Breaking News

31/07/2019

మళ్లీ మొదటికొచ్చిన కాపు రిజర్వేషన్ వ్యవహారం

విజయవాడ, జూలై 31, (way2newstv.in)
ఏపీలో కాపు రిజర్వేషన్ల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. కేంద్రం ఇచ్చిన 10 శాతం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల కోటాలో 5 శాతం కాపులకు కేటాయిస్తూ గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జగన్ సర్కారు పక్కనబెట్టడంతో దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో వెంటనే ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. నేరుగా ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ తరఫున ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీలో కాపు రిజర్వేషన్ల వ్యవహారంలో మొదటి నుంచీ స్ధిరమైన వైఖరితో ఉన్న వైసీపీ కేంద్రం ప్రకటించిన ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో గత టీడీపీ ప్రభుత్వం ఈ కోటాలో కాపులకు ప్రత్యేకంగా కేటాయించిన 5 శాతం రిజర్వేషన్ల నిర్ణయం సహజంగానే రద్దయినట్లయింది. 
మళ్లీ మొదటికొచ్చిన కాపు రిజర్వేషన్ వ్యవహారం

దీంతో జగన్ సర్కారుపై కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభంతో పాటు వైసీపీ, టీడీపీలోని కాపు నేతల ఆగ్రహాన్ని గమనించిన ప్రభుత్వం... నేరుగా కాకుండా వైసీపీ తరఫున ముగ్గరు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కాపు రిజర్వేషన్ల వ్యవహారాన్ని పరిశీలించాల్సిందిగా వైసీపీకి చెందిన ముగ్గురు కాపు నేతలు అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లులకు సీఎం జగన్ బాధ్యతలు అప్పచెప్పారు.త్రిసభ్య కమిటీ ఏర్పాటు కూడా వివాదం రేపుతోంది. కాపు రిజర్వేషన్లపై ముందునుంచీ స్ధిరమైన వైఖరితో ఉన్న వైసీపీ.. ఈ కమిటీ ఏర్పాటు ద్వారా వ్యూహాత్మకంగా తప్పటడుగు వేసిందన్న వాదన వినిపిస్తోంది. కాపు రిజర్వేషన్ల అమలు కోసం హామీ ఇచ్చింది, దాన్ని అమలు చేయాల్సిందిగా కేంద్రానికి లేఖ పంపింది, అది కుదరకపోతే కేంద్రం ఇచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం కేటాయించింది టీడీపీ ప్రభుత్వమే. అలాంటప్పుడు కాపు రిజర్వేషన్లపై ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా మళ్లీ వ్యవహారం మొదటికొచ్చే అవకాశం ఉంది.గతంలో టీడీపీ ప్రభుత్వం బీసీల స్ధితిగతులపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ నివేదిక ఇవ్వకుండానే కమిషన్ కు నేతృత్వం వహించిన జస్టిస్ మంజునాథ వైదొలిగారు. దీంతో మిగతా కమిటీ సభ్యులు ఇచ్చిన నివేదికను టీడీపీ ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి పంపింది. దీనిపైనా మరో వివాదం ఉంది. ఇప్పుడు వైసీపీ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ మంజునాథ కమిషన్ నివేదికను పరిశీలిస్తుందని పార్టీ, ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి కమిషన్ ఛైర్మన్ సంతకం లేకుండా ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక న్యాయపరంగా కూడా చెల్లదు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న శాశ్వత బీసీ కమిషన్ కు మరోసారి ఈ అంశాన్ని అప్పగించాల్సిన పరిస్ధితి ఎదురవుతుంది. ఈ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా మాత్రమే కాపు రిజర్వేషన్లను అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అలా అయినా గతంలో అమల్లో ఉన్న 50 శాతం రిజర్వేషన్లు, కేంద్రం రాజ్యాంగ సవరణ ద్వారా ఆమోదించిన 10 శాతం రిజర్వేషన్లలో కలుపుకుని మొత్తం రిజర్వేషన్ల శాతం 60కి చేరింది. ఈసారి ప్రత్యేకంగా కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తే ఆ సంఖ్య 65కు చేరుతుంది. ఇదంతా జరిగే పనేనా అంటూ కాపు నేతలు సైతం పెదవి విరుస్తున్నారు.మొత్తం మీద కాపు రిజర్వేషన్లపై స్ధిరమైన వైఖరితో ఉన్న వైసీపీ... కొత్తగా ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు ద్వారా ఈ అంశాన్ని సజీవంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈ వ్యవహారాన్ని సాగదీసేందుకు, విపక్షాల నుంచీ, స్వపక్షంలోని కాపు వర్గ నేతల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి దృష్ట్యా వైసీపీ ఈ కమిటీ ఏర్పాటు చేసి ఉండొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.

No comments:

Post a Comment