Breaking News

31/07/2019

పట్టించుకోరా..?(ఖమ్మం)

ఖమ్మం, జూలై 31 (way2newstv.in): 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉభయ జిల్లాల్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను నెలకొల్పారు. ఇక్కడ చదువుకునే బాలికల్లో చాలామంది అనాథలు, నిరుపేదలైన కుటుంబాల పిల్లలే. వీరిని దృష్టిలో పెట్టుకుని పది తర్వాత కూడా ఇంటర్‌ విద్యను అందించాలన్న గొప్ప నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. కేంద్రం సహకారానికి తోడు అదనపు నిధులతో గతేడాది నుంచే ఎంపిక చేసిన పలు కేజీబీవీల్లో ఈ కోర్సులను ప్రారంభించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ ఈ ఏడాది చాలా వరకు ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలోని సీట్లను భర్తీ చేశారు. విద్యార్థినుల సంఖ్యకనుగుణంగా సదుపాయాలు మాత్రం పెరగలేదు. ముఖ్యంగా మరుగుదొడ్లు, మూత్రశాలల సమస్యలపై దృష్టి సారించకపోవడం ఇప్పుడు వేలాది మంది బాలికలను ఇబ్బందులకు గురిచేస్తోంది. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్‌ కోర్సుల వారికి కొత్త భవనాల వసతితోపాటు మరుగుదొడ్లు సత్వరమే నిర్మించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.
 పట్టించుకోరా..?(ఖమ్మం)

జిల్లాలో కేజీబీవీల్లో రెండు కోర్సుల చొప్పున ఇంటర్‌ విద్యను ప్రవేశపెట్టి, ఒక్కో కోర్సులో 80 మందికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. బోనకల్లు, ఏన్కూరు, కొణిజర్ల, ఖమ్మం గ్రామీణం, ముదిగొండ, తిరుమలాయపాలెం, ఎర్రుపాలెం, చింతకాని, ఖమ్మం అర్బన్‌, కామేపల్లి, పెనుబల్లి, కూసుమంచి , కారేపల్లి విద్యాలయాల్లో ఇంటర్‌ ప్రవేశాలు కల్పించినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు అన్నిచోట్లా లక్ష్యం మేరకు సీట్లను భర్తీ చేశారు. ప్రతీ విద్యాలయంలోనూ మరుగుదొడ్ల సమస్య నెలకొనడం గమనార్హం. ఉదాహరణకు కారేపల్లి మండలంలోని విద్యాలయంలో 10వ తరగతి వరకు 196 మంది విద్యార్థులుండగా, ఇంటర్మీడియట్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 107 మంది ప్రస్తుతం చదువుకుంటున్నారు. ఇక్కడ 30 మరుగుదొడ్లు ఉండగా.. మరో 20 అదనంగా నిర్మించాల్సి ఉంది. ఏన్కూరులోనూ ఇంటర్మీడియట్‌ వారితో కలిపి మొత్తం 290 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ కళాశాల విద్య కోసం ప్రత్యేకంగా కొత్త భవనాన్ని నిర్మించారే కానీ అవసరమైన సౌకర్యాలు కల్పించలేదు. భద్రాద్రి జిల్లాలో తొమ్మిది కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌ కోర్సులు ప్రారంభించారు. ఈ విద్యాలయాల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్‌ చదివే వారి సంఖ్య 2,501. ఒక్కో పాఠశాలలో ప్రతీ 20 మందికి ఒకటి చొప్పున మరుగుదొడ్డిని నిర్మించాలి. కానీ ఎక్కడా ఈ మేరకు వసతులు లేవు. భవనాల నిర్మాణం సమయంలో నిర్మించిన మరుగుదొడ్లే నేటికీ దిక్కవుతున్నాయి. ఒక్కో విద్యాలయంలో సగటున 300 మంది విద్యార్థినులున్నారు. ప్రతీ చోటా అదనంగా పది వరకు మరుగుదొడ్లు, మూత్రశాలలను నిర్మించాల్సి ఉందని నిర్వాహకులే ఒప్పుకొంటున్నారు. సంఖ్య పెరుగుతున్నా ఎలాగోలా రోజులు నెట్టుకొస్తున్నట్లు ఉపాధ్యాయులు, ప్రత్యేకాధికారులు చెబుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు చంద్రుగొండ కేజీబీవీలో 350 మంది, చర్ల-210, జూలూరుపాడు-274, ములకలపల్లి-320, పాల్వంచ-336, పినపాక-306, గుండాల-192, టేకులపల్లి-276, దుమ్ముగూడెంలో 237 మంది బాలికలు చదువుకొంటున్నారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సర ప్రవేశాలు మరికొంత మందికి కల్పించే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ విద్యాలయాలు, కళాశాలల్లో మరుగుదొడ్ల లేమి, అధ్వాన నిర్వహణపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పట్లో సమస్య స్థితిగతులు, పరిష్కార మార్గానికి సంబంధించి ఓ త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసి పర్యవేక్షణకు పంపింది. ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సౌకర్యాలపై కాస్త దృష్టిసారించింది. సమస్యలున్న చోట్ల శుభ్రం చేయించడం, నీటి వసతిని కల్పించడం, తలుపులు, బేసిన్లు సరి చేయించడం వంటి పనులు పూర్తిచేశారు. కానీ కొత్తగా నిర్మాణాలు చేపట్టిన దాఖలాలు మాత్రం లేవు.

No comments:

Post a Comment