హైద్రాబాద్, ఆగస్టు 29, (way2newstv.in)
వెయ్యేండ్ల చరిత్రను ఎలుగెత్తి చాటే చారిత్రక కట్టడాలు మన రాష్ట్రంలో ఉన్నా.. వాటిని ప్రమోట్ చేయడంలో, పరిరక్షించడంలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. అద్భుతమైన శిల్ప సంపదకు, ప్రత్యేక నిర్మాణ శైలికి ప్రపంచస్థాయి గుర్తింపు దక్కడం లేదు. ప్రాచీన కట్టడాల పరిరక్షణకు, టూరిస్ట్ ప్రాంతాలకు కేంద్రం నిధులు ఇస్తేనే అభివృద్ధి పనులు చేయడం.. సొంతంగా మాత్రం పైసా విదల్చకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఫలితంగా హెరిటేజ్ గుర్తింపు సంగతి దేవుడెరుగు.. వాటి పరిరక్షణకు నిధుల్లేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని గోల్కొండ కోట, చార్మినార్, కుతుబ్‌షాహీ టూంబ్స్, వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయం, అలంపూర్ టెంపుల్స్, వరంగల్ ఫోర్ట్ తదితర చారిత్రక కట్టడాలు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ) పరిధిలో ఉన్నాయనే కారణంతో వీటి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి.
ఎవ్వరికి పట్టని చారిత్రాత్మక కట్టడాలు
దేశవ్యాప్తంగానైనా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనైనా.. ప్రస్తుత ప్రత్యేక రాష్ట్రంలోనైనా అద్భుత చారిత్రక కట్టడాలు తెలంగాణకే సొంతం. అయినా ఇప్పటివరకు ఒక్క కట్టడం కూడా పూర్తిస్థాయిలో ప్రపంచ వారసత్వ గుర్తింపు హోదాను దక్కించుకోలేదు. ఉమ్మడి ఏపీలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా 2010, సెప్టెంబర్ 10న యునెస్కోకు అప్లై చేసింది. అయితే ఈ కట్టడాల పరిశీలనకు హైదరాబాద్‌కు వచ్చిన యునెస్కో ప్రతినిధులు వీటి వెంట ఉన్న ఆక్రమణలను, చుట్టూ ఉన్న రోడ్లు, వాహనాల రద్దీ, షాపింగ్ కాంప్లెక్స్‌లను చూసి ప్రపంచ వారసత్వ గుర్తింపునకు నిరాకరించినప్పటికీ తాత్కాలిక జాబితా (టెంటేటివ్ లిస్ట్)లో చేర్చడం కొంత ఊరటనిచ్చింది. ఆ తర్వాత వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయం, వేయిస్తంభాల ఆలయం, స్వయం భూదేవాలయం, ఖిలా వరంగల్‌లోని కీర్తి తోరణాలకు యునెస్కో గుర్తింపు ఇవ్వాలని 2014 ఏప్రిల్ 15న చేసిన దరఖాస్తు కూడా తిరస్కరణకు గురైంది.ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని యునెస్కోకు నామినేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో 2017లో కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు రామప్పను నామినేట్ చేసింది. ఆలయ ప్రత్యేకతలకు సంబంధించిన రిపోర్ట్ సరిగా లేకపోవడంతో యునెస్కో రిజెక్ట్ చేసింది. దీంతో యునెస్కో కన్సల్టెంట్ ప్రొఫెసర్, నర్తకి, ఆర్కిటెక్ట్ అయిన చూడామణి నందగోపాల్‌ను అధికారులు పిలిపించి ఆలయ ప్రత్యేకతలపై అధ్యయనం చేయించి ఆ వివరాలను యునెస్కోకు మరోసారి పంపారు. అయితే రిపోర్ట్‌లో చెప్పిన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు యునెస్కో వచ్చే నెల 25న ప్రత్యేక బృందాన్ని పంపనుంది. ఈ బృందం వచ్చే సమయానికి మన అధికారులు రామప్ప ఆలయం చుట్టూ ఉన్న ఆక్రమణలతోపాటు, ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసిన దుకాణాలను, ఆలయ సహజత్వానికి విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. టూరిస్టుల కోసం హోటల్స్, వసతి తదితర సౌకర్యాలు ఉన్నట్లు కూడా యునెస్కో ప్రతినిధులకు చూపాల్సి ఉంటుంది. అలాగైతేనే రామప్ప ఆలయం తెలంగాణ నుంచి యునెస్కో గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రికార్డు సృష్టించనుంది.ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన చారిత్రక కట్టడాల పరిరక్షణకు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుందని అంతా భావించినప్పటికీ అలాంటి చర్యలేవీ చేపట్టలేదు. ప్రత్యేకంగా తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పైసా కేటాయించడం లేదు. స్వదేశీ దర్శన్ కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులే టూరిజానికి ఊతమిస్తున్నాయి. స్వదేశీ దర్శన్ స్కీమ్‌లో భాగంగా ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైన రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు, బొగత జలపాతం, తాడ్వాయి అడవులను కలిపి తెలంగాణ ట్రైబల్ సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 83 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో ఇప్పటికే ఆ ప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించేలా పార్కుల నిర్మాణం, సౌకర్యాల కల్పన జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణ ఎకో టూరిజం సర్క్యూట్ పేరుతో టూరిస్టు ప్రాంతాల అభివృద్ధికి రూ. 91 కోట్లను, హైదరాబాద్‌లో టూరిస్టు స్పాట్ల అభివృద్ధికి మరో రూ. 99 కోట్లను మంజూరు చేసింది. రాష్ట్రంలో టూరిస్ట్ స్పాట్ల అభివృద్ధికి ప్రస్తుతం ఈ నిధులే ఆసరా అయ్యాయి.
No comments:
Post a Comment