Breaking News

02/02/2019

ఘనంగా టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు

తిరుమల, ఫిబ్రవరి 2, (way2newstv.in) 
టిటిడిలో ఉద్యోగులు పని ఒత్తిడి, మానసిక ప్రశాంత, శారీరక దృఢత్వానికి మాత్రమే కాకుండా భక్తులకు విశేష రీతిలో సేవలు అందించడానికి క్రీడలు దోహదపడతాయని టిటిడి తిరుపతి జెఈవో  పోల భాస్కర్ పేర్కొన్నారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం వైనక వైపు గల పరేడ్ మైదానంలో ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు -2019 శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం టిటిడి కట్టుబడి ఉందని, ఇందుకోసం అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. ఉద్యోగులు ప్రతిరోజూ దైనందిన జీవనంలో కొంత సమయం ఏదో ఒక క్రీడను సాధన చేయాలని, దీనివల్ల శారీరక ఆరోగ్యంతోపాటు విధుల్లోనూ చురుగ్గా ఉంటారని అన్నారు. క్రీడాస్ఫూర్తితో విధులను నిర్వహించాలని సూచించారు. ఉద్యోగులందరూ పాల్గొని క్రీడోత్సవాలను విజయవంతం చేయాలని జెఈవో కోరారు.


ఘనంగా టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు

టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత మాట్లాడుతూ టిటిడిలో 1977వ సంవత్సరంలో క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈసారి పురుషులు, స్త్రీల విభాగంలో 40 ఏళ్ల లోపువారికి, 41 నుంచి 50 ఏళ్లల లోపువారికి, 50  ఏళ్ల  పైబడిన వారికి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు, దివ్యాంగ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. క్రీడాపోటీల్లో మొదటిస్థానం పొందినవారికి రూ.1800/-, రెండో స్థానం పొందినవారికి రూ.1600/-, మూడో స్థానం పొందినవారికి రూ.1400/- విలువగల గిఫ్ట్ కార్డులు బహుమతులుగా అందిస్తామన్నారు. పురుషుల విభాగంలో వాలీబాల్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, లాన్ టెన్నిస్, క్యారమ్స్, చెస్, టగ్ ఆఫ్ వార్, కబడ్డీ, మహిళల విభాగంలో టగ్ ఆఫ్ వార్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, క్యారమ్స్, చెస్, త్రోబాల్, డాడ్జిబాల్, కబడ్డి, పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.        ముందుగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మ‌ధ్య జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంత‌రం జాతీయ జెండాను,  క్రీడోత్సవాల జెండాను జెఈవో ఆవిష్కరించి, శాంతికపోతాలను, బెలూన్లను ఎగురవేశారు. ముందుగా పలు విభాగాల ఉద్యోగులు కవాతు నిర్వహించారు. అనంతరం ఉద్యోగులు క్రీడా ప్రతిజ్ఞ చేశారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి విజివో  అశోక్‌కుమార్ గౌడ్, డెప్యూటీ ఈవోలు  ఝాన్సీరాణి,  దేవేంద్రబాబు, ఎవిఎస్‌వో  నందీశ్వర్,  సురేంద్ర, అన్ని విభాగాల ఆధికారులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment