విజయవాడ, జూలై 20, (way2newstv.in)
ఎపి శాసన సభే కాదు, శాసన మండలి లో సైతం వాడి వేడిగా చర్చలు నడుస్తున్నాయి. శాసన సభలో చంద్రబాబు, మండలిలో లోకేష్ లను టార్గెట్ చేసుకున్నారు వైసిపి టీం. ఈ రెండు సభల్లో పోటాపోటీగా టిడిపి పై యుద్ధమే చేస్తున్నారు వైసిపి వారు. తాజాగా టిడిపి అధినేత కుమారుడు లోకేష్ పై మంత్రులు మండలిలో విరుచుకుపడి చెలరేగారు. ముఖ్యంగా ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సురేష్ లు సెటైర్లపై సెటైర్లు వేస్తూ లోకేష్ ను గేలిచేశారు.తన ప్రసంగ వాగ్ధాటికి మంత్రి వాకౌట్ చేసి పారిపోయారంటూ మండలి సభ్యుడు లోకేష్ చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. ఆ తరువాత వచ్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేష్ పై తుఫాన్ లా విరుచుకుపడ్డారు.
అక్కడ తండ్రి...ఇక్కడ కొడుకు
గూగుల్ లో పప్పు అని టైపు చేస్తే అందుకే ఆయన పేరు వస్తుందని వ్యగ్యాస్త్రం సంధించారు. తెలుగు మాట్లాడటమే రాదని లోకేష్ ను మరింత తీసిపారేశారు మరో మంత్రి సురేష్. దానికి అంతే ధీటుగా లోకేష్ స్పందించారు. తాను తెలుగు తప్పులు మాట్లాడి ఉండొచ్చని కానీ తప్పుడు పనులు చేయలేదని ఎద్దేవా చేశారు. గూగుల్ లో 420 అని టైపు చేస్తే 16 నెలల జైలు జీవితం గడిపినవారి పేరు వస్తుందంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు లోకేష్.ఇలా అటు లోకేష్ ఇటు మంత్రులు ఒకరిపై మరొకరు సాగించిన మాటల యుద్ధం తారాస్థాయికే చేరింది. ఇలా గత ప్రభుత్వంలో వైసిపి ఎదుర్కొన్న పరాభవాలకు పూర్తిగా బదులు తీర్చేసుకుంటుంది అధికారపార్టీ. అయితే ఇంత త్వరగా ప్రతీకారాన్ని ప్రత్యర్థి తీర్చేసుకుంటారని ఊహించని టిడిపి కి మాత్రం ఈ సీన్లు అస్సలు నచ్చడం లేదు. కానీ భరించక తప్పడం లేదు. మరో పక్క వ్యక్తిగత విమర్శల స్థాయి రోజు రోజుకు పెరుగుతూ సభా సమయం ఇరు పక్షాలు వృధా చేస్తున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి. మరి ఈ రెండు పక్షాల వైఖరి ఎప్పుడు మారుతుందో చూడాలి.
No comments:
Post a Comment