Breaking News

01/07/2019

జమిలీ ఎన్నికలతో బీజేపీ లాంగ్ ప్లాన్


న్యూఢిల్లీ, జూలై 1, (way2newstv.in)
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ జమిలి ఎన్నికల పాట పాడుతోంది. నిజానికి ఆ పార్టీకి జమిలి ఎన్నికల మీద మనసు ఈనాటికి కాదు, ఒకే దేశం, ఒకే చట్టం బీజేపీ నినాదం, ఇది వాజ్ పేయ్ అద్వానీ కాలం నాటిది. ఇపుడు మోడీ-అమిత్ షా నినాదం ఒకే దేశం ఒకే ఎన్నికలు. దీని వల్ల వచ్చే రాజకీయ లాభాలు ఈ ఇద్దరు నేతలకే బాగా తెలుసు. ఉదాహరణకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, తెలంగాణా ఎన్నికలు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు వేరుగా జరిగినపుడు బీజేపీ ఓడిపోయింది. అదే ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి గరిష్టంగా ఆ పార్టీ లాభపడింది. మొత్తానికి మొత్తం సీట్లను ఊడ్చేసింది. జమిలి ఎన్నికల్లో జెల్ల ఇలా తగులుతుందనే తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీయార్ తెలంగాణాలో ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలు తెచ్చేశారు. కేసీయార్ అనుమానమే నిజమైంది. లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు, కాంగ్రెస్ మూడు సీట్లు పట్టుకుపోయాయి. అంటే జమిలి ఎన్నికలు పెడితే లోకల్ పార్టీలను ఎలా దెబ్బ కొట్టొచ్చో బీజేపీకి బాగా అర్ధమైపోయిందన్నమాట.

జమిలీ ఎన్నికలతో బీజేపీ లాంగ్ ప్లాన్

జమిలి ఎన్నికల విషయంలో ఇక బీజేపీ తగ్గదని అందరికీ తెలుసు. ఆ పార్టీ అయిదేళ్ళ నాటి కల అది. మరో అయిదేళ్ళు అధికారాన్ని సంపాధించుకుని పూర్తి మెజార్టీ తో కేంద్రంలో కొలువు తీరిన ఈ సమయంలో కూడా తన కోరిక నెరవేర్చుకోకపోతే మరెపుడూ జరిగేది కాదు, పైగా రాజ్యసభలో 2021 నాటికి బీజేపీకి పూర్తి బలం వస్తుంది. అంటే రాజ్యాంగ సవరణ చేసైనా జమిలి ఎన్నికలకు రెడీ అయిపోయే సువర్ణ అవకాశం ఆ పార్టీకి లభిస్తుందన్నమాట. అయితే జమిలి ఎన్నికల వల్ల కొన్ని పార్టీలకు ఇప్పటికిపుడు మేలు జరిగే అవకాశం ఉంది. మరి కొన్ని పార్టీలకు వేటు పడే పరిస్థితీ ఉంది. జమిలి ఎన్నికలకు బీజేపీ చేస్తున్న కసరత్తు పూర్తి అయితే దేశంలో కొన్ని రాష్ట్రాలో అధికారం అయిదేళ్ల నుంచి ఒక్కసారిగా మరో రెండేళ్ళకు పొడిగించబడుతుంది.అలా అధికారం అదనంగా రెండేళ్ళు సంపాదించుకునే పార్టీల్లో పశ్చిమ బెంగాల్ ఉంటుంది. అక్కడ 2021 నాటికి ఎన్నికలు జరగాలి. 2023లో దేశం మొత్తం ఎన్నికలు పెడితే ఏకంగా ఏడేళ్ల పాటు మమత ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్నమాట. అదే విధంగా తమిళనాడులో అన్నా డీఎంకే పాలన కూడా 2021 నాటికి పూర్తి కావాలి. అయితే వారికి కూడా 2023 వరకూ అధికారం దక్కుతుంది. అంటే ఇక్కడ ఎపుడెపుడు అధికారంలోకి రావాలా అని చూస్తున్న డీఎంకేకి ఎసరు పెడతారన్నమాట. ఇక ఏపేలో చూసుకుంటే జగన్ పార్టీ అధికారం 2024 మే వరకూ ఉంటుంది. 2023 మొదట్లో జమిలి ఎన్నికలకు బీజేపీ ప్రతిపాదిస్తోంది. దాని వల్ల ఏడాదిన్నర ముందే అధికారాన్ని వైసీపీ పోగొట్టుకోవాల్సివస్తుంది. కేసీయార్ అయితే ఏడాది పాటు అధికారం కోల్పోతారు. మొత్తం మీద జమిలి ఎన్నికలు జరిగితే మాత్రం తెలుగు రాష్ట్రాలతో సహా అంతటా తమ హవా చాటుదామ‌నుకుంటున్న బీజేపీ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.

No comments:

Post a Comment