Breaking News

08/02/2019

చివరి సారి పోటీకి సిద్ధమౌతున్న రాయపాటి

గుంటూరు, ఫిబ్రవరి 8, (way2newstv.in)
నిన్న మొన్నటి వరకూ రాయపాటి సాంబశివరావు తాను రాజకీయాల్లో ఇక ఉండనని చెప్పారు. కానీ ఈ మధ్య మాత్రం తాను ఎంపీగా మరోసారి బరిలోకి దిగుతానని ప్రకటించారు. గతంలో గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన రాయపాటి సాంబశివరావు గత ఎన్నికల్లో నరసరావుపేట షిఫ్ట్ అయ్యారు. అక్కడ గెలిచి తన పట్టును నిరూపించుకున్నారు. రాయపాటి మరోసారి ఎంపీగా బరిలోకి దిగేది ఖాయమని తెలుస్తోంది. తనతో పాటు తన కుమారుడు రాయపాటి రంగారావును కూడా అసెంబ్లీ బరిలో దింపాలని ఆయన భావిస్తున్నారు. అందుకు నియోజకవర్గాన్ని కూడా వెదుక్కున్నారు.గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంపై రాయపాటి కన్నేశారు. ఇక్కడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోడెల శివప్రసాదరావు సొంత గ్రామమైన కండ్లకుంట నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో కలిసింది. దీనికి తోడు గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండటంతో ఆయన అయిష్టంగానే నరసరావుపేట స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ప్రధాన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై కేవలం 800 ఓట్ల తోనే గెలిచారు. 


చివరి సారి పోటీకి సిద్ధమౌతున్న రాయపాటి

తర్వాత స్పీకర్ అయ్యారు. స్పీకర్ అయిన తర్వాత కూడా ఆయన నరసరావుపేట నియోజకవర్గాన్ని వదులుకోలేదు.నరసరావుపేటకు టీడీపీ ఇన్ ఛార్జిని కూడా నియమించకుండా అంతా తానే అయి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. వీలు కుదిరితే వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి పోటీ చేయాలని, తన కుమారుడిని సత్తెన పల్లి నుంచి బరిలోకి దించాలన్నది కోడెల ఆలోచన. అయితే కోడెల నరసరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే సత్తెనపల్లి స్థానాన్ని తమకు ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు ఫిట్టింగ్ పెట్టారంటున్నారు. తమకు బలమైన నియోజకవర్గమని, ఖచ్చితంగా గెలిపించుకువస్తామని, తన కుమారుడు రాయపాటి రంగారావుకు టిక్కెట్ ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబు వద్ద ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ లో బలమైన అభ్యర్థిగా ఉండి, గతంలో సత్తెన పల్లి నుంచి గెలిచిన యర్రం వెంకటేశ్వరరెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కోడెల కుటుంబం పై ఉన్న వ్యతిరేకత కారణంగా అక్కడ మరోసారి వారు గెలిచే అవకాశం లేదని రాయపాటి వర్గీయులు బహిరంగంగానే చెబుతున్నారు. తనకున్న బలంతో పాటు యర్రం వెంకటేశ్వరరెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చి కుమారుడిని ఎమ్మెల్యేగా చేయాలన్న ఆలోచనలో రాయపాటి సాంబశివరావు ఉన్నారు. అయితే ఈ ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద రాయపాటి కన్ను సత్తెనపల్లి మీద పడటంతో కోడెల కూడా తన ప్రయత్నాలు తాను మొదలుపెట్టారంటున్నారు. మరి ఇద్దరిలో ఎవరి కుటుంబానికి టిక్కెట్ దక్కుతుందో చూడాలి.

No comments:

Post a Comment