రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు ఒకపక్క జోరందుకున్నాయి. ఆధిపత్య రాజకీయాలకు దారితీస్తున్నాయి. ఇక, జగన్ ప్రభుత్వం అడుగడుగునా చంద్రబాబును.. ఆయన పార్టీని ఇరుకున పెట్టేందుకు, ప్రజల్లో నగుబాటుకు గురి చేసేందుకు వేస్తున్న అడుగులు తీవ్ర తరం అవుతున్నాయి. ఇదిలావుంటే, ఈ సమస్యలపై సంఘటితంగా పోరాటం చేస్తుందని భావించిన టీడీపీ చాలా వరకు విఫలమైంది.రాష్ట్రంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు తప్పు అని జగన్ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నా.. అక్రమాలు జరిగాయని నిరూపిస్తున్నా.. తమ్ముళ్ల నోరు మెదపకపోగా, ఒకరిద్దరిని పక్కన పెడితే, ఆశించిన స్తాయిలో అయితే, జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడడం లేదు. తమను తాము రక్షించుకునే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. సొంత పార్టీలోనే పొగబెడుతున్న పరిస్థితి తమ్ముళ్ల వ్యవహార శైలిలో స్పష్టంగా కనిపిస్తోంది.
లోకేష్ పైనే తమ్ముళ్ల మండిపాటు
ఇటీవల జరిగిన కీలక పరిణామం దీనికి బలం చేకూరుస్తోంది. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా కాకినాడ కేంద్రంగా కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.ఈ సమావేశంలో కీలకమైన విషయం అధినాయకత్వంపై నిప్పులు చెరగడమే! ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఇప్పటి వరకు చంద్రబాబు చెప్పినట్టు అందరూ విన్నారు. అయితే, రాబోయే ఐదేళ్ల కాలంలో వయసు రీత్యా కావొచ్చు.. లేదా పార్టీకి వారసుడిని ఎంచుకునే విషయంలో కావొచ్చు చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్ ను తెరమీదికి తీసుకు రావడం ఖాయం. ఇప్పటికే తన ప్రభుత్వంలో నెంబర్2 స్థానం ఆయన లోకేష్ కు కల్పించారు. రాబోయే రోజుల్లో నారా లోకేష్ ను టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసే అవకాశం ఉందని సమాచారం. దీంతో నాయకులు ఉలిక్కి పడుతున్నారు. నారా లోకేష్ ను ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు.దీనిపైనే ముఖ్యంగా చర్చించిన కాపు నాయకులు.. అన్ని విధాలుగా విఫలమైన లోకేష్ ను పార్టీకి నాయకుడిగా అంగీకరించేది లేదని, అదే జరిగితే.. తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమని అంతర్గత చర్చల్లో వెల్లడించారు. పట్టుమని పదినిముషాలు ప్రసంగిస్తే.. పాతిక తప్పులు చెప్పే నారా లోకేష్ ను ఎలా అంగీకరిస్తామని ఒకరు విమర్శిస్తే.. తాను తొలిసారి పోటీ చేసిన మంగళగిరిలోనే గెలవలేక పోయారు.. ఇక, పార్టీని ఏం నడిపిస్తారు? అని మరికొందరు విమర్శల బాణాలు ఎక్కుపెట్టారట. అంతేకాదు,అసలు దొడ్డిదారిన మంత్త్రిని చేయడాన్ని ఇంకొందరు ఎత్తిచూపించారు. ఇలా మొత్తానికి కాపు నాయకులకు లోకేష్ టార్గెట్‌గా మారాడనడంలో సందేహంలేదు. దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
No comments:
Post a Comment