Breaking News

20/06/2019

జగన్ కు అరుదైన గౌరవం


హైద్రాబాద్, జూన్ 20, (way2newstv.in)
దోస్త్ మేరా దోస్త్ అంటున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. కయ్యాలు పక్కన పెట్టి.. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. గత చరిత్రను పక్కన పెట్టి.. విభజన సమస్యలు, రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వివాదాలను సామరస్య వాతావరణంలో పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ.. చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకుంటామంటున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎంకు అరుదైన గౌరవం దక్కేలా చేశారు. తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలాఫలకంపై జగన్ పేరును చెక్కించారు. ముఖ్య అతిథిగా భావిస్తూ తెలంగాణ ప్రభుత్వం సముచితమైన గౌరవాన్ని ఇచ్చింది. 


జగన్ కు అరుదైన గౌరవం
శిలాఫలకంపై ముందుగా గవర్నర్ నరసింహన్ పేరు.. తర్వాత సీఎం కేసీఆర్.. ఆ వెంట ముఖ్య అతిథిలుగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఏపీ సీఎం జగన్‌ పేర్లు ఉన్నాయి. కేసీఆర్ స్వయంగా అమరావతికి వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి రావాలని జగన్‌ను ఆహ్వానించారు.. ఏపీ సీఎం కూడా ఈ కార్యక్రమానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి గౌరవమే దక్కింది. 2015లో నవ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌నకు రావాలని అప్పటి సీఎం చంద్రబాబు వెళ్లి కేసీఆర్‌ను ఆహ్వానించారు. కేసీఆర్ కూడా కార్యక్రమానికి హాజరుకాగా.. ఆయన పేరును శిలాఫలకంపై పొందుపరిచారు. ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్, కేసీఆర్ పేర్లు ఫలకంపై ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌కు అరుదైన గౌరవం దక్కింది. జగన్, కేసీఆర్‌లు కూడా స్నేహ హస్తం అందించుకోవడం హర్షం వ్యక్తమవుతోంది. పొరుగు రాష్ట్రాలు సఖ్యతతో మెలగడం శుభపరిణామని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

No comments:

Post a Comment