Breaking News

20/05/2019

మాటలకే కమీషన్ (పశ్చిమ గోదావరి)

ఏలూరు, మే 20 (way2newstv.in): 
ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించే మహిళల కమీషన్‌ దస్త్రాలకే పరమితం అవుతోంది. మూడు నాలుగు వ్యవసాయ సీజన్లు దాటిపోతున్నా ఒక్క పైసా కూడా మహిళలకు చేరకపోవడం దురదృష్టకరం. వ్యవసాయం ప్రధానమైన పశ్చిమలో ఖరీఫ్‌, రబీ సీజన్లలో జరిగే ధాన్యం కొనుగోళ్లకు చాలా ప్రాధాన్యం ఉంది. ఏటా లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు చేరవేయడంలో వెలుగు ఆధ్వర్యంలోని ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్‌ కేంద్రాలు కీలకంగా నిలుస్తున్నాయి. వీటిని కష్టపడి నిర్వహించే మహిళలు మాత్రం ప్రతిఫలం పొందలేకపోతున్నారు. నిర్వహణ వ్యయం కోసం రెండు, మూడేళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి.జిల్లాలో 2017-18 వ్యవసాయ సీజన్‌లోని ఖరీఫ్‌, రబీతోపాటు గడచిన ఖరీఫ్‌ సీజన్‌కు ధాన్యం కొనుగోళ్ల కమీషన్‌ మహిళలకు బకాయి ఉంది. మూడు వ్యవసాయ సీజన్‌లకు సంబంధించి సుమారు రూ.30 కోట్లు కమీషన్‌ మహిళలకు అందాల్సి ఉంది. ఈ మొత్తాల కోసం మహిళలు ఎదురు చూస్తున్నారు. 


మాటలకే కమీషన్ (పశ్చిమ గోదావరి)


కొనుగోలు కమీషన్‌గా గ్రేడ్‌ ‘ఎ’ రకం ధాన్యానికి క్వింటాకు రూ.32, కామన్‌ రకం ధాన్యం క్వింటాకు రూ.31.50 చొప్పున మహిళలకు చెల్లించాలి. జిల్లాలో 2017-18 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి ఖరీఫ్‌లో 95,214 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినందుకు 56 స్వయం సహాయక సంఘాలకు కమీషన్‌గా రూ.3.04 కోట్లు అందాల్సి ఉంది. 2018 రబీకి సంబంధించి రూ.11.11 కోట్లు చెల్లించాల్సి ఉంది. రబీలో 3,45,193 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినందుకు 106 స్వయం సహాయ సంఘాలకు ఈ మొత్తం చెల్లించాల్సి ఉంది. ఇక గడచిన ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రూ.15.73లక్షలు కమీషన్‌ పైకం చెల్లించాలి. 4,91,640 టన్నుల ధాన్యం కొనుగోలుకు సంబంధించి 138 వెలుగు పీపీసీలకు కమీషన్‌ అందివ్వాలి. మొత్తంగా మూడు సీజన్‌లకు రూ.29.88 కోట్లు కమీషన్‌ మహిళలకు అందాలి. ఈ ఏడాది ఏప్రిల్‌ 2 నుంచి మరో సీజన్‌ ప్రారంభమైంది. కొనుగోళ్లు జరుగుతున్నాయి. కొనుగోళ్లు ముగిస్తేనే ప్రస్తుత సీజన్‌ లెక్కలు నిర్ధరణ కావు. పీఏసీఎస్‌లు కొనుగోళ్లు చేస్తున్నాయి. వీటికి ఇదే నిష్పత్తిలో కమీషన్‌ ఇవ్వాలి. ప్రస్తుత వ్యవసాయ సీజన్‌కు కూడా గ్రేడ్‌ ఎకు రూ.32, కామన్‌ రకానికి రూ.31.50 చొప్పున నిర్ధేశించారు. కొనుగోలు కమీషన్‌ అంశం. పౌరసరఫరాల శాఖ, డీఆర్డీఏల మధ్య ఉంది. మహిళలు పౌరసరఫరాల శాఖకు కేంద్రం నిర్వహణకు సంబంధించిన బిల్లులు పెట్టాలి. కొనుగోలు కేంద్రం నిర్వహించిన సీజన్‌లో ఎన్ని గోనెసంచులు ఉపయోగించారు. తిరిగి అప్పగించినవి ఎన్ని. ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొన్నారు. రైతులకు ఎంత చెల్లించారు. నిర్వహణ వ్యయం తదితర వివరాలను పౌరసరఫరాల శాఖకు నివేదించి రికన్షలేషన్‌ చేయించాలి. వీరికి బకాయి లేనట్లుగా నో డ్యూ సర్టిఫికెట్‌ ఇస్తారు. అనంతరమే ఈ శాఖ సంబంధిత పైకాన్ని డీఆర్డీఏకు అందిస్తుంది. తదుపరి గ్రామ సంఘం ఖాతాల ద్వారా కమిషన్‌ మొత్తం మహిళలకు చేరుతుంది.కేంద్రాల నిర్వాహకులు రికన్షలేషన్‌ చేయించడం లేదని పౌరసరఫరాల శాఖ, డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. మహిళలేమో సంచుల జమ ఎప్పుడో చెప్పేశాం. రికన్షలేషన్‌ ఎన్నికలకు ముందే చేయించాం. అయినా సొమ్ములు మాత్రం రావడం లేదని చెబుతున్నారు. కొనుగోలు చేసిన గ్రామ సంఘాలకు కమీషన్ల పైకం పూర్తిగా అందనివ్వడం లేదు. ఇందులో కోత విధిస్తున్నారు. కొంత మొత్తాన్ని మాత్రమే నిర్వహణ వ్యయంగా అందజేసి తిరిగి మిగిలిన మొత్తాలను డీఆర్డీఏకే జమ చేయిస్తున్నారు. దీని వల్ల ప్రతిఫలం ఎంత అందుతుందో తెలియని అయోమయం మహిళల్లో నెలకొంది. ఈ నిధులతోనే గ్రామ సంఘాల భవనాలు కడుతున్నామని అధికారులు చెబుతున్నారు. పీఎసీఎస్‌లకు మాత్రం కమీషన్లు అందజేస్తున్నారు. మహిళల విషయంలోనే వివక్ష సాగుతుందని వాపోతున్నారు. ఈ ఇబ్బందులను బయటపెడితే ఏ తంటా వస్తుందోనన్న ఆందోళనలోను మహిళలు ఉన్నారు.

No comments:

Post a Comment