Breaking News

11/02/2019

కమలంలో అసమ్మతిపై హస్తం గురి

ప్రత్యర్ధి పార్టీల్లో విభీషణులను గుర్తించే పనిలో  కాంగ్రెస్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11, (way2newstv.in)
సొంతంగా అధికారపార్టీని ఎదుర్కోలేక ఆపసోపాలు పడుతున్న హస్తం పార్టీ ఎత్తుగడలను నమ్ముకుంటోంది. ఎదుటి పార్టీలో అసమ్మతి రేకెత్తితే తమకు లాభం కలుగుతుందని కలలు కంటోంది. ప్రత్యర్థి పార్టీలోని విభీషణులను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ కరిష్మా ముందు తమ అధినేత రాహుల్ సరితూగడం లేదన్న విషయం కాంగ్రెసు పార్టీకి బాగా తెలుసు. అందుకే ఎంతో కొంత ఆదరణ ఉండి బీజేపీలో ఉన్న అసంతృప్త, అసమ్మతివాదులను పట్టుకుని వారికి క్రేజ్ తెచ్చిపెడితే బాగుంటుందనే యోచనలో ముందడుగు వేస్తోంది. నిజానికి ఆ ప్లాన్ ఫలిస్తుందో లేదో ఎవరూ చెప్పలేరు. 


కమలంలో అసమ్మతిపై హస్తం గురి

కానీ కాంగ్రెసు పార్టీలోని నిరాశావహ వాతావరణానికి మాత్రం అద్దం పడుతోంది. తమ సొంతబలాన్ని నమ్ముకోకుండా ప్రత్యర్థి పార్టీలోని లుకలుకలపై దృష్టి పెట్టడం రాజకీయంగా ఆసక్తి గొలుపుతోంది. నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి వారు ప్రధాని మోడీ, అధ్యక్షుడు అమిత్ షా లకు ప్రత్యామ్నాయంగా పదవుల్లోకి వస్తారని కాంగ్రెసు నాయకులు విశ్వసిస్తున్నారు. నిజానికి బీజేపీ వాళ్లు చేయాల్సిన ఆలోచనను కాంగ్రెసు తలకెత్తుకోవడం విచిత్రంగా కనిపిస్తుంది.సంఘ్ పనితీరు తెలిసిన వారెవరూ తాజాగా చర్చలోకి వస్తున్న ప్రత్యామ్నాయాన్ని విశ్వసించరు. నిజానికి గడ్కరీ, చౌహాన్ లు ఆర్ఎస్ఎస్ కు అత్యంత విశ్వాసపాత్రులు, విధేయులు. మోడీ కంటే ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వానికి సన్నిహితులు. నాగపూర్ కేంద్రంగానే గడ్కరీ రాజకీయాల్లో ఎదిగారు. అయితే ప్రజల్లో ఆదరణ లేనివారిని తీసుకొచ్చి నెత్తిమీద రుద్దే ప్రయత్నం సంఘ్ చేయదు. గడ్కరీ బీజేపీ అధ్యక్షుడిగా చేసినప్పటికీ 2014లో ఆయనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్టు చేయలేదు. వాజపేయి, అద్వానీలకు ప్రజల్లో పలుకుబడి ఉండటంతో 2009 వరకూ వారిద్దరి అభ్యర్థిత్వాన్నే ఆమోదిస్తూ వచ్చింది. వాజపేయితో విభేదాలున్నప్పటికీ ఆయనను గద్దె దింపే ప్రయత్నం చేయలేదు. అద్వానీతో విభేదించినప్పటికీ 2009లో ఆయననే ప్రధానమంత్రి అభ్యర్థిగా బలపరిచింది. అంటే ప్రజల్లో ఆదరణను కూడా సంఘ్ నాయకత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. 2014లో మోడీలోని పొటెన్సియల్ లీడర్ షిప్ ను గుర్తించే పెద్ద పీట వేసింది. గడ్కరీని భుజానికెత్తుకుని జేజేలు పలకడం కాంగ్రెసు స్వీయ బలహీనతనే బయటపెడుతుంది.ప్రత్యర్థి సైతం పొగుడుతున్నాడని ఆనందించాలో, లేకపోతే పార్టీ పరంగా తన అవకాశాలకు గండి కొడుతున్నందుకు బాధ పడాలో తెలియని విచిత్రపరిస్థితి నితిన్ గడ్కరీది. కాంగ్రెసు నేతలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకుంటే ఆయనకు సంఘ్ మద్దతు లభించదు. సైద్ధాంతికంగా కాంగ్రెసుతో ఆర్ఎస్ఎస్ తీవ్రంగా విభేదిస్తుంది. కాంగ్రెసు విధానాలకు ప్రత్యామ్నాయంగా జాతీయ అజెండాతో ఒక పార్టీ ఉండాలనే ఉద్దేశంతోనే జనసంఘ్, భారతీయ జనతాపార్టీల వ్యవస్థాపనకు ఆయువుపట్టుగా నిలిచింది ఆర్ఎస్ఎస్. గడ్కరీకి మరో పరీక్ష ఎదురుకాబోతోంది. ఏదో రకంగా మోడీ, అమిత్ షా లు ఎన్నికల గండం నుంచి గట్టెక్కితే ఆ తర్వాత గడ్కరీకి కష్టకాలం తప్పదంటున్నారు పార్టీ నేతలు. ఈ ద్వయాన్ని ఎదుర్కోవడానికి పార్టీలో పెద్దలెవరూ సాహసించడం లేదు. అటువంటి స్థితిలో గడ్కరీ వారితో వైరం కొని తెచ్చుకోవడం అనవసర ప్రయాస అని పార్టీలో పెద్దలే పేర్కొంటున్నారు. అద్వానీ సహా అగ్రనాయకులెవరూ ప్రస్తుతానికి మోడీ, షా ల కు ఎదురు వెళ్లే సాహసం చేయడం లేదు. వారికి పార్టీలో లభిస్తున్న మద్దతే అందుకు ప్రధాన కారణం.ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇప్పటికీ దేశంలో అత్యధిక ఆదరణ కలిగిన రాజకీయవేత్త. ప్రెసిడెన్షియల్ తరహాలో దేశంలో ఎన్నికలు జరగడం లేదు. కానీ అంతటి ఆదరణను ప్రధాని పొందుతున్నారనేది అనేక రకాల సర్వేలు చాటిచెబుతున్న సత్యం. గడ్కరీ వంటివారికి దేశవ్యాప్తంగా ప్రజల్లో పెద్దగా పలుకుబడి లేదు. పరిచయమూ లేదు. వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ మోడీని బలంగా సమర్థించేవారికి కొదవ లేదు. ఒకవేళ నాయకత్వ మార్పు చేయాల్సి వస్తే పార్టీ మరింతగా దెబ్బతింటుంది. మరో అయిదారేళ్ల వరకూ పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మోడీపైనే ఉంచాలని పార్టీలోని మెజార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అవసరమైతే అమిత్ షా కు గుడ బై చెప్పవచ్చునేమో కానీ మోడీని పక్కనపెట్టడం మాత్రం సాధ్యం కాదంటున్నారు. తర్వాత తరం నాయకత్వం మళ్లీ ప్రజల్లో ఆదరణ ఉన్నవారి నుంచే పుట్టుకురావాలంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ వంటివారు ఆ వరసలో ఉన్నారు. ప్రస్తుతానికి మోడీ , అమిత్ షా లకు ఎదురు లేనట్లే. ఎన్నికల తర్వాత సైతం వారిద్దరే చక్రం తిప్పుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెసు, మమత, చంద్రబాబు నాయుడు వంటివారు మాత్రమే ప్రత్యామ్నాయ నాయకత్వం పేరిట బీజేపీని మరో కోణంలో చూసేందుకు యత్నిస్తున్నారు.

No comments:

Post a Comment