Breaking News

10/06/2019

యదేఛ్చగా ఇసుక అక్రమ బట్టీలు


పాలమూరు, జూన్ 10, (way2newstv.in)
పాలమూరు జిల్లాల్లో 500లకు పైగా ఇటుకబట్టీలు జిల్లాలో అనధికారికంగా కొనసాగుతున్నాయి. ఇందులో మైనింగ్‌ శాఖ నుంచి అనుమతులు పొందినవి కేవలం 7 మాత్రమే. మిగతావి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్‌ శివార్లలోని తండాలు, జడ్చర్ల, మక్తల్‌, మాగనూరు, కృష్ణా మండలాలతోపాటు పలు ప్రాంతాల్లో ఈ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రభుత్వ శాఖలు తమకు సంబంధం లేనట్లు ప్రవర్తిస్తుండటంతో ఇటుక వ్యాపారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ప్రధానంగా ఇటుకను తయారు చేయడానికి వాడే మట్టిని అక్రమ మార్గాల ద్వారా బట్టీలకు తరలిస్తున్నారు. వీటికి గనుల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. ఒక బట్టీకి రూ.6వేలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇతర పన్నులూ చెల్లించాలి. ఎక్కడ కూడా అనుమతులు లేకుండా పనులు కొనసాగుతున్నాయి. దీంతో పాటు ఎక్కువగా ఈ బట్టీలను వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు పొందాలి.


యదేఛ్చగా ఇసుక అక్రమ బట్టీలు
 కార్మికుల భద్రత కోసం  కార్మిక శాఖ, పర్యావరణం కోసం కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకుని వ్యాపారం కొనసాగించుకోవాలి. ఎక్కడా ఈ నిబంధనలు అమలు కావడం లేదు. పట్టించుకునే వారే లేకపోవడంతో జిల్లాలో ఇటుక బట్టీల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. మక్తల్‌, మాగనూరు, కృష్ణా మండలాల పరిధిలోనే సుమారు 70కు పైగా ఇటుక బట్టీలు ఉన్నాయి. వీటిలో దేనికి కూడా అనుమతులు లేవు. పైగా ఇక్కడ ఇటుక బట్టీలో వాడే మట్టిని రైతుల పేరుతో మక్తల్‌ చెరువు నుంచి టిప్పర్లలో తరలిస్తున్నారు. దీని ద్వారా వ్యాపారులు రూ.లక్షలు దండుకుంటున్నారు. జడ్చర్ల- రాయచూరు జాతీయ రహదారికి ఆనుకునే పలు బట్టీలు ఉన్నాయి. ఇవన్నీ కళ్ల ముందు కనపడుతున్నా అధికారులకు పట్టనట్లు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు సైతం వచ్చి ఇక్కడ ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. మక్తల్‌ చెరువు నుంచి ఒండ్రుమట్టి ని రైతుల పేరుతో చెప్పి ప్రతి రోజు 15 టిప్పర్లలో ఇటుక బట్టీలకు తరలిస్తున్నారంటే ఏ స్థాయిలో వ్యాపారం నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో టిప్పర్‌ మట్టికి నిర్వాహకులు రూ.800 వరకు చెల్లిస్తున్నారు. ఇలా ఇటుక బట్టీలకు తరలించే మట్టికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు. కొందరు నేతల అండదండలతో ఈ వ్యాపారం కొనసాగుతోంది. మక్తల్‌ ప్రాంతంలోనే కాదు.. మిగతా మండలాల్లో కూడా ఇటుక బట్టీలకు స్థానిక నేతల సహకారం ఉండటంతో అధికారులు కూడా అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో జరుగుతున్న ఇటుక బట్టీ వ్యాపారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment