Breaking News

13/07/2019

హస్తినలో బాబు రాయబేరాలు...

న్యూఢిల్లీ, జూలై 13, (way2newstv.in)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై పార్టీలో ఒత్తిడి పెరుగుతున్నట్లుంది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నా, కేంద్రంతో మాత్రం సత్సంబంధాలు కొనసాగించాలని అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలు వత్తిడి తెస్తున్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన అన్నం సతీష్ ప్రభాకర్ కూడా తెలుగుదేశం పార్టీ ఇక రాష్ట్రంలో పుంజుకోలేదని చెప్పేసి వెళ్లిపోయారు. ఒక్క అన్నం సతీష్ ప్రభాకర్ మాత్రమే కాదు ఎక్కువ మంది నేతలు బీజేపీతో సత్సంబాధల కోసం చంద్రబాబు పై ప్రెజర్ తెస్తున్నారు.దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఎక్కువమంది తెలుగుదేశం పార్టీ నేతలు, ఆ పార్టీకి ఆర్థికంగా నిలబడే పారిశ్రామిక వేత్తలు బీజేపీ అంటేనే భయపడిపోతున్నారు. 
హస్తినలో బాబు రాయబేరాలు...

ఈడీ, సీబీఐ దాడులు ఎప్పుడు తమపై జరుగుతాయోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మోదీ ఇప్పుడిప్పుడే పాలనపై దృష్టి పెట్టారని, త్వరలోనే తమపై ఐటీ దాడులు జరిగే అవకాశముందని వారు బెంబేలెత్తి పోతున్నారు. దీనిపై చంద్రబాబునాయుడును కలుస్తున్న నేతలు సయితం బీజేపీతో సఖ్యతగా ఉంటే మేలని ఆయనకు సూచిస్తున్నారు.మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను తీసుకున్నా ఇదే అర్థమవుతుంది. త్వరలోనే తెలుగుదేశం పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినా అది సాధ్యం కాకపోవచ్చు. చంద్రబాబునాయుడు విలీనం చేయరన్న సంగతి అందరికీ తెలుసు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మాటల్లో త్వరలోనే తెలుగుదేశం పార్టీ బీజేపీ కలసి పోతాయని జోస్యం చెప్పారు. అంతేకాకుండా చంద్రబాబునాయుడు ఐడియాలు మోదీకి అవసరమని కూడా ఆయన అన్నారు.చంద్రబాబునాయుడు ఇప్పటికే బీజేపీతో స్నేహం చేసేందుకు ముందుకు వచ్చారంటున్నాయి టీడీపీ శ్రేణులు. అయితే బీజేపీ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదని అంటున్నారు. కానీ ఎన్నికలకు ముందు నరసరావుపేట సభలో అమిత్ షా మాట్లాడుతూ చంద్రబాబునాయుడుకు బీజేపీ ద్వారాలు మూసేసిందని చెప్పారు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమని చెప్పక తప్పదు. చంద్రబాబునాయుడు పై వస్తున్న వత్తిడి అలాంటిది. ఇప్పటికే హస్తినలో చంద్రబాబునాయుడు తరుపున రాయబారాలు ప్రారంభమయినట్లు తెలుస్తోంది. త్వరలోనే కమలంతో బాబు చేయి కలిపినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

No comments:

Post a Comment