Breaking News

12/03/2019

ప్రచార పర్వానికి సిద్ధమౌతున్న పార్టీలు

విజయవాడ, మార్చి 12 (way2newstv.in)
లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ ప్రణాళిక ప్రకటించడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నాయి. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ అధినేతలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తును దాదాపు పూర్తి చేశారు. ఆయా పార్టీలు ఇప్పటికే కొందరు అభ్యర్థుల పేర్లను ప్రకటించగా మరో మూడు, నాలుగు రోజుల్లో ఇతర అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. పార్టీల అధినేతల పరిస్థితి ఎలా ఉన్నా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల్లో మాత్రం ఆనందం వెల్లివిరుస్తోంది. వేసవి తాకిడి పూర్తిస్థాయిలో ఇబ్బంది పెట్టకముందే ఎన్నికల ప్రచార పర్వం ముగియనుండటంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. ఏప్రిల్ 11వ తేదీ పోలింగ్ ఉండటంతో అంతకు 48 గంటల ముందు ప్రచార కార్యక్రమం ముగించాల్సి ఉంటుందని వారంటున్నారు. 


ప్రచార పర్వానికి సిద్ధమౌతున్న పార్టీలు

దాంతో రానున్న నెల రోజులు కష్టపడ్డా ఆ తర్వాత అత్యంత వేడిని ఎదుర్కొనే ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చని వారంటున్నారు.ఎన్నికల ప్రచారం, పోలింగ్ తేదీ నాటికి జిల్లాలో 40 డిగ్రీల స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం 38 డిగ్రీల స్థాయిలో ఉన్న ఉష్ణోగ్రతలు పోలింగ్ తేదీ నాటికి మరో 2 డిగ్రీల స్థాయికి మించకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒక వైపు ప్రచారం విషయంలోనే కాకుండా గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రతరమైతే ప్రజలకు సమాధానం చెప్పడం కష్టమని నేతలంటున్నారు. పరిస్థితి విషమించక ముందే ప్రచార కార్యక్రమం ముగియనుండటంతో ఎంతో ఉపశమనం లభించినట్లేనని వారంటున్నారు. తొలి విడత ఒకే రోజు పోలింగ్ అదీ సరిగ్గా నెల రోజుల్లో ఎన్నికలు ముగియనుండటంతో రాజకీయ పార్టీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

No comments:

Post a Comment