపడ్డారు. ఫాగింగ్‌ యంత్రాల సంఖ్య పెంచకపోతే అన్ని పంచాయతీల్లోనూ ఫాగింగ్‌ చేపట్టే సరికి మరో మూడు నెలలు పడుతుందని జిల్లా మలేరియా అధికారి రవికుమార్‌ తెలిపారు. కొత్త ఫాగింగ్‌ మిషన్ల కొనుగోలుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు.పారిశుధ్యం మెరుగుకు కలెక్టర్‌ ప్రత్యేకంగా రూ.రెండు కోట్లు మంజూరు చేసినా ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సిఎఫ్‌ఎంఎస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో సాంకేతిక సమస్యలను పరిష్కారం కావడం లేదు. దీంతో, ఈ నిధులు ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లా జనాభా 23.5 లక్షలు కాగా, ఇందులో గ్రామీణ జనాభా సుమారు 19 లక్షల వరకూ ఉంది. జిల్లాలో 921 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 15 పంచాయతీల్లో రెగ్యులర్‌, కాంట్రాక్టు ప్రాతిపదికన 37 మంది, మరో తొమ్మిది పంచాయతీల్లో సుమారు 187 మంది కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. మిగిలిన 897 పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులు లేరు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,700 కిలోమీటర్ల మేర కాలువలున్నాయి. ప్రభుత్వ నిబం ధనల ప్రకారం జనాభా ప్రాతిపదికన జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 8,700 మంది పారిశుధ్య కార్మికులు ఉండాలి. 224 మంది మాత్ర్రమే ఉన్నారు. వేతనం తక్కువ కావడంతో పారిశుధ్య పనికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఇటీవల గ్రామాల్లో పారిశుధ్యం లోపించిన నేపథ్యంలో జిల్లా పంచాయతీ ఆధ్వర్యాన జిల్లా వ్యాప్తంగా సర్వే చేపట్టారు. పారిశుధ్య పనులు చేయడానికి సిద్ధంగా ఉన్న వారు 2,200 మంది మాత్రమే ఉన్నట్టు తేలింది. మొత్తం పంచాయతీల్లో ఆదాయం లేని పంచాయతీలు సగం ఉన్నాయి.

No comments:

Post a Comment