Breaking News

10/07/2019

మలేరియాకు మందేదీ..? (గుంటూరు)

గుంటూరు, జూలై 10 (way2newstv.in): 
గత రెండేళ్ల నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మలేరియా కేసులు నమోదవుతున్న గుంటూరు జిల్లాలో ఈ పరిస్థితి ఉండటం గమనార్హం. జిల్లాలో మలేరియా, డెంగీ జ్వరాల నివారణకు యంత్రాంగం కార్యాచరణ ఎంత మొక్కుబడిగా ఉందో పై ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. జూన్‌ 28 వరకు 74 మలేరియా, 38 డెంగీ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 80 శాతం కేసులు ఒక్క గుంటూరు అర్బన్‌ పరిధిలోనే ఉన్నాయి. వాటి నివారణకు అవసరమైన మందులు, దోమల నివారణకు ఫాగింగ్‌ చేపట్టకుండా ఉంటే వాటిని ఎలా అదుపు చేయగలమో యంత్రాంగం గుర్తెరగాలి. నగర పరిధిలో మూడు మలేరియా సబ్‌ యూనిట్లు ఉన్నాయి. ఈ మూడుచోట్ల మలేరియా మందులు లేవు.
మలేరియాకు మందేదీ..? (గుంటూరు)

రాజధాని ప్రాంతమైన గుంటూరులో మలేరియా, డెంగీ వంటి జ్వరాల తీవ్రతకు స్థానం ఉండకూడదని జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ, మలేరియా యంత్రాంగం సంయుక్తంగా ఈనెల 18న మొబైల్‌ మలేరియా డెంగీ క్లినిక్‌ (ఎంఎండీసీ) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఆరంభ శూరత్వంగా తయారైందనే విమర్శలు ఉన్నాయి. ఎంఎండీసీ వాహనాల్లో వాడవాడలా పర్యటించి ప్రచారం నిర్వహించటానికి పెట్రోలు సైతం లేక నిలిచిపోయాయి. నగరంలో సబ్‌ యూనిట్లతో పాటు ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సైతం మలేరియా నివారణకు వాడే క్లోరోఫిన్‌, ఫ్రైమాఫిన్‌ వంటి మందులు లేవని పారామెడికల్‌ సిబ్బంది చెబుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో దీన్ని మల్టీడ్రగ్‌గా ఇస్తారు. అన్ని మందులతో పాటు వీటిని అందుబాటులో ఉంచుతారు. పీహెచ్‌సీల్లో మందులు లేవంటే అర్థం ఉంది. మలేరియాకు మాత్రమే ఉద్దేశించిన సబ్‌ యూనిట్లలో వాటి నివారణకు మందులు లేవంటే అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఒకవైపు గుంటూరు నగరంలో ఏ ప్రైవేటు ఆస్పత్రిలో చూసినా మలేరియా కేసులు వస్తున్నాయి. నగరపాలిక పరిధిలో మలేరియా, డెంగీ జ్వరాల నివారణకు జిల్లా మలేరియా విభాగంతో పాటు నగరపాలిక ప్రజారోగ్య విభాగం సంయుక్తంగా 28 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాల్లో పని చేయటానికి జిల్లా నలుమూలల నుంచి ఆరోగ్య సహాయకులు, సూపరవైజర్లను 30 మందికి పైగా రప్పించారు. గ్రామాల్లో సైతం మలేరియా జ్వరాలు ప్రబలుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖకు సమాచారం అందుతోంది. నగరంలో ఆయా కాలనీలు, మురికివాడలను సందర్శించి ప్రజలకు మలేరియా, డెంగీ జ్వరాల తీవ్రతను వివరించేందుకు 20 వాహనాలు సమకూర్చారు. వాటికి ఇంథనం కొరత ఉంటోందని, దీంతో ఈ కార్యక్రమం సజావుగా సాగటం లేదని తెలుస్తోంది. ప్రతి 35వేల మందికి ఒకటి చొప్పున మొత్తం 28 బృందాలు అర్బన్‌ ప్రాంతాన్ని కలియతిరిగి ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యాచరణ రూపొందించారు. జూన్‌-ఆగస్టు మధ్యే ఎక్కువ కేసులు నమోదవుతాయని గుర్తించారు. ఈ మూడు నెలల పాటు గుంటూరు అర్బన్‌ పరిధిలో దీని నివారణకు విస్తృతంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. నగరపాలిక, జిల్లా వైద్య-ఆరోగ్య యంత్రాంగం ఈ మేరకు కార్యాచరణ చేపట్టలేదనే విమర్శలను మూటగట్టుకుంటోంది.

No comments:

Post a Comment