Breaking News

18/03/2019

రెండు వర్గాలుగా చీలిపోయిన పశ్చిమ టీడీపీ

ఏలూరు, మార్చి 18, (way2newstv.in)
శ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పీతల సుజాతకు చంద్రబాబు మొండి చేయి చూపించారు. తాజాగా వెలువడిన 126 మంది టీడీపీ అభ్యర్థుల జాబితాలో సుజాతకు చోటు దక్కలేదు. 2004లో ఆచంట నుంచి తొలి సారి టీడీపీ తరపున పోటీ చేసిన సుజాత విజయం సాధించారు. 2009లో జిల్లాలో ఏకంగా చింతలపూడి, కొవ్వూరు, గోపాలపురం మూడు రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలు ఉన్నా ఆమెకు కొంత మంది పెద్దల ఒత్తిళ్ల‌ వల్ల సీటు దక్కలేదు. అయితే పార్టీ కోసం ఎంతో కమిట్‌మెంట్‌తో పని చేసిన సుజాత కష్టాన్ని గుర్తించిన చంద్రబాబు గత ఎన్నికల్లో మెట్ట ప్రాంతమైన చింతలపూడి సీటు కేటాయించారు. ఆ ఎన్నికల్లో 16,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన సుజాతకు చంద్రబాబు తన కేబినెట్‌లో కీలకమైన శాఖలు కట్టపెట్టారు.మంత్రిగా ఉన్న సుజాత నియోజకవర్గంలో తొలి మూడేళ్లలో అందరిని కలుపుకుపోవడంలో విఫలం అయ్యారు. అటు శాఖా పరంగానూ ఆమె పని తీరు అంతంత మాత్రంగానే ఉంది. ఇటు ఏలూరు ఎంపీ మాగంటిబాబు వర్గం నియోజకవర్గంలో బలంగా ఉండడం రాజ‌కీయ ఆధిపత్యం విషయంలో నియోజకవర్గ టీడీపీ కేడర్‌ సుజాత, ఎంపీ బాబు వర్గాలుగా చీలిపోయింది. చింతలపూడి పక్కనే ఉన్న దెందులూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విప్‌. చింతమనేని ప్రభాకర్‌తోనూ ఆమెకు గ్యాప్‌ ఉంది.


 రెండు వర్గాలుగా చీలిపోయిన పశ్చిమ టీడీపీ 

 చివరకు వీళ్లు చ‌క్రం తిప్పిన‌ నేపథ్యంలో చంద్రబాబు 2017లో జరిగిన కేబినెట్‌ ప్రక్షాళనలో సుజాతను మంత్రి పదవి నుంచి తప్పించారు. సుజాతను మంత్రి పదవి నుంచి తొలగించినప్పుడే ఆమెకు 2019 ఎన్నికల్లో టిక్కెట్‌ విషయంపై సందేహాలు నెలకొన్నాయి. ఎట్టకేలకు ఆమె వ్యతిరేకవర్గం టిక్కెట్ ద‌క్కకుండా చేసిన‌ ప్ర‌య‌త్నాలు గట్టిగా ఫలించడంతో ఆమెకు సీటు దక్కలేదు. ఒకానొక దశలో సుజాతను మంత్రి కేఎస్‌ జవహర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గానికి మారుస్తారన్న ప్రచారమూ జరిగింది.జవహర్‌ను కొవ్వూరులో పార్టీలోనే కొంత మంది తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఆయన్ను చింతలపూడి లేదా కృష్ణా జిల్లాలోని ఆయన సొంత నియోజకవర్గం అయిన తిరువూరుకు మార్చి సుజాతను కొవ్వూరు నుంచి రంగంలోకి దింపుతారని భావించారు. అందరూ ఊహించినట్టుగానే జవహర్‌ను తిరువూరు బరిలో దింపినా.. సుజాతకు మాత్రం మొండి చేయి చూపించారు. మరో విచిత్రం ఏంటంటే మూడు జిల్లాల అవతల విశాఖపట్నం జిల్లాలో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా వంగలపూడి అనితను తీసుకువచ్చి కొవ్వూరు బరిలోకి దింపడం గమనార్హం. అదే జిల్లాలో మాజీ మంత్రిగా, తాజా ఎమ్మెల్యేగా ఉన్నా సుజాతను కాదని విశాఖ జిల్లా నుంచి తీసుకువచ్చి అనితకు సీటు ఇవ్వడం పార్టీలోనే చాలా మందికి అంతుపట్టడం లేదు. పార్టీ కోసం 2004 నుంచి ఎంతో కమిట్‌మెంట్‌తో పని చేస్తు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసిన సుజాతను కేవలం ఎంపీ మాగంటి బాబు, విప్‌ ప్రభాకర్ ఒత్తిడినే సీటు లేకుండా చేసారన్న ప్రచారం జిల్లాలో జోరుగా జరుగుతోంది. తాజాగా విడుదల చేసిన జాబితాలో చింతలపూడి నుంచి కర్రా రాజారావుకు టీడీపీ సీటు ఖరారు అయ్యింది. 2009 ఎన్నికల్లో చింతలపూడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కర్రా రాజారావు స్వల్ప తేడాతో ఓడిపోయారు. తర్వాత టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి రాదని భావించిన కర్రా వైసీపీలోకి జంప్‌ చేసి ఆ పార్టీ సీటు కోసం ప్రయత్నాలు చేశారు. చివరకు 2014 ఎన్నికల ముంగిట తిరిగి టీడీపీలోకి వచ్చి సీటు కోసం ప్రయత్నాలు చేసినా చంద్రబాబు సుజాతకే సీటు ఇచ్చారు. చివరకు ఇప్పుడు సుజాతను పక్కన పెట్టి పార్టీ మారి వచ్చిన కర్రాకు సీటు ఇచ్చారు. ఇక తనకు టిక్కెట్‌ దక్కకపోవడంపై సుజాత తీవ్రమైన అసహనంతో ఉన్నారు. అవినీతి ఎమ్మెల్యేలు, పలు పార్టీలు మారి వచ్చిన వారికి సీటు ఇచ్చిన చంద్రబాబు తనకు మాత్రం అన్యాయం చేసారని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. పార్టీ విడుదల చేసే రెండు జాబితాలో అయినా ఆమెకు సీటు దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. ఏదేమైనా పార్టీలో సీనియర్‌గా ఉండి, పార్టీ కోసం కమిట్‌మెంట్‌తో పని చెయ్యడంతో పాటు ఏ నాడు అధిష్టానానికి ఎదురు చెప్పని వ్యక్తిగా ఉన్న సుజాత భవిష్యత్తు చంద్రబాబు నిర్ణయంతో డోలయామానంలో పడినట్లు అయ్యింది.

No comments:

Post a Comment