Breaking News

02/05/2019

పీకల్లోతు నష్టాల్లో కృష్ణా రీజియన్ ఆర్టీసీ

విజయవాడ, మే 2, (way2newstv.in)
రాజధాని ప్రాంతంలో కీలకంగా ఉన్న ఆర్టీసీ కృష్ణా రీజియన్ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. పరిపాలనా కేంద్ర స్థానంగా ఉన్న ఈ రీజియన్ లాభాల్లో ఉండాల్సింది పోయి  అంతులేని నష్టాలను మూట కట్టుకుంది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో విజయవాడ కేంద్రంగా ఆర్టీసీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కృష్ణా రీజియన్‌లో అంతర్భాగంగా విజయవాడ సిటీ ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజధాని ప్రాంత ఆర్టీసీ లాభాల్లో ఉండేది. విభజన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్టీసీకి అలాంటి పరిస్థితి లేదు. రోజురోజుకూ నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. నవ్యాంధ్రకు తలమానికమైన కృష్ణా రీజియన్లోనే ఈ పరిస్థితి ఉంటే, మిగిలిన జిల్లాల పరిస్థితి ఊహించుకోవచ్చు. కేంద్ర స్థానంలోనే మనుగడ కష్టమైతే ఇక పరిస్థితి ఏంటనే దానిపై ఉన్నతాధికారులు ఆలోచనలో పడ్డారు. దీంతో నష్టాలను తగ్గించుకోవటానికి చార్జీల పెంపు అంశాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు.ఆర్టీసీకి కేంద్ర స్థానంగా ఉన్న కృష్ణా రీజియన్ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. 2018- ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి రూ.36.66 కోట్ల నష్టాన్ని మూటకట్టుకుంది. 


పీకల్లోతు నష్టాల్లో కృష్ణా రీజియన్ ఆర్టీసీ

గత ఏడాది రూ.35.86 కోట్ల నష్టాలు ఉన్నాయి. మార్చి గణాంకాలు కూడా కలిపితే ఇంకా రూ.కోటి మేర నష్టం పెరగనుంది. కృష్ణా రీజియన్‌లో విజయవాడ సిటీ, కృష్ణా రూరల్ డివిజన్లలో 14 బస్‌డిపోలు ఉన్నాయి. వీటిలో విజయవాడ, ఆటోనగర్ బస్‌డిపోలు తప్పితే మిగిలిన 12 పీకల్లోతు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ప్రధానంగా విజయవాడ సిటీ డివిజన్ పరిధిలోని బస్‌డిపోలు ఆర్టీసీకి నష్టాన్ని మిగిలుస్తున్నాయి. నగరంలోని గవర్నర్ పేట-1, ఇబ్రహీంపట్నం, గవర్నర్‌పేట-2 డిపోలు భారీగా నష్టాన్ని తెచ్చిపెట్టాయి. రూరల్ పరిధిలో నూజివీడు, మచిలీపట్నం, జగ్గయ్యపేట, గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు డిపోలన్నీ అదే బాటలో ఉన్నాయి. కృష్ణా రీజియన్‌కు వచ్చిన నష్టం రూ.36.66 కోట్లను భర్తీ చేసి, లాభాల బాట పట్టాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. నష్ట నివారణకు రీజియన్లో గణనీయంగా బస్సుల ట్రిప్పుల సంఖ్యను అధికారులు తగ్గించారు. స్టాఫ్ రేషియో తగ్గించారు. ఆదాయం రాని చాలా రూట్లలో బస్సులను తగ్గించటం, రద్దు చేయటం వంటివి చేశారు. అయినా నష్టాల నుంచి తప్పించుకోలేక పోయారు. ఈ చర్యలు తాత్కాలికమేనని తేలిపోయింది. పర్సనల్ కాస్ట్ అంత కంతకూ పెరిగింది. ఖర్చుకు, ఆదాయానికి పొంతన కుదరడం లేదు. మెటీరియల్, టైర్ల ధరలు పెరిగిపోయాయి. డీజిల్ ఖర్చు భారీగా పెరిగింది. ఇవి కాకుండా జీతాలు, ఇంక్రిమెంట్లు, డీఏలు కూడా కొంతమేర భారం పడుతోంది. అంతేకాకుండా ఆర్టీసీ ప్రభుత్వానికి చెల్లించే పన్నుల కోటా కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో నష్టాలను తగ్గించుకోలేని పరిస్థితి నెలకొంది.రోడ్డు రవాణా సంస్థను డీజిల్ ధరలు ముంచేస్తున్నాయి. గత ఏడాది, ఈ ఏడాదికి చూస్తే డీజిల్ ధర రూ.3 మేర పెరిగింది. కృష్ణా రీజియన్‌లో బస్సులు రోజూ 62 వేల కిలోమీటర్లు తిరుగుతాయి. సగటున ఆర్టీసీ రోజుకు రూ.43.40 లక్షల డీజిల్ వినియోగిస్తోంది. నెలకు రూ.13.02 కోట్ల డీజిల్ వినియోగమ వుతోంది. ఏడాదికి రూ.156.24 కోట్లు డీజిల్‌కే ఖర్చవుతోంది. గత ఏప్రిల్‌తో పోల్చుకుంటే ఈ ఏప్రిల్ నాటికి పెరిగిన డీజిల్ ధర రూ.3 ప్రకారం చూస్తే రూ.6.70 కోట్ల మేర అదనంగా ఈ ఏడాది భారం పెరిగింది. డీజిల్ భారమే ఇంత ఉంటే, డీజిల్ మీద అమ్మకం పన్ను రూపంలో కోట్లాది రూపాయలను ఆర్టీసీ ప్రభుత్వానికి చెల్లిస్తోంది. దీంతో పాటు వ్యాట్‌ను కూడా చెల్లిస్తోంది. ఇది కూడా కోట్ల రూపాయల్లోనే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో చార్జీల పెంపు అనివార్యమని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment